అరెస్ట్ వారెంట్ పై స్పందించిన సోనూసూద్... ప్రచారంపై అసహనం!
ముంబైలోని అందేరి వెస్ట్ లో ఉన్న ఒషివారా పోలీస్ స్టేషన్ కు లుథియానా జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ రమన్ ప్రీత్ కౌర్ వారెంట్ జారీ చేశారు.
By: Tupaki Desk | 7 Feb 2025 9:16 AMప్రముఖ నటుడు సోనూసూద్ కు అరెస్ట్ వారెంట్ జారీ అయింది. చీటింగ్ కేసులో వాంగ్మూలం ఇవ్వడానికి రాకపోవడంతో పంజాబ్ లోని లుథియానా కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా.. సోనూసూద్ ను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టాలని ఉత్తర్వ్యుల్లో పేర్కొంది. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై సోనూసూద్ స్పందించారు.
అవును... ముంబైలోని అందేరి వెస్ట్ లో ఉన్న ఒషివారా పోలీస్ స్టేషన్ కు లుథియానా జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ రమన్ ప్రీత్ కౌర్ వారెంట్ జారీ చేశారు. సోనూసూద్ ను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టాలని ఉత్తర్వ్యుల్లో పేర్కొన్నారు. దీంతో... ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనిపై సోనూసూద్ 'ఎక్స్' వేదికగా స్పందించారు.
దీనిపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా... సోషల్ మీడియా వేదికగా హల్ చల్ చేస్తున్న వార్తలు చాలా సంచలనాత్మకమైన విషయాలు అని మొదలుపెట్టిన సోనూసూద్... విషయం సూటిగా, సరళంగా చెప్పాలంటే ఇది తనకు ఎలాంటి సంబంధం లేని అంశం అని అన్నారు.
ఇదే సమయంలో... ఈ విషయంలో కోర్టు తనను సాక్షిగా మాత్రమే పిలిచిందని తెలిపారు. దీనిపై తమ న్యాయవాదులు కోర్టుకు సమాధానం ఇచ్చారని.. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 10న దీనికి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడిస్తానని అన్నారు. మరోసారి.. ఈ కేసుకు, తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు.
ఇదే క్రమంలో... దీనిపై మీడియా అనవసరంగా దృష్టి సారిస్తోందని చెప్పిన సోనూసూద్.. సెలబ్రెటీలను టార్గెట్ చేయడం బాధాకారమని అన్నారు. దీనిపై తాము కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
కాగా... లుథియానాకు చెందిన న్యాయవాది రాజేష్ ఖన్నా.. తనకు మోహిత్ శర్మ అనే వ్యక్తి రూ.10 లక్షలు మోసం చేశాడని కోర్టులో కేసు వేశారు. ఈ సమయంలో.. రిజికా కాయిన్ పేరుతో తనతో పెట్టుబడి పెట్టించినట్లు పేర్కొన్నారు. ఈ కేసులో సదరు లాయర్.. నటుడు సోనూసూద్ ను సాక్షిగా పేర్కొన్నారు.
దీంతో... ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన కోర్టు.. సోనూసూద్ కు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. పలుమార్లు సమన్లు పంపించినా అతను హాజరుకాలేదని.. వెంటనే అతడిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టాలని మెజిస్ట్రేట్ ఉత్తర్వ్యుల్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కేసు ఈ నెల 10న మరోసారి విచారణకు రానుంది.