Begin typing your search above and press return to search.

రాజీవ్‌ గాంధీపై వైరల్‌ గా సోనియా గాంధీ వ్యాఖ్యలు!

మాజీ ప్రధాని, తన భర్త దివంగత రాజీవ్‌ గాంధీపై ఆయన సతీమణి, కాంగ్రెస్‌ పార్టీ అగ్ర నేత సోనియా గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు

By:  Tupaki Desk   |   21 Aug 2023 10:17 AM GMT
రాజీవ్‌ గాంధీపై వైరల్‌ గా సోనియా గాంధీ వ్యాఖ్యలు!
X

మాజీ ప్రధాని, తన భర్త దివంగత రాజీవ్‌ గాంధీపై ఆయన సతీమణి, కాంగ్రెస్‌ పార్టీ అగ్ర నేత సోనియా గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్‌ గా మారాయి. రాజీవ్‌ గాంధీ రాజకీయ జీవితం అత్యంత దారుణ రీతిలో ముగిసిందని సోనియా వాపోయారు. కానీ ఆయన పాలించిన కొద్దికాలంలోనే ఎన్నో కీలక విజయాలను సాధించారని సోనియా గుర్తు చేశారు. ఆగస్టు 20న రాజీవ్‌ గాంధీ జన్మదినం సందర్భంగా ఢిల్లీలో ప్రదానం చేసిన 25వ రాజీవ్‌ గాంధీ నేషనల్‌ సద్భావన అవార్డు కార్యక్రమంలో సోనియా కీలకోపన్యాసం చేశారు.

'రాజీవ్‌ గాంధీ రాజకీయ జీవితం దారుణమైన రీతిలో ముగిసింది. కానీ.. ఆయన పాలించిన కొద్ది కాలంలోనే లెక్కలేనన్ని విజయాలు సాధించారు. ముఖ్యంగా ఆయన మహిళా సాధికారతకు ఎంతో పాటు పడ్డారు. ఈ క్రమంలో పంచాయతీలు, మున్సిపల్‌ కార్పొరేషన్లలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కృషి చేశారు. స్థానిక సంస్థల్లో ప్రస్తుతం భారీ స్థాయిలో ఎన్నికైన మహిళా ప్రజాప్రతినిధులు ఉన్నారంటే.. అందుకు రాజీవ్‌ కఠోర శ్రమ, దూరదృష్టే కారణం తప్ప మరొకటి కాదు. అలాగే ఓటు వేసే వయసును 21 నుంచి 18కి తగ్గించారు' అంటూ సోనియా తన భర్త రాజీవ్‌ గాంధీపై పొగడ్తల వర్షం కురిపించారు.

'ప్రస్తుతం సమాజంలో విద్వేషం, విభజన, పక్షపాత, మత రాజకీయాలు చురుగ్గా జరుగుతున్నాయి. వాటికి అధికార పక్షం (బీజేపీ) మద్దతు లభిస్తోంది. కాబట్టి ఈ సమయంలో మత సామరస్యం, శాంతి, దేశ ఐక్యత వంటివాటిని కాపాడుకోవాలి. అన్ని మతాలు, సంస్కృతులు, భాషలు, జాతుల సమాహారం వల్లే ఈ దేశ ఐక్యత బలోపేతం అవుతుంది. రాజీవ్‌ సైతం దీన్నే నమ్మేవారు' సోనియా తన ప్రసంగంలో పేర్కొన్నారు.

కాగా ఈ కార్యక్రమంలో భాగంగా రాజస్థాన్‌లోని బనస్థలి విద్యాపీఠ్‌కు 2020-21వ సంవత్సరానికి 25వ రాజీవ్‌ సద్భావన అవార్డును మాజీ ఉపరాష్ట్రపతి హమీద్‌ అన్సారీ చేతుల మీదుగా బహూకరించారు. ఈ అవార్డు కింద రూ.10 లక్షల నగదు, ప్రశంసా పత్రం.. ఆ సంస్థకు చెందిన సిద్ధార్థ్‌ శాస్త్రికి అందించారు.

కాగా దివంగత ప్రధాని రాజీవ్‌ గాంధీ తన తల్లి ఇందిరా గాంధీ మరణానంతరం 40 ఏళ్ల వయసులో ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 1989 డిసెంబర్‌ 2 వరకు ఆ పదవిలో కొనసాగారు. 1944, ఆగస్టు 24న జన్మించిన రాజీవ్‌ గాంధీ శ్రీలంకకు చెందిన ఎల్టీటీఈ జరిపిన ఆత్మాహుతి దాడిలో 1991, మే 21న మృతి చెందారు. తమిళనాడులోని పెరంబుదూరులో ఎన్నికల ప్రచారానికి వెళ్లగా ఈ ఘటన జరిగింది.