మరో కీలక దేశం నిషేధం.. డీప్ సీక్ గురించి తెరపైకి షాకింగ్ విషయాలు!
అమెరికాలో నిషేధం ఎదుర్కొన్న చైనా ప్రభుత్వ రంగ టెలికాం కంపెనీ చైనా మొబైల్ తో డీప్ సీక్ కు సంబంధాలు ఉన్నాయని పరిశోధకులు చెబుతున్న పరిస్థితి.
By: Tupaki Desk | 6 Feb 2025 7:30 PM GMTఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో తాజా సంచలనం డీప్ సీక్ ఓ వైపు దూసుకుపోతుండగా.. మరోవైపు దీనికి సంబంధించిన షాకింగ్ విషయాలు తెరపైకి వస్తున్నాయి. దీంతో... డీప్ సీక్ విషయంలో అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్, ఇటలీ, ఇజ్రాయెల్ వంటి పలు దేశాలు అప్రమత్తమవుతుండగా.. తాజాగా దక్షిణ కొరియా డీప్ సీక్ విషయంలో కీలక వ్యాఖ్యలు చేస్తూ, సంచలన నిర్ణయం తీసుకుంది.
అవును... అమెరికాలో నిషేధం ఎదుర్కొన్న చైనా ప్రభుత్వ రంగ టెలికాం కంపెనీ చైనా మొబైల్ తో డీప్ సీక్ కు సంబంధాలు ఉన్నాయని పరిశోధకులు చెబుతున్న పరిస్థితి. యూజర్లకు చెందిన లాగిన్ సమాచారాన్ని ఈ డీప్ సీక్ తన కంప్యూటర్ కోడ్ ద్వారా ఆ టెలికాం సంస్థకు చేరవేస్తోందనే షాకింగ్ విషయాలు చెబుతున్నారు. ఈ సమయంలో ఇప్పటికే పలు దేశాలు కీలక ఆరోపణలు చేశాయి.
ఇందులో భాగంగా.. కెనడాకు చెందిన ఫీరూట్ సెక్యూరిటీ సంస్థ దీన్ని గుర్తించింది. అనంతరం ఈ విషయాన్ని అసోసియేట్ ప్రెస్ వార్తా సంస్థతో పంచుకుంది. ఈ ఆరోపణలపై అటు డీప్ సీక్ కానీ, చైనా మొబైల్ గానీ స్పందించలేదు. మరోపక్క కెనడాకు చెందిన ఫీరూట్ సెక్యూరిటీ చెప్పిన విషయాలను ఇండిపెండెంట్ కంప్యూటర్ ఎక్స్ పర్ట్స్ ధృవీకరించారు.
దీంతో... డీప్ సీక్ విషయంలో ఆస్ట్రేలియా, ఇటలీ, తైవాన్ దేశాలు స్పందించాయి. తమ దేశాల్లో డీప్ సీక్ సేవలపై నిషేధం విధించాయి. ఈ విషయంలో.. ప్రభుత్వ కంప్యూటర్లు, డివైజ్ ల వాడంపై ఆస్ట్రేలియా నిషేధం విధించింది. డీప్ సీక్ వాడకంపై అప్రమత్తంగా ఉండాలని పౌరులకు సూచించింది. ఈ సమయంలో దక్షిణ కొరియా సర్కార్ కూడా కీలక నిర్ణయం తీసుకుంది.
ఇందులో భాగంగా... తమ దేశ రక్షణ, వాణిజ్య కంప్యూటర్లలో డీప్ సీక్ వాడకాన్ని నిషేధిస్తున్నట్లు దక్షిణ కొరియా ప్రభుత్వ అధికారులు తెలిపారు. డీప్ సీక్ పై పలు దేశాల నుంచి వస్తోన్న ఆందోళనలు, ఆరోపణల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఇంటెలిజెన్స్ అధికారులు డీప్ సీక్ వినియోగంలో జాగ్రత్తలు వహించాలని తెలిపారు.
ఈ సందర్భంగా స్పందించిన దక్షిణ కొరియా రక్షణ, వాణిజ్య మంత్రిత్వ శాఖలు సంయుక్తంగా ఓ ప్రకటన చేశాయి. ఇందులో భాగంగా... యూజర్లకు చెందిన వ్యక్తిగత సమాచార సేకరణ వ్యవస్థకు సంబంధించిన వివరాలు అస్పష్టంగా ఉన్నాయని తెలిపాయి. ఆ దేశ పర్యావరణ శాఖ కూడా ఇదే హెచ్చరికలు జారీ చేయడం గమనార్హం.