బ్రిటిష్ మహిళల ఓటు హక్కు.. భారతీయ యువరాణి సాహసం!
వ్యాపారం చేసుకుంటామంటూ వచ్చి బ్రిటిషర్లు భారతదేశాన్ని దాదాపు 200 ఏళ్లకు పైగా పరిపాలించిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 14 Sep 2023 1:30 PM GMTవ్యాపారం చేసుకుంటామంటూ వచ్చి బ్రిటిషర్లు భారతదేశాన్ని దాదాపు 200 ఏళ్లకు పైగా పరిపాలించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అప్పటికి దేశంలో ఉన్న చిన్న చిన్న రాజ్యాలను, జమీందారీ సంస్థానాలను బ్రిటిషర్లు ఆక్రమించుకున్నారు. తమ మాట విననివారిని బ్రిటన్ లోని చెరసాలకు తరలించారు. మరికొంతమందిని యుద్ధం పేరుతో అక్రమంగా వధించారు.
ఇలా తమ రాజ్యాన్ని కోల్పోయి బ్రిటన్ వెళ్లిపోయిన ఒక భారతీయు యువరాణి వల్లే బ్రిటిష్ మహిళలకు ఓటు హక్కు వచ్చిందంటే నమ్మగలరా! నమ్మలేకపోతున్నారా.. అయితే ఆ భారతీయ యువరాణి బ్రిటన్ లో చేసిన పోరాటం వల్లే ఆ దేశం మహిళలకు ఓటు హక్కు లభించింది. ఆ యువరాణి ఎవరో కాదు.. పంజాబ్ చివరి సిక్కు పాలకుడు మహారాజా దులీప్ సింగ్ కుమార్తె సోఫియా.
తాజాగా బీబీసీ కథనం ప్రకారం.. పంజాబ్ చివరి సిక్కు పాలకుడు.. మహారాజా దులీప్ సింగ్. బ్రిటిష్ పాలకులు 1840లో ఆయన సామ్రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆయనను బ్రిటన్ కు తరలించారు. దులీప్ సింగ్ భారతదేశానికి తిరిగి రావడానికి అన్ని ప్రయత్నాలు చేసినా వీలు కాలేదు. ఆ తర్వాత తనకు బ్రిటిషర్ల నుంచి అందిన పరిహారపు సొమ్ముతో ఆయన బ్రిటన్ లోని నార్ఫోక్ – సఫోల్క్ సరిహద్దులోని ఎల్వెడీన్ హాల్ ను కొనుగోలు చేశారు. ఆయన తన పిల్లలతో సహా అక్కడే నివాసం ఉన్నారు.
దులీప్ సింగ్ కుమార్తె సోఫియా కూడా ఎల్వెడీన్ లోనే పెరిగారు. మహారాజా దులీప్ సింగ్ కుటుంబం నాటి బ్రిటన్ రాణి విక్టోరియాతో చాలా సన్నిహితంగా వ్యవహరించేది. ఈ నేపథ్యంలోనే విక్టోరియా రాణి ఈ రాజ కుటుంబానికి హాంప్టన్ కోర్ట్ ప్యాలెస్ లో ఒక అపార్ట్‌మెంట్ ఇచ్చారు. సోఫియా.. ‘విక్టోరియా రాణి గాడ్ డాటర్’ గా గుర్తింపు పొందారు. ఈ కారణంతోనే సోఫియా యువరాణిలా పెరిగారు.
స్వతహాగా ఆమె భారతీయురాలైనప్పటికీ బ్రిటీష్ మహిళ మాదిరిగానే జీవితాన్ని గడిపారు. కాలక్రమేణా ఆమె బ్రిటన్ లో మహిళల హక్కుల కోసం ఏదైనా చేయాలని నిశ్చయించారు. అప్పటికే సోఫియా... ఉమెన్స్ సోషల్ అండ్ పొలిటికల్ యూనియన్ అండ్ ఉమెన్స్ టాక్స్ రెసిస్టెన్స్ లీగ్ లో సభ్యురాలుగా ఉన్నారు. ఈ లీగ్ బ్రిటన్ మహిళల ఓటు హక్కు కోసం పోరాడింది.
ఈ నేపథ్యంలో యువరాణి సోఫియా 400 మంది మహిళలతో కలిసి 1910లో బ్రిటీష్ పార్లమెంట్ ముందు నిరసనకు దిగారు. ఆ రోజును ‘బ్లాక్ ఫ్రైడే’గా పిలిచారు. యువరాణి సోఫియా స్వయంగా నినాదాలు చేయడమే కాకుండా నిరసనల్లోనూ పాలుపంచుకున్నారు. అంతేకాకుండా హాంప్టన్ కోర్ట్ ప్యాలెస్ లోని తన ఇంటి వెలుపల మహిళల ఓటు హక్కుకు సంబంధించిన వార్తాపత్రికలను సైతం ఆమె విక్రయించారు.
కాగా సోఫియా 1876లో జన్మించారు... 1903లో మొదటిసారి తన సొంత దేశం భారతదేశానికి వచ్చారు. రాజద్రోహం ఆరోపణలతో జైలుకెళ్లిన స్వాతంత్య్ర సమరయోధుడు.. పంజాబ్ కేసరి లాలా లజపతిరాయ్ సాగించిన పోరాట పటిమను చూసి స్ఫూర్తి పొందారు. ఇదే ఆమెను తిరిగి బ్రిటన్ వెళ్లాక బ్రిటీష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడేందుకు ప్రేరణగా నిలిచింది. బ్రిటన్ లో మహిళల ఓటు హక్కు కోసం తీవ్ర పోరాటం చేశారు.
అయితే యువరాణిగా ఉండి సోఫియా నిరసన ప్రదర్శనలకు దిగడంతో ఇంగ్లండ్ లో ఆమెను వ్యతిరేకించేవారి సంఖ్య కూడా పెరిగింది. అయినా ఆమె వాటిని లక్ష్యపెట్టలేదు. మహారాజా రంజిత్ సింగ్ మనవరాలు, దులీప్ సింగ్ కుమార్తె అయిన ప్రిన్సెస్ సోఫియా పోరాటాల కారణంగానే ఎట్టకేలకు బ్రిటిష్ మహిళలు ఓటు హక్కును పొందారు.
సోఫియా బ్రిటన్ మహిళలకు ఓటు హక్కు కల్పించడమే కాకుండా భారత స్వాతంత్య్ర పోరాటంలోనూ ఆమె పాలుపంచుకోవడం విశేషం. 1914లో మొదటి ప్రపంచ యుద్ధంలో గాయపడిన భారతీయ సైనికులకు వైద్య సేవలు అందజేశారు. అందుకు బ్లూ ఫ్లాక్ అవార్డును కూడా గెలుచుకున్నారు. యువరాణి సోఫియా భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చాక 1948లో తన 71 ఏళ్ల వయసులో మరణించారు.