కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ ఆస్తుల వివరాలివే!
ఈ సందర్భంగా ఆమె ఆస్తుల వివరాలు వెళ్లడించారు. ఇందులో భాగంగా... సోనియా గాంధీ మొత్తం ఆస్తుల విలువ రూ.12.5 కోట్లు (12,53,76,822) గా ప్రకటించారు.
By: Tupaki Desk | 17 Feb 2024 4:25 AM GMTఎన్నికల సీజన్ సమీపించిందంటే ప్రధానంగా కీలక నేతల ఆస్తుల విషయం చర్చకు వస్తుంటుంది. అఫిడవిట్ లో వారు చూపించే ఆస్తుల వివరాలు ఎన్ని.. వారికి ఎంత ఆస్తులు ఉన్నాయి.. ఎన్ని అప్పులు ఉన్నాయి వంటి వివరాలపై ఆసక్తి సహజంగా ఉంటుంది. పైగా చాలా మంది పార్టీ అధినేతలకూ, మాజీ ముఖ్యమంత్రులకు సైతం కార్లు లేకపోవడం, అప్పులు ఉండటం వంటి విషయాలు ఈ సమయలోనే వెళ్లడవుతూ ఉంటుంది. అవి చూసి పాపం వారి వారి కార్యకర్తలు ఆవేదన చెందుతూ ఉంటారు.
ఆ సంగతి అలా ఉంటే... కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ ఆస్తుల విషయం ఇప్పుడు తెరపైకి వచ్చింది. అవును... వరుసగా 25 సంవత్సరాలపాటు లోక్ సభకు ప్రాతినిధ్యం వహించిన సోనియాగాంధీ ఈసారి రాజ్యసభకు నామినేషన్ వేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... ఉత్తరప్రదేశ్ లోని రాయ్ బరేలీ సీటును కూతురు ప్రియాంక గాంధీకి వదిలేశారని చెబుతున్న వేళ.. ఆమె రాజస్థాన్ నుంచి రాజ్యసభకు వెళ్తున్నారు.
ఈ సందర్భంగా ఆమె ఆస్తుల వివరాలు వెళ్లడించారు. ఇందులో భాగంగా... సోనియా గాంధీ మొత్తం ఆస్తుల విలువ రూ.12.5 కోట్లు (12,53,76,822) గా ప్రకటించారు. వాస్తవానికి 2014లో సోనియా గాంధీ ఆస్తుల విలువ రూ.9.28 కోట్లుగా ఉండగా... 2019లో రూ.11.82 కోట్లుగా అయింది. ఇదే క్రమంలో... ఆమె వద్ద కోటిరూపాయల విలువైన ఆభరణాలు ఉన్నాయి.
వీటితో పాటు ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ నుంచి వచ్చే రాయల్టీ, పెట్టుబడులు, బ్యాంకు డిపాజిట్లు, బాండ్లు మొదలైనవాటి ద్వారా వచ్చే ఆస్తుల విలువ రూ.6.38 కోట్లుగా ఉండగా... వీటిపై వస్తున్న వడ్డీతోపాటు ఎంపీ వేతనం తనకు ఒక ఆదాయ వనరు అని సోనియాగాంధీ వెల్లడించారు. వీటితోపాటు ఇటలీలో వారసత్వంగా వచ్చిన ఇల్లు కూడా ఉన్నట్లు సోనియా వెల్లడించారు. ఆ ఇంటి విలువ 2014లో రూ.19.9 లక్షలుగా ఉండగా.. ప్రస్తుతం అది రూ.26.83 లక్షలుగా ఉన్నట్లు తెలిపారు.
ఇక క్వాలిఫికేషన్స్ విషయానికొస్తే... 1964లో విదేశీ భాషల్లో మూడు సంవత్సరాల కోర్సు పూర్తి చేసినట్లు చెప్పిన సోనియా గాంధీ... 1965లో ఆంగ్లంలో సర్టిఫికేట్ కోర్సు చేసినట్లు వెల్లడించారు. ఇదే క్రమంలో... తనకు వ్యక్తిగతంగా ఎటువంటి సామాజిక మాధ్యమ ఖాతాలు లేవని పేర్కొన్న సోనియాగాంధీ... ఇప్పటివరకూ ఎలాంటి క్రిమినల్ కేసులలోను దోషిగా తేలలేదని వెల్లడించారు.
కాగా... దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో 56 మంది రాజ్యసభ సభ్యుల పదవీకాలం ఏప్రిల్ లో ముగియబోతుండగా... వీటికి జనవరిలో నోటిఫికేషన్ జారీచేసింది ఎన్నికల కమిషన్. దీంతో ఈ నెల 27న పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తొలిసారిగా సోనియాగాంధీ రాజ్యసభకు ఎన్నిక కానున్నారు. ఈ నేపథ్యంలో... ఇంతకాలం ఆమె ప్రాతినిధ్యం వహించిన ఉత్తరప్రదేశ్ లోని రాయ్ బరేలీ నియోజకవర్గం నుంచి ప్రియాంక గాంధీ పోటీచేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.