ఎవరీ సోఫియా ఫిర్దౌస్? ఒడిశా రాజకీయాల్లో ఆమె ఎందుకంత సంచలనం?
ఇక్కడో ఆసక్తికరమైన అంశాన్ని ప్రస్తావించాలి. సోఫియా ఫిర్దౌస్ కు ఒడిశా తొలి మహిళా ముఖ్యమంత్రి అయిన నందిని సత్పతి ఆదర్శం.
By: Tupaki Desk | 9 Jun 2024 6:33 AM GMTఒడిశా రాజకీయ రంగంలో 32 ఏళ్ల మహిళ ఇప్పుడు సంచలనంగా మారారు. దీనికి కారణం ఆ రాష్ట్రంలో తొలిసారి ముస్లిం మైనార్టీకి చెందిన ఆమె.. రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆమె పేరు.. సోఫియా ఫిర్దౌస్. కాంగ్రెస్ అభ్యర్థిగా బారాబతి - కటక్ స్థానం నుంచి పోటీ చేసిన ఆమె ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థిని ఎనిమిదివేల మెజార్టీతో ఓడించారు. ఇంతకు ఆమె ఎవరు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏమిటి? అంత చిన్న వయసులో ఆమె కాంగ్రెస్ టికెట్ ను ఎలా సొంతం చేసుకుంది? లాంటి అంశాల్లోకి వెళితే..
సోఫియా ఫిర్దౌస్ ఎవరో కాదు. ఆమె ఒడిశా కాంగ్రెస్ సీనియర్ నేత మహమ్మద్ మోకిమో కుమార్తె. ఆయనపై అవినీతి ఆరోపణలు రావటంతో ఆయన్ను ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు వేశారు. దీంతో.. ఆయన తన కుమార్తెను ఎన్నికల బరిలో దింపారు. అయితే.. తన తండ్రి మీద ఉన్న అవినీతి మరక ఆమె గెలుపును ఆపలేకపోయింది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఒడిశా రాష్ట్ర చరిత్రలో ఎమ్మెల్యేగా ఎన్నికైన తొలి మహిళా ముస్లిం నేతగా ఆమె చెరగని రికార్డును క్రియేట్ చేశారు.
సివిల్ ఇంజనీరింగ్ పట్టాను కళింగ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ నుంచి సొంతం చేసుకున్న ఆమె.. 2022 నుంచి బెంగళూరులోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ లో ఎగ్జిక్యూటివ్ జనరల్ మేనేజ్ మెంట్ ప్రోగ్రాంను పూర్తి చేశారు. ఆమె ప్రముఖ పారిశ్రామికవేత్త షేక్ మెరాజ్ ఉల్ హక్ ను పెళ్లాడారు. 2023లో కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకు అధ్యక్షురాలిగా ఎన్నికైన ఆమె.. సీఆర్ ఈడీఏఐ మహిళా విభాగానికి తూర్పు విభాగానికి జోన్ కోఆర్డినేటనర్ గా పని చేశారు.
ఇక్కడో ఆసక్తికరమైన అంశాన్ని ప్రస్తావించాలి. సోఫియా ఫిర్దౌస్ కు ఒడిశా తొలి మహిళా ముఖ్యమంత్రి అయిన నందిని సత్పతి ఆదర్శం. ఆమె సైతం 1972లో బారాబతి - కటక్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎన్నిక కావటమే కాదు.. ముఖ్యమంత్రి అయ్యారు. దాదాపు 24 ఏళ్లుగా ఒడిశాను తన కంచుకోటగా మార్చుకున్న నవీన్ పట్నాయక్ ఈసారి ఎన్నికల్లో ఆయన పార్టీ ఓటమిపాలైంది. మొత్తం 147 స్థానాల్లో బీజేపీ 78 స్థానాల్లో విజయం సాధించగా.. ఇంతకాలం అధికారపక్షంగా ఉన్న బిజూ జనతాదళ్ విపక్ష పాత్రను పోషించనుంది.