అటు అధికారం పాయె.. ఇటు కటకటాలపాలాయె.. ఎమర్జెన్సీ ఎంత పని చేసింది?
ఎమర్జెన్సీ ప్రకటించి ఊహించని స్థాయిలో పెను సమస్యలు తెచ్చుకున్న దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ ను తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు.
By: Tupaki Desk | 15 Jan 2025 6:26 AM GMTగతేడాది డిసెంబర్ లో దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ ఎమర్జెన్సీ మార్షల్ లా విధించిన సంగతి తెలిసిందే. ప్రతిపక్షాలు దేశ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నాయని ఆరోపిస్తూ ఆయన ఈ పనికి పూనుకున్నారు. అయితే.. ఈ నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీంతో.. తన ప్రకటనను విరమించుకున్నప్పటికీ.. తన పదవికి రాజీనామా చేయాలని ప్రతిపక్షాలూ డిమాండ్ చేశాయి.
ఈ నేపథ్యంలో ఎమర్జెన్సీ మార్షల్ లా అమలును వ్యతిరేకిస్తూ తీర్మానం తీసుకురాగా.. పార్లమెంట్ ఏకగ్రీవంగా ఆమోదించింది. అనంతరం మార్షల్ లా అమలు చట్టవిరుద్ధం అంటూ స్పీకర్ ప్రకటించారు. ఈ మేరకు పార్లమెంట్ లో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టగా.. ఈ తీర్మానానికి 204 మంది అనుకూలంగా.. 85 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. దీంతో ఆయన అధ్యక్ష అధికారాలు కోల్పోవాల్సి వచ్చింది.
అది అక్కడితో అయిపోలేదు. ఎమర్జెన్సీ మార్షల్ లా అమలుచేసిన నేపథ్యంలో దానిపై విచారించేందుకు దర్యాప్తు అధికారులు పలుమార్లు సమన్లు జారీ చేశారు. వాటికి ఆయన స్పందించకపోవడంతో కోర్టును ఆశ్రయించారు అధికారులు. దీంతో.. ఆయనపై అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది. ఈ నేపథ్యంలో తాజాగా ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
అవును... ఎమర్జెన్సీ ప్రకటించి ఊహించని స్థాయిలో పెను సమస్యలు తెచ్చుకున్న దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ ను తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ ఒక్క నిర్ణయంతో అటు అధ్యక్ష అధికారాలు కోల్పోయిన ఆయన.. ఇటు తాజాగా అరెస్ట్ అయ్యిన పరిస్థితి నెలకొంది. మార్షల్ లా విధించి చట్టాన్ని ఉల్లంఘించినందుకు ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
ఇందులో భాగంగా... బుధవారం తెల్లవారుజామున వందలాది మంది దర్యాప్తు అధికారులు అధ్యక్ష నివాసానికి చేరుకున్నారు. ఈ సమయంలో వారిని అధ్యక్ష భద్రతా దళాలు అడ్డుకున్నాయి. అయితే.. కాసేపటికే ప్రతిష్టంభన తొలగిన అనంతరం.. అధ్యక్ష నివాసంలోకి వెళ్లిన దర్యాప్తు అధికారులు.. యూన్ సుక్ యోల్ ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం భారీ భద్రత నడుమ అక్కడ నుంచి తరలించారు.
వాస్తవానికి గతంలోనే ఓ సారి యూన్ సుక్ యోల్ ను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించిన సంగతి తెలిసిందే. అయితే అప్పుడు పెద్ద ఎత్తున ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకొని నేడు భద్రతను కట్టుదిట్టం చేశారు. పక్కా ప్లానింగ్ తో తెల్లవారుజామున అరెస్ట్ చేసి, భారీ భద్రత నడుమ నివాసం నుంచి తరలించారు.