అరెస్టు అంచున దేశ అధ్యక్షుడు.. 2025లో తొలి వికెట్?
ప్రజల నిరసనలు.. సిద్ధంగా పోలీసులు.. ఇక ఏ క్షణమైనా అరెస్టు అన్నట్లుంది వాతావరణం.
By: Tupaki Desk | 3 Jan 2025 12:09 PM GMTప్రజాస్వామ్య దేశాల్లో ఆ దేశం ఒక నమూనా అని ఇంతకాలం చెప్పేవారు.. అయితే, అలాంటి దేశంలో కూడా ఎమర్జెన్సీ ప్రకటించడం రెండు నెలల కిందట కలకలం రేపింది. దీని తర్వాత అధ్యక్షుడు నాలుక కర్చుకున్నారు. కానీ, పరిస్థితులు మాత్రం ఆయనకు వ్యతిరేకంగా మారాయి. ప్రజల నిరసనలు.. సిద్ధంగా పోలీసులు.. ఇక ఏ క్షణమైనా అరెస్టు అన్నట్లుంది వాతావరణం.
ఉత్తర కొరియా కాదు దక్షిణ కొరియా
యూన్ సుక్ యోల్.. దక్షిణ కొరియా సస్పెండ్ అయిన అధ్యక్షుడు. కొన్ని రోజుల కిందట అనూహ్యంగా దేశంలో మార్షల్ లా విధించారు. ఇది ఎవరూ ఊహించని పరిణామం. ఇప్పుడు ఆయన తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. ఆయన మొదటి అభిశంసన మొదలైంది.
తర్వాత పదవి నుంచి సస్పెండ్ చేశారు. ఇప్పుడు ఏకంగా అరెస్ట్ చేసేందుకు పోలీసులు సమాయత్తం అవుతున్నారు. అధికారిక నివాసం ప్రెసిడెంట్ హౌస్ ఎదుట జనం కూడా భారీగా మూగారు. దీంతో పోలీసులు లోపలకు వెళ్లలేకపోయారు.
3 వేలమంది పోలీసులతో..
యూన్ సుక్ యోల్ భద్రతా సిబ్బంది నుంచి ప్రతిఘటన ఎదురయ్యే ప్రమాదం ఉండడంతో ఆయన అరెస్టు కోసం ఏకంగా 3 వేలమంది పోలీసులను మోహరించడం గమనార్హం. పలువురు ఉన్నతాధికారులు కూడా నిఘా ఉంచారు. దక్షిణ కొరియాలో సిట్టింగ్ అధ్యక్షుడికి జారీ చేసిన తొలి అరెస్ట్ వారెంట్ ఇది కావడం గమనార్హం.
హసీనా, గొటబాయ, బషర్..
కొన్నేళ్ల కిందట శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స, నిరుడు ఆగస్టులో బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, నేపాల్ లో ప్రచండ, సిరియాలో బషర్.. ఒక్కొక్కరుగా దేశాధినేతలు పదవిని కోల్పోయారు. హసీనా భారత దేశంలో ప్రవాసంలో ఉన్నారు. గొటబాయ పరిస్థితి ఏమిటో తెలియరాలేదు. బషర్ రష్యా వెళ్లిపోయారు. ఇప్పుడు దక్షిణ కొరియా వంతు? అంటే.. 2025లో తొలి వికెట్ యూన్ సుక్ యోల్ అన్నమాట.