సోనియమ్మకు గిఫ్ట్ మిగిలే ఉంది.. అసలు బహుమానం అదే!
సొనియమ్మ ఆకాంక్షలు నెరవేర్చినం. తెలంగాణ ఇచ్చిన రాష్ట్రం తరఫున రుణం తీర్చుకున్నం- అని వీహెచ్ వంటి పెద్ద పెద్ద నాయకులు గంభీర ఉపన్యాసాలు చేశారు.
By: Tupaki Desk | 4 Dec 2023 6:46 AM GMTసొనియమ్మ ఆకాంక్షలు నెరవేర్చినం. తెలంగాణ ఇచ్చిన రాష్ట్రం తరఫున రుణం తీర్చుకున్నం- అని వీహెచ్ వంటి పెద్ద పెద్ద నాయకులు గంభీర ఉపన్యాసాలు చేశారు. అయితే. వాస్తవానికి సోనియమ్మకు గిఫ్ట్ తెలంగాణ గెలుపుతోనే సరిపోతుందా? తెలంగాణలో అధికారంలోకి రావడంతోనే ఆగిపోతుందా? అంటే.. కాదనే అంటున్నారు పరిశీలకులు. అసలు గిఫ్ట్ ఇప్పుడు వేరే ఉందని చెబుతున్నారు. దానికోసం నాయకులు కదలాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు.
సోనియా ఆనందం చూడాలన్నా.. రాహుల్ కళ్లలో మెరుపులు కనిపించాలన్నా.. తెలంగాణ కాంగ్రెస్ నేతలకు పెద్ద టాస్కే ఉందని చెబుతున్నారు. అదే.. పార్లమెంటు ఎన్నికలు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో అయినా.. గెలిచి.. నిలిచి ఢిల్లీ పీఠంపై కాంగ్రెస్ జెండాను ఎగరేయాలన్నది ఇటు సోనియమ్మ.. అటు రాహుల్ పెట్టుకున్న పెద్ద లక్ష్యాలు. తెలంగాణ గెలుపు దీనిలో ఒక భాగం మాత్రమే. పదేళ్లపాటు నిరీక్షణతో పాటు.. మోడీ సర్కారునుంచి ఎదురువుతున్న సుదీర్ఘ సమస్యల నుంచి బయట పడాలంటే.. కేంద్రంలో అధికారంలోకి రావాల్సిన అవసరం ఉంది.
ఈ అవసరం.. కేవలం సోనియా, రాహుల్ గాంధీలకే కాదు.. తెలంగాణలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ దికూడా! ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినా.. కేంద్రంలో మోడీ సర్కారు వస్తే.. సహాయ నిరాకరణ తప్పదు. పైగా కేసుల కొలిమి రాజుకునే అవకాశం కూడా ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణ పరుగులు పెట్టించాలంటే.. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడాల్సిన అవసరం ఉంది.
దీనికి గాను.. ఇంటికో పువ్వు ఈశ్వరుడికో మాల చందంగా. తెలంగాణలోని 17 పార్లమెంటు స్థానాలను ఒడిసి పట్టుకునేందుకు.. ప్రయత్నాలు సాగాలి. ఇప్పటి నుంచే నాయకులు ముందుకు కదలాలి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ చూపిన చేవను అదే స్థాయిలో చూపించాలి. కనీసంలో కనీసం 15 స్థానాలు దక్కించుకుని గెలుపు గుర్రం ఎక్కితేనే తప్ప.. కేంద్రంలో కాంగ్రెస్ కు దన్నుగా ఉండే పరిస్థితి లేదు. ఇది జరిగితేనే.. ఇలా జరిగితేనే.. అప్పుడు అది సోనియమ్మకు నిజమైన గిఫ్ట్. సంపూర్ణమైన బహుమానం అవుతుంది.