తప్పు చేశాడు.. తలొంచాడు.. అధ్యక్షుడు ఔట్?
అయితే, దక్షిణ కొరియాలో అధికార పక్షం అంత బలంగా ఉంటుంది ప్రతిపక్షం. దీంతో అధ్యక్షుడు ‘తలొంచక’ తప్పలేదు.
By: Tupaki Desk | 7 Dec 2024 8:30 AM GMTఅధికారం చేతిలో ఉంటే ఎవరికైనా కాస్త గర్వం ఉంటుంది. దానిని తలకెక్కించుకోని వారే ఎక్కువ కాలం మనగలుగుతారు. పవర్ శాశ్వతం అని భావిస్తే.. దాని పరిణామాలు వెనువెంటేనే ఎదుర్కొనాల్సి వస్తుంది. ఇప్పుడు దక్షిణకొరియాలో జరుగుతోంది. గత మంగళవారం అనూహ్యంగా ఎమర్జెన్సీ ప్రకటన చేసి పలుచనయ్యారు ఆ దేశ అధ్యక్షుడు. దీనికి ప్రతిపక్షాలు దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాయనే కారణం చూపారు. అయితే, దక్షిణ కొరియాలో అధికార పక్షం అంత బలంగా ఉంటుంది ప్రతిపక్షం. దీంతో అధ్యక్షుడు ‘తలొంచక’ తప్పలేదు.
దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ దేశంలో ఇటీవల ‘ఎమర్జెన్సీ మార్షల్ లా’ విధించిన సంగతి తెలిసిందే. అయితే, దీనిపై తీవ్ర వ్యతిరేకత రావడంతో పార్లమెంటులో ఓటింగ్ నిర్వహించి ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా తీర్మానాన్ని ఆమోదించారు. గంటల్లోనే ఎమర్జెన్సీని ఎత్తివేశారు. దీంతో వెనక్కితగ్గిన అధ్యక్షుడు ఎమర్జెన్సీని విరమించుకున్నట్లు తెలిపారు.
పదవీ గండం తప్పదా?
‘ఎమర్జెన్సీ మార్షల్ లా’ ప్రకటనతో చిక్కుల్లో పడిన దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ కు పదవి నుంచి దిగిపోయే పరిస్థతి ఎదురవుతోంది. ఆయనపై ప్రతిపక్షాలు తీసుకొచ్చిన అభిశంసన తీర్మానంపై పార్లమెంటులో ఓటింగ్ జరగనుంది. దీంతోనే మళ్లీ ఇలాంటి తప్పు చేయనంటూ యూన్ క్షమాపణ తెలిపారు.
వ్యతిరేకతను అధిగమించలేక..
యూన్ పై ప్రస్తుతం దేశవ్యాప్తంగా వ్యతిరేకత ఉంది. సొంత పార్టీ నుంచి కూడా మద్దతు కరవైంది. కొరియా కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం 5 గంటలకు పార్లమెంట్ ప్రత్యేకంగా సమావేశమై యూన్ మీద అభిశంసన తీర్మానంపై ఓటింగ్ నిర్వహించనుంది. 300 మంది సభ్యులున్న పార్లమెంటులో 200 మంది అనుకూలంగా ఓటేస్తేనే యూన్ నెగ్గుతారు. ఇఖ ప్రధాన ప్రతిపక్ష డెమోక్రటిక్ పార్టీ, ఇతర చిన్నాచితక విపక్ష పార్టీలకు 192 మంది సభ్యులున్నారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా తీసుకొచ్చిన తీర్మానమే 190-0తో నెగ్గింది. దీంతో యూన్ కు పదవీ గండం తప్పేలా లేదు.