తెలంగాణ నుంచి సోనియా గాంధీ ఎంపీగా పోటీ చేస్తారా?
తెలంగాణలో మెజార్టీ ఎంపీ స్థానాలు గెలవాలంటే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఇక్కడ నుంచి పోటీ చేయించాలని ప్రయత్నాలు ప్రారంభించింది.
By: Tupaki Desk | 19 Dec 2023 5:16 AM GMTకాంగ్రెస్ పార్టీ తెలంగాణలో విజయం సాధించి ఊపు మీద ఉంది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఇదే జోరు కొనసాగించాలని భావిస్తోంది. ఇందుకు గాను చర్యలు తీసుకుంటోంది. పదేళ్ల బీఆర్ఎస్ పాలనకు చెక్ పెట్టి అధికారం హస్తగతం చేసుకుంది. అలాగే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఇదే ఊపు కొనసాగించి మెజార్టీ స్థానాలు దక్కించుకోవాలని పక్కా ప్రణాళిక రచిస్తోంది. బీఆర్ఎస్ పాలనను అంతమొందించినా దాన్ని మళ్లీ పోటీకి నిలవకుండా చేయాలని చూస్తోంది. వారు చేసిన అవినీతిని బయటపెట్టి వారి రాజకీయ భవితవ్యాన్ని ప్రశ్నార్థకంగా మలచాలని ఎత్తులు వేస్తోంది.
తెలంగాణలో మెజార్టీ ఎంపీ స్థానాలు గెలవాలంటే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఇక్కడ నుంచి పోటీ చేయించాలని ప్రయత్నాలు ప్రారంభించింది. ఏదో ఒక నియోజకవర్గం నుంచి సోనియా గాంధీ పోటీలో నిలిస్తే కాంగ్రెస్ పార్టీకి నూతనోత్తేజం వస్తుందని ఆశిస్తోంది. దీంతో పార్టీలోకి వలసలు పెరిగి పార్టీ సునాయాసంగా విజయం సాధిస్తుందని పలువురు నేతలు సూచిస్తున్నారు. పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ద్వారా సోనియా గాంధీకి విన్నవించేందుకు పార్టీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత తొలిసారిగా జరిగిన పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ ఈ మేరకు తీర్మానం చేసింది. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ నుంచి సోనియా గాంధీ పోటీ చేయాలని అభ్యర్థిస్తోంది. సంక్రాంతి తరువాత దీనికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక ప్రారంభమవుతుందని అంచనా వేస్తున్నారు. పార్టీలోకి బీఆర్ఎస్, బీజేపీ నుంచి సాధ్యమైనంత మంది నేతలను తీసుకురావాలని స్కెచ్ వేస్తున్నారు. పార్టీ బలం పెంచుకుని పట్టు సాధించాలని చూస్తోంది.
సోనియా గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేస్తే నేతల్లో ఉత్సాహం పెరుగుతుంది. తద్వారా ఎక్కువ సీట్లు గెలుచుకునే అవకాశం ఉంటుందని సూచిస్తున్నారు. అందుకే సోనియా గాంధీ తెలంగాణలో పోటీ చేస్తే మంచి ఫలితాలు వస్తాయని చెబుతున్నారు. దీని కోసం ఆమెను ఒప్పించే బాధ్యత మల్లిఖార్జున ఖర్గే కు అప్పగిస్తున్నారు. పార్టీ ప్రయోజనాల కోసం సోనియా ఈ సారి తెలంగాణ నుంచి పోటీ చేయాలనే వాదనలు పెరుగుతున్నాయి.