Begin typing your search above and press return to search.

పులివెందుల బరిలో చిన్నమ్మ!

ఆంధ్రప్రదేశ్‌ లో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా మూడు నెలల సమయం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు అభ్యర్థుల ఖరారులో తలమునకలై ఉన్నాయి.

By:  Tupaki Desk   |   20 Jan 2024 4:56 AM GMT
పులివెందుల బరిలో చిన్నమ్మ!
X

ఆంధ్రప్రదేశ్‌ లో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా మూడు నెలల సమయం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు అభ్యర్థుల ఖరారులో తలమునకలై ఉన్నాయి. ముఖ్యంగా వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ పోటీ చేస్తున్న పులివెందుల నియోజకవర్గం సర్వత్రా ఆసక్తిని రేపుతోంది. పులివెందుల నుంచి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున దివంగత మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ పోటీ చేస్తారని టాక్‌ నడుస్తోంది.

వాస్తవానికి పులివెందుల నుంచి పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల పోటీ చేస్తారని టాక్‌ నడిచింది. 1978 నుంచి పులివెందుల నియోజకవర్గంలో వైఎస్సార్‌ కుటుంబ సభ్యులే ఎమ్మెల్యేలుగా ఎన్నికవుతూ వస్తున్నారు. 1978, 1983, 1985 ఎన్నికల్లో వైఎస్సార్‌ గెలుపొందారు. 1989, 1994 ఎన్నికల్లో వైఎస్సార్‌ తమ్ముడు వైఎస్‌ వివేకానందరెడ్డి పులివెందుల శాసనసభ్యుడిగా విజయం సాధించారు. మళ్లీ 1999, 2004, 2009 ఎన్నికల్లో వైఎస్సార్‌ ఎమ్మెల్యేగా గెలిచారు. వైఎస్సార్‌ మరణానంతరం జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన సతీమణి వైఎస్‌ విజయమ్మ గెలుపొందారు. 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ విజయం సాధించారు.

ఈ నేపథ్యంలో నూతనంగా కాంగ్రెస్‌ పార్టీ పగ్గాలు చేపట్టిన వైఎస్‌ షర్మిల.. పులివెందుల స్థానం నుంచి తన చిన్నాన్న భార్య సౌభాగ్యమ్మను పోటీ చేయించే యోచనలో ఉన్నారని టాక్‌ నడుస్తోంది. వాస్తవానికి షర్మిల పోటీ చేయాలని అనుకున్నా తనకంటే కూడా తన చిన్నమ్మే.. తన అన్న జగన్‌ పైన మంచి అభ్యర్థి అవుతారని ఆమె భావిస్తున్నట్టు తెలుస్తోంది.

మరోవైపు కడప ఎంపీ స్థానంలో వివేకా కుమార్తె డాక్టర్‌ సునీత పోటీ చేయొచ్చని చెబుతున్నారు. ఈ మేరకు సునీత కూడా కొద్ది రోజుల్లో కాంగ్రెస్‌ పార్టీలో చేరొచ్చని టాక్‌ నడుస్తోంది. పులివెందుల నుంచి తన చిన్నమ్మను, కడప లోక్‌ సభా స్థానంలో వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్‌ అవినాష్‌ రెడ్డి పైన సునీతను పోటీ చేయించే యోచనలో షర్మిల ఉన్నారని టాక్‌ నడుస్తోంది.

తన ప్రతిపాదనలను వైఎస్‌ షర్మిల.. సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీల ముందు ఉంచుతారని.. వారు అంగీకరిస్తే పులివెందుల నుంచి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ, కడప లోక్‌ సభా స్థానం నుంచి వివేకా కుమార్తె సునీత పోటీ చేయడం ఖాయమని అంటున్నారు. లేకపోతే పులివెందుల నుంచి వైఎస్‌ షర్మిల తన అన్నపైన పోటీ చేస్తారని పేర్కొంటున్నారు