Begin typing your search above and press return to search.

విమాన ప్రమాదంలో 179 మంది మృతి... ఆ పక్షి కారణమా?

ఇక, ఈ ప్రమాదం చోటు చేసుకున్న సమయంలో ఆరుగురు సిబ్బందితో పాటు 175 ప్రయాణికులు ఉన్నారని చెబుతున్నారు.

By:  Tupaki Desk   |   29 Dec 2024 8:16 AM GMT
విమాన ప్రమాదంలో 179 మంది మృతి...  ఆ పక్షి కారణమా?
X

ఇటీవల అజర్ బైజన్ ఎయిర్ లైన్స్ కు చెందిన ఫ్లైట్ జే2 - 8243 విమాన ప్రమాదంలో సుమారూ 40 మంది మృతి చెందడం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే! ఆ విమాన ప్రమాదానికి పక్షి ఢీకొనడమే కారణం అనే కథనాలు రాగా.. ఆ విమానాన్ని ఉక్రెయిన్ డ్రోన్ గా భావించి రష్యా దాడి చేసిందనే చర్చా తెరపైకి వచ్చింది.

దీంతో... ఆ విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇదే సమయంలో తాజాగా దక్షిణ కొరియాలోని ముయాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో ఘోర ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. అయితే... ఈ ప్రమాదానికి కారణం ల్యాండింగ్ గేర్ వైఫల్యమే అని అంటున్నా.. దానికంటే ముందు పక్షి ఢీకొనడం వల్లే ఇది జరిగిందనే చర్చ తెరపైకి వచ్చింది.

అవును... బ్యాంకాక్ నుంచి బయలుదేరిన ది బేజు ఎయిర్ ఫ్లైట్ కు చెందిన 7సీ2216 నంబర్ బోయింగ్ 737-800 శ్రేణి విమానం ల్యాండ్ అవుతూ అదుపుతప్పి, రక్షణ గోడను ఢీకొని, మంటల్లో చిక్కుకుని పేలిపోయింది. ఈ ఘోర ప్రమాదానికి ల్యాండింగ్ గేర్ వైఫల్యమే ప్రధాన కారణం అని తెలుస్తోందని అంటున్నారు.

ఈ సందర్భంగా స్పందించిన అధికారులు.. ఈ విమానం ప్రమాదానికి ముందు ఒకసారి ల్యాండింగ్ కు యత్నించి విఫలమైందని పేర్కొన్నారు. ఇది ఎయిర్ పోర్ట్ లో గోడను ఢీకొనడంతో విమానంలో ఇంధనం ఒక్కసారిగా మండిందని.. మంటలు వ్యాపించాయని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే పక్షి ఢీకొట్టిందనే విషయం తెరపైకి వచ్చింది.

ఈ సందర్భంగా స్పందించిన దక్షిణ కొరియా ఫైర్ చీఫ్ లీ జియోంగ్ హైయాన్... విమానం ఇంజిన్ ను పక్షి ఢీకొనడం.. వాతావారణ పరిస్థితుల కారణంగా ల్యాండింగ్ గేర్ లో సమస్య కారణమై ఉండొచ్చని పేర్కొన్నారు. ఇదే సమయంలో... ప్రమాదం జరిగిన వీడియో దృశ్యాల్లో కూడా విమానం రన్ వేపై అదుపుతప్పి దుసుకెళ్తూ గోడను ఢీకొనే సమయానికి ల్యాండింగ్ గేర్ వెనక్కే ఉన్నట్లు భావిస్తున్నట్లు తెలిపారు.

ఇదే సమయంలో... జరిగిన ప్రమాదానికి థాయిల్యాండ్ కు చెందిన జేజు ఎయిర్ సంస్థ క్షమాపణలు తెలిపింది. అదేవిధంగా... ప్రమాద నివారణకు తాము శక్తివంచన లేకుండా ప్రయత్నించినట్లూ వెల్లడించింది. బాధిత కుటుంబాలకు సాయం చేస్తామని ప్రకటించింది.

ఇక, ఈ ప్రమాదం చోటు చేసుకున్న సమయంలో ఆరుగురు సిబ్బందితో పాటు 175 ప్రయాణికులు ఉన్నారని చెబుతున్నారు. అయితే... వారిలో ఇద్దరు సిబ్బంది మాత్రమె ప్రాణాలతో బయటపడగా.. మిగిలిన 179 మంది మృతి చెందినట్లు చెబుతున్నారు. విమానంలో భారీ పేలుడు సంభవించడంతో అది మొత్తం కాలిపోయిందని అధికారులు ధృవీకరించారు.

మరోపక్క.. ఈ విమాన ప్రమాదంపై దక్షిణ కొరియా తాత్కాలిక అధ్యక్షుడు చోయ్ సాంగ్ మోక్ స్పందిస్తూ.. తక్షణమే అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు పోలీసు, అగ్నిమాపక శాఖలతో పాటు ఇంటీరియర్, ల్యాండ్ మినిస్టర్లకు మార్గదర్శకాలు జారీ చేశారు.

ఇదే సమయంలో... ముయాన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అన్ని విమానాల రాకపోకలను రద్దు చేశారు. కాగా... దక్షిణ కొరియాలో 1997లో జరిగిన విమాన ప్రమాదంలో 228 మంది మృతిచెందగా.. ఆ తర్వాత ఇదే పెద్ద ప్రమాదం అని చెబుతారు!