అప్పుడు రాహుల్.. ఈసారి సోనియా!
సోనియాగాంధీ తొలిసారి 1999లో ఉత్తరప్రదేశ్ లోని అమేథి, కర్ణాటకలోని బళ్లారి నుంచి పోటీ చేసి రెండు స్థానాల్లోనూ విజయం సాధించారు
By: Tupaki Desk | 29 Aug 2023 8:03 AM GMTవచ్చే పార్లమెంటు ఎన్నికల్లో మరోసారి గెలిచి కేంద్రంలో అధికారంలోకి రావాలని బీజేపీ కృతనిశ్చయంతో ఉంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఎన్డీయే కూటమిలోని పార్టీలతో ఢిల్లీలో సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి దాదాపు 28 పార్టీలు హాజరయ్యాయి. అయితే వీటిలో ఒక్క ఎంపీ కూడా లేని పార్టీలే ఎక్కువ అని అప్పట్లో విమర్శలు వ్యక్తమయ్యాయి.
మరోవైపు ఎన్డీయే కూటమికి పోటీగా కాంగ్రెస్ నేతృత్వంలో ప్రతిపక్ష పార్టీలన్నీ ‘ఇండియా’ కూటమిగా ఏర్పడ్డాయి. ఇందులోనూ దాదాపు 20కి పైగా పార్టీలు ఉన్నాయి. ఇప్పటికే ఇండియా కూటమి సమావేశాలు బెంగళూరులో జరిగాయి. ఆగస్టు 31, సెప్టెంబర్ 1న ముంబైలో మరోసారి సమావేశం కానున్నాయి.
ఈ నేపథ్యంలో బీజేపీ.. ప్రతిపక్షాల్లోని కీలక నేతలను ఓడించడానికి వ్యూహం రచిస్తోందని టాక్ నడుస్తోంది. 2019 ఎన్నికల్లో ఇలాగే కాంగ్రెస్ కంచుకోట అయిన అమేథిలో ఆ పార్టీ అగ్ర నేత అయిన రాహుల్ గాంధీని బీజేపీ ఓడించింది. అమేథిలో కేంద్ర మంత్రి, బీజేపీ నేత స్మృతి ఇరానీ.. రాహుల్ పై విజయం సాధించారు.
కాగా ఈసారి ఎన్నికల్లో రాహుల్ గాంధీతోపాటు సోనియాగాంధీ (రాయ్ బరేలి), సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ సతీమణి డింపుల్ యాదవ్ (ఆజంగడ్/కనౌజ్), ఆర్జేడీ అధినేత లలూప్రసాద్ యాదవ్ కుమార్తె మీసా భారతి, ఎన్సీపీ అధినేత శరద పవార్ కుమార్తె సుప్రియా సూలే (బారామతి), ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే (గుల్బర్గా) తదితర ముఖ్య నేతలను ఓడించడానికి బీజేపీ ప్రణాళికలు రచిస్తోందని అంటున్నారు.
ఇప్పటికే ఈ దిశగా బీజేపీ సమావేశం కూడా నిర్వహించిందని చెబుతున్నారు. ముఖ్యంగా 1999 నుంచి అప్రహతిహతంగా గెలుస్తూ వస్తున్న సోనియా గాంధీని ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ ఓడించాలని బీజేపీ లక్ష్యం నిర్దేశించుకుందని అంటున్నారు.
సోనియాగాంధీ తొలిసారి 1999లో ఉత్తరప్రదేశ్ లోని అమేథి, కర్ణాటకలోని బళ్లారి నుంచి పోటీ చేసి రెండు స్థానాల్లోనూ విజయం సాధించారు. ఇక 2004, 2009, 2014, 2019 ఎన్నికల్లో ఉత్తర ప్రదేశ్ లోని రాయ్ బరేలి నుంచి ఎన్నికవుతూ వస్తున్నారు. ఇప్పటివరకు వరుసగా ఐదుసార్లు ఎంపీగా గెలుపొందారు.
ఇక రాహుల్ గాంధీ సైతం తొలిసారి 2004లో అమేథి నుంచి విజయం సాధించారు. 2009, 2014లోనూ అక్కడ నుంచే గెలిచారు. 2019లో అమేథిలో ఓడిపోయిన రాహుల్ కేరళలోని వయనాడ్ నుంచి ఎంపీగా విజయం సాధించారు. ఈసారి రాహుల్ అమేథి నుంచే పోటీ చేసే వీలుంది.
మరోవైపు 75 ఏళ్ల సోనియా గాంధీ ఈసారి ఎన్నికల్లో పోటీ చేయకపోవచ్చని అంటున్నారు. ప్రస్తుతం ఆమె అనారోగ్యంతో బాథపడుతున్నారు. కాంగ్రెస్ సమావేశాలకు సైతం ఆమె పెద్దగా హాజరుకావడం లేదు. రాహుల్, ప్రియాంకలే కాంగ్రెస్ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు.
వచ్చే ఎన్నికల్లో సోనియా పోటీ చేయకపోతే రాయ్ బరేలిలో ప్రియాంక పోటీ చేయొచ్చని చెబుతున్నారు. లేదా అమేథిలో ప్రియాంక పోటీ చేసి రాయ్ బరేలి నుంచి రాహుల్ పోటీ చేయొచ్చని అంటున్నారు. అయితే ఎవరు బరిలోకి దిగినా వీరిని ఓడించడానికి బీజేపీ ఇప్పటి నుంచే పక్కా ప్రణాళికతో సిద్ధమవుతోందని అంటున్నారు.
ప్రతిపక్ష పార్టీల్లో కీలక నేతలు పోటీ చేసే స్థానాల్లో ఆర్థికంగా, సామాజిక సమీకరణాల పరంగా అత్యంత బలమైన అభ్యర్థులను బరిలో దింపాలనేది బీజేపీ వ్యూహమని అంటున్నారు. ఇందుకోసం ప్రతిపక్ష నేతలు పోటీ చేసే కొన్ని ముఖ్యనియోజకవర్గాల్లో అభ్యర్థుల వెతుకులాటలో బీజేపీ ఉందని సమాచారం.
కేవలం రాహుల్, సోనియా/ప్రియాంకలే కాకుండా సుప్రియా సూలే (ఎన్సీపీ), కనిమొళి (డీఎంకే), మీసాభారతి (ఆర్జేడీ), డింపుల్ యాదవ్ (సమాజ్ వాదీ పార్టీ) ఇలా వివిధ పార్టీల్లో ముఖ్య నేతలను ఓడించడానికి బలమైన అభ్యర్థుల అన్వేషణలో బీజేపీ ఉందని తెలుస్తోంది. మరి బీజేపీ వ్యూహాలు ఫలిస్తాయా?