నాడు అత్త ఇందిరాగాంధీ... నేడు కోడలు సోనియా!
కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఈసారి రాజ్యసభకు వెళ్తారని వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 14 Feb 2024 4:15 AM GMTకాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఈసారి రాజ్యసభకు వెళ్తారని వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఆమె రాజ్యసభకు పోటీ చేయలేదు. ప్రస్తుతం సోనియా వయసు 78 ఏళ్లు. ఆమె తరచూ అనారోగ్యం పాలవుతున్నారు. ఈ నేపథ్యంలో లోక్ సభకు బదులుగా రాజ్యసభకు పోటీ చేస్తారని చెబుతున్నారు.
ప్రస్తుతం సోనియా గాంధీ ఉత్తర ప్రదేశ్ లోని కాంగ్రెస్ పార్టీ కంచుకోట రాయ్ బరేలి నుంచి ఎంపీగా ఉన్నారు. 1999లో తొలిసారి ఆమె రాజకీయ అరంగేట్రం చేశారు. కర్ణాటకలోని బళ్లారి, ఉత్తరప్రదేశ్ లోని అమేథి నుంచి ఆ ఎన్నికల్లో ఎంపీగా విజయం సాధించారు. 2004, 2009, 2014, 2019 ఎన్నికల్లో సోనియా రాయ్ బరేలి నుంచి ఎంపీగా గెలుపొందారు.
ప్రస్తుతం ఆమె అనారోగ్య కారణాలతో రాజ్యసభకు పోటీ చేయొచ్చని చెబుతున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా రాజ్యసభలో ఖాళీ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన విడుదల చేసింది. ఈ నేపథ్యంలో సోనియా గాంధీ రాజస్థాన్ నుంచి రాజ్యసభకు పోటీ చేస్తారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. ఫిబ్రవరి 14న ఆమె నామినేషన్ దాఖలు చేస్తారని వెల్లడించాయి. ఈ మేరకు రాజస్థాన్ రాజధాని జైపూర్ లో పార్టీ నేతల సమక్షంలో నామినేషన్ వేస్తారని తెలుస్తోంది.
సోనియా నామినేషన్ కార్యక్రమంలో కుమారుడు రాహుల్ గాంధీ, కుమార్తె ప్రియాంక, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఉంటారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. రాజస్థాన్ నుంచి మూడు రాజ్యసభ స్థానాలకు ఈ నెల 27న ఎన్నికలు జరగనున్నాయి. అందులో ఒకటి కాంగ్రెస్ పార్టీకి దక్కనుంది.
ప్రస్తుతం రాజస్థాన్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పదవీకాలం ముగుస్తున్న నేపథ్యంలో ఈ స్థానానికి ఎన్నిక జరుగుతోంది.
కాగా గాంధీ కుటుంబం నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యే రెండో నేతగా సోనియా గాంధీ రికార్డు సృష్టించబోతున్నారు. గతంలో 1964 ఆగస్టు నుంచి 1967 ఫిబ్రవరి వరకూ మాజీ ప్రధాని ఇందిరా గాంధీ.. రాజ్యసభ సభ్యురాలిగా ఉన్నారు.