సోనియా ఫినిషింగ్ టచ్ ఇస్తారా ?
ఇంతమంది ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నా సోనియా గాంధి రాని లోటు స్పష్టంగా తెలుస్తోందని కాంగ్రెస్ సీనియర్లు తెగ బాధిపడిపోతున్నారు.
By: Tupaki Desk | 26 Nov 2023 6:04 AM GMTమరో రెండు రోజుల్లో తెలంగాణా ఎన్నికల ప్రచారం ముగియబోతోంది. ఎన్నికల ప్రక్రియ ఊపందుకున్న తర్వాత కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధి ఒక్కసారి కూడా ప్రచారంలో పార్టిసిపేట్ చేయలేదు. 28వ తేదీ సాయంత్రానికి ప్రచారానికి తెరపడబోతోంది. అందుకనే ఎలాగైనా చివరి రెండు రోజులు సోనియాను ప్రచారానికి వచ్చేట్లుగా చేయాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అండ్ కో గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే విషయాన్ని రాహుల్ గాంధితో పాటు ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, కర్నాటక పీసీసీ అధ్యక్షుడు, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ తో కూడా చర్చించినట్లు పార్టీవర్గాలు చెప్పాయి.
ఎన్నికల ప్రచారంలో ప్రియాంకగాంధి, రాహుల్ చాలా నియోజకవర్గాల్లో పాల్గొన్నారు. అలాగే కొన్ని నియోజకవర్గాల్లో రోడ్డుషోలు కూడా చేశారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే కూడా కొన్ని నియోజకవర్గాల్లో ప్రసంగించారు. ఇక డీకే అయితే కొద్దిరోజులుగా ఇక్కడే క్యాంపు వేసున్నారు. ఇంతమంది ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నా సోనియా గాంధి రాని లోటు స్పష్టంగా తెలుస్తోందని కాంగ్రెస్ సీనియర్లు తెగ బాధిపడిపోతున్నారు.
అందుకనే ఎలాగైనా సోనియాను ఎన్నికల ప్రచారంలో రప్పించాలన్నది రేవంత్ పట్టుదలగా ఉంది. ఇదే విషయాన్ని రాహుల్ తో మాట్లాడినపుడు సోనియాతో మాట్లాడి ఏ విషయం చెబుతానన్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సోనియాను ఎన్ని వీలైతే అన్ని నియోజకవర్గాల్లో ప్రచారం చేయించాలన్నది పీసీసీ ఆలోచన. అయితే ఆమె అనారోగ్యం ఎంతవరకు సహకరిస్తుందన్నది పెద్ద పాయింట్. తెలంగాణా రాష్ట్రం ఇచ్చిన నేతగా సోనియా ప్రచారంలో పాల్గొంటే ఫినిషింగ్ టచ్ చాలా ఎఫెక్టివ్ గా ఉంటుందని కాంగ్రెస్ నేతలు బాగా ఆవపడుతున్నారు.
అయితే వీళ్ళ ఆలోచనలు, ఆశలు ఎంతవరకు వర్కవుటవుతాయో ఎవరు చెప్పలేకపోతున్నారు. అందుకనే ప్లాన్ బీ ప్రకారం కనీసం తెలంగాణా ఓటర్లకు ఒక వీడియో మెసేజ్ అన్నా వినిపించాలన్న ఆలోచన చేస్తున్నారు. ఆ వీడియో ప్రసంగాలను మొత్తం అన్నీ నియోజకవర్గాల్లోను ప్లే చేస్తే ఎలాగుంటుందని ఆలోచిస్తున్నారు. మొత్తంమీద ఏదో రూపంలో సోనియాతో ఎన్నికల ప్రచారానికి ఫినిషింగ్ టచ్ ఇప్పించాలన్న కాంగ్రెస్ నేతల ఆలోచన ఏమవుతుందో చూడాల్సిందే.