సొంత జనంపైనే బాంబులు.. దక్షిణ కొరియాలో ఘోరం
ఉత్తర కొరియా-దక్షిణ కొరియా మధ్య సరిహద్దులో కొంత భాగం డీ మిలటరైజ్డ్ జోన్ అనే సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 6 March 2025 1:43 PM ISTఉత్తర కొరియాతో నిత్యం ఉప్పు-నిప్పు వాతావరణం ఉండే దక్షిణ కొరియాలో అనూహ్య ఘటన.. అది కూడా ఉత్తర కొరియా సరిహద్దులో ఓ ఊహించని ప్రమాదం.. ఇదేదో సాధారణ ప్రజలకు సంబంధించినది అయితే ఓకే.. కానీ, ఇందులో సైనిక అంశం ముడిపడి ఉండడమే కీలకంగా మారింది.
దాయాది దేశమైన ఉత్తర కొరియా నుంచి ఎప్పుడూ ముప్పు ఎదుర్కొనే దక్షిణ కొరియా సాధారణంగా చేపట్టిన వాయుసేన శిక్షణ కార్యక్రమంలో అపశ్రుతి.. ఆ దేశ యుద్ధ విమానాలు పొరపాటున తమ సొంత ప్రజలపైనే బాంబులు జారవిడిచాయి.
ఉత్తర కొరియా-దక్షిణ కొరియా మధ్య సరిహద్దులో కొంత భాగం డీ మిలటరైజ్డ్ జోన్ అనే సంగతి తెలిసిందే. అంటే అక్కడ సైనిక కార్యకలాపాలు ఏవీ సాగవు. ఇలాంటి సరిహద్దులకు కొన్ని కిలోమీటర్ల దూరంలో దక్షిణ కొరియాకు చెందిన ఫైటర్ జెట్ కేఎఫ్-16 బాంబులు వేసింది. అయితే, వారి దేశానికి చెందిన ప్రాంతమే.
పోచెయోన్ స్థావరం నుంచి 8 ఎంకే-82 శ్రేణి బాంబులతో బయల్దేరిన కేఎఫ్-16లో ఈ పొరపాటు జరిగింది. ఉత్తర కొరియా సరిహద్దులకు 25 కిలోమీటర్ల దూరంలో వేయాల్సి ఉండగా.. ఫైరింగ్ రేంజిలో నిర్దేశించిన టార్గెట్లపై కాకుండా దగ్గరల్లోని గ్రామ ప్రజల నివాసాలపై పడ్డాయి. నలుగురికి తీవ్రగాయాలు కాగా.. ముగ్గురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
బాధితులను సురక్షిత ప్రదేశాలకు తరలించినట్లు దక్షిణ కొరియా అధికారులు తెలిపారు. ఈ ఘటన చాలా అనూహ్యంగా పేర్కొన్నారు. తక్షణ స్పందన గ్రూప్ లు స్పందించి విచారణ జరుపుతుందని పేర్కొన్నారు. బాంబు పేలుళ్లకు ఇళ్లు కంపించాయి.. కొన్ని దెబ్బతిన్నాయి. దీంతో ఏమైనా ఆస్తి నష్టం వాటిల్లితే పరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చారు.
అమెరికా దళాలతో కలిసి..
దక్షిణ కొరియాలో అమెరికా సైనిక బేస్ ఉంది. ఉత్తర కొరియాతో పొంచి ఉన్న ముప్పు నేపథ్యంలో దక్షిణ కొరియా దీనికి ఒప్పుకొంది. అటు అమెరికా కూడా ఉత్తర కొరియా కట్టడికి, రష్యాతో తమ దేశ భద్రతకు ముప్పు రాకుండా దక్షిణ కొరియాలో సైనిక బేస్ కొనసాగిస్తోంది. దీని ఖర్చులు భరిస్తోంది. తాజాగా దక్షిణ కొరియా వాయుసేన, సైన్యం సంయుక్తంగా యుద్ధ విన్యాసాలు చేపట్టగా దుర్ఘటన జరిగింది. ఇందులో అమెరికా దళాలు కూడా పాల్గొన్నాయి. ట్లు యోన్‌హోప్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. ఈ బాంబుపేలుళ్లతో స్థానికులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. బాంబు పేలుళ్ల దెబ్బకు ఇళ్లు కంపించిపోయాయి.
2022లో ఉత్తర కొరియా క్షిపణి పరీక్షలకు దీటుగా స్పందించేందుకు దక్షిణ కొరియా హ్యూన్మూ-2 బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. అవి పొరపాటున మార్గం తప్పి సమీపంలోని గోల్ఫ్ కోర్టుపై పడ్డాయి.