మ్యానిఫెస్టోను సోనియా డిక్లేర్ చేయబోతున్నారా ?
ఈనెల 17వ తేదీన హైదరాబాద్ కు సమీపంలోని తుక్కుగూడలో జరగబోయే భారీ బహిరంగ సభలో సోనియా గాంధీ మ్యానిఫెస్టోను రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం
By: Tupaki Desk | 11 Sep 2023 4:30 AMఈనెల 17వ తేదీన హైదరాబాద్ కు సమీపంలోని తుక్కుగూడలో జరగబోయే భారీ బహిరంగ సభలో సోనియా గాంధీ మ్యానిఫెస్టోను రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. ఇందుకు అవసరమైన ఏర్పాట్లను పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అండ్ కో చురుగ్గా చేస్తోందట. అదేరోజు మూడు డిక్లరేషన్లను కలిపి సోనియా ప్రకటించబోతున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. మైనారిటీ, బీసీ, మహిళా డిక్లరేషన్లతో పాటు మ్యానిఫోస్టోలోని కీలక అంశాలను ఇప్పటికే పీసీసీ నేతలు సోనియాకు పంపారట.
రెండు రోజులుగా మూడు డిక్లరేషన్లపై డీటైల్డ్ గా అధ్యయనం చేసిన తర్వాత ఇన్ పుట్స్ ను సోనియాకు పంపబోతున్నారు. అన్నింటినీ కలిపి 17వ తేదీ తెలంగాణా విమోచనం రోజున బహిరంగసభలో సోనియా కీలక ప్రకటన చేయబోతున్నారు. అక్కడి నుండే మ్యానిఫెస్టోను డిక్లేర్ చేసినట్లుగా కాంగ్రెస్ నేతలు మొత్తం 119 నియోజకవర్గాల్లో భారీ ప్రచారాన్న ప్రారంభించబోతున్నారు. రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా సరే అధికారంలోకి రావాలన్నది కాంగ్రెస్ సీనియర్ల పట్టుదల. ఎందుకంటే ప్రత్యేక తెలంగాణా ఏర్పడిన తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయింది.
రాబోయే ఎన్నికల్లో కూడా ఓడిపోతే హ్యాట్రిక్ ఓటములను నమోదుచేసుకున్నట్లు లెక్కవుతుంది. పార్టీ ఓటములు నమోదవ్వటం ఎలాగున్నా పార్టీ కనుమరుగైపోవటం ఖాయం. ఎందుకంటే వరుసగా రెండు ఎన్నికల్లో ఓడిపోయిందంటే పదేళ్ళు ప్రతిపక్షంలో ఉందనిలెక్క. ఈ పదేళ్ళు సరిపోదన్నట్లుగా మరో ఐదేళ్ళు కూడా ప్రతిపక్షానికే పరిమితం అవ్వటం అంటే పార్టీ కనుమరుగు అయిపోతున్నట్లుగానే భావించాలి.
తమిళనాడు, పశ్చిమబెంగాల్, ఒడిస్సా, ఉత్తరప్రదేశ్, గుజరాత్, బీహార్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారానికి దూరమై దశాబ్దాలైపోయింది. అందుకనే పై రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఉందంటే ఉందన్నట్లుగా తయారైంది. వీటిల్లో బీహార్లో పరిస్ధితి నయమనే చెప్పాలి. రేపటి ఎన్నికల్లో ఓడిపోతే తెలంగాణాలో కూడా పరిస్ధితి అలాగే తయారవుతుందనటంలో అనుమానం లేదు. ఏపీలో పార్టీ పరిస్ధితి ఆ దిశగా వెళుతోంది. రెండు వరుసఎన్నికల్లో పార్టీ అభ్యర్ధుల్లో అత్యధికులకు డిపాజిట్లు కూడా రాలేదు. ఈ విషయాలు గుర్తుపెట్టుకున్నారు కాబట్టే తెలంగాణాలోని సీనియర్లు కాస్త జాగ్రత్తగా ఉంటున్నారు. మరి చివరకు ఏమి జరుగుతుందో చూడాలి.