చైనా మరో దురాగతం.. ఈసారి ఏకంగా సముద్రంలోనే!
ఇప్పుడు మరో దుశ్చర్యకు చైనా పాల్పడింది. ఏకంగా దక్షిణ చైనా సముద్రం మొత్తాన్ని తన ఏలుబడిలోకి తెచ్చుకోవడానికి సాహసించింది. ఇందులో భాగంగా దక్షిణ చైనా సముద్రంలో తేలియాడే కంచెను ఏర్పాటు చేసింది.
By: Tupaki Desk | 26 Sep 2023 4:52 AM GMTపక్క దేశాల్లోని ప్రాంతాలను తనవిగా చూపడం, వాటికి కొత్త పేర్లు పెట్టడం, వాటికి సమీప చైనా గ్రామాల్లోకి భారీ ఎత్తున చైనీయులను తరలించడం, ఇళ్లు నిర్మించడం, ఆ తర్వాత వేరే దేశాల ప్రాంతాలను తనవిగా చూపుతూ కొత్త మ్యాపులను విడుదల చేయడం.. ఇదీ గత కొన్నేళ్లుగా చైనా వరుస. పక్క దేశాలను ఆక్రమించడమే పనిగా పెట్టుకున్న చైనా సామ్రాజ్యవాదంతో చెలరేగిపోతోంది.
ఇలాగే భారత్, నేపాల్, భూటాన్, తైవాన్, వియత్నాం, జపాన్, పిలిఫ్పీన్స్, తదితర దేశాలకు చెందిన ప్రాంతాలు, దీవులు, సముద్ర జలాలు తనవని చెబుతూ చైనా దురాగతానికి పాల్పడుతోంది. అలాగే దక్షిణ చైనా సముద్రం మొత్తం తనదేనంటూ ఆ తీర దేశాలతో ప్రతిసారీ కీచులాటకు దిగుతోంది. భారీ ఎత్తున యుద్ధ నౌకలు, టోర్పెడోలు, జలాంతర్గాములను పంపి ఆ దేశాలను భయపెడుతోంది. ఈ విషయంలో ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ న్యాయస్థానం హెచ్చరికలను సైతం చైనా పెడచెవిన పెడుతోంది.
ఇప్పుడు మరో దుశ్చర్యకు చైనా పాల్పడింది. ఏకంగా దక్షిణ చైనా సముద్రం మొత్తాన్ని తన ఏలుబడిలోకి తెచ్చుకోవడానికి సాహసించింది. ఇందులో భాగంగా దక్షిణ చైనా సముద్రంలో తేలియాడే కంచెను ఏర్పాటు చేసింది.
బాజో డె మాసిన్ లోక్ ఆగ్నేయ ప్రాంతంలో చైనా కంచె వేసినట్టు ఫిలిప్పీన్స్ వెల్లడించింది. ఇక్కడ ఉన్న సముద్ర దిబ్బల వైపు తమ చేపల వేట పడవలు రాకుండా ఉండటానికే ఇలా చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనివల్ల తమ జాలర్ల జీవనోపాధి దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేసింది.
కాగా బాజో డె మాసిన్ లోక్ అనేది దక్షిణ చైనా సముద్రంలోని ఓ వ్యూహాత్మక దిబ్బ. ఇక్కడ చేపలు సమృద్ధిగా లభిస్తాయి. ఫిలిప్పీన్స్ ద్వీపం లూజోన్ కు 200 కిలోమీటర్ల దూరంలోనే ఇది ఉంది. చైనీయులు ఈ ప్రాంతాన్ని హువాంగ్ యాండావ్ అని వ్యవహరిస్తున్నారు. దక్షిణ చైనా సముద్రంలోని వివాదాస్పద ప్రాంతాల్లో ఇది కూడా ఒకటి. ఈ ప్రాంతాన్ని చైనా తనదిగా చెబుతోంది.
దీంతో చైనా వ్యవహారశైలిపై ఇరుగుపొరుగు దేశాలు కయ్యమంటున్నాయి. వివాదాస్పద స్థలంలో తమ చేపల వేట పడవలు రాకుండా ఉండటానికే చైనా ఇలాంటి దుశ్చర్యకు పాల్పడిందని ఫిలిప్పీన్స్ తీవ్ర విమర్శలు చేసింది. ఈ మేరకు ఫిలిప్పీన్స్ కోస్టుగార్డ్ ప్రతినిధి జైటర్రేలా ట్విటర్ లో చైనా వ్యవహార శైలిపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
సాధారణ సముద్ర గస్తీలో భాగంగా తమ దేశ కోస్టుగార్డు ఈ తేలియాడే కంచెను గుర్తించిందని ఫిలిప్పీన్స్ తెలిపింది. ఈ కంచె పొడవు దాదాపు 900 అడుగుల పైనే ఉందని పేర్కొంది. చైనా చేసిన ఈ పనిని ఫిలిప్పీన్స్ కోస్టుగార్డ్, బ్యూరో ఆఫ్ ఫిషరీస్ అండ్ ఆక్వాటిక్ రిసోర్స్ ఖండిస్తున్నట్టు తెలిపింది.
చేపల వేటకు వెళ్లిన తమ నౌకలను చైనా బోట్లు 15 సార్లు రేడియోసెట్ లో హెచ్చరించాయని ఫిలిప్పీన్స్ ఆరోపించింది. సముద్ర చట్టాలను చైనా ఉల్లంఘిస్తోందని మండిపడింది. తమ నౌకలో మీడియా సిబ్బంది ఉన్నారని తెలుసుకొని చైనా నౌకలు అక్కడి నుంచి నిష్క్రమించాయని వెల్లడించింది.
ఫిలిప్పీన్స్ ఆరోపణలపై ఆ దేశ రాజధాని మనీలాలో ఉన్న చైనా దౌత్యకార్యాలయం స్పందించలేదు. చైనా మాత్రం ఆ ఆరోపణలను ఖండించింది. ఫిలిప్పీన్స్ రాజకీయ ఆరోపణల కోసం తప్పుడు సమాచారాన్ని వాడుకుంటోందని చైనా పేర్కొనడం గమనార్హం. ఈ ఆరోపణలు పూర్తిగా ఆధారహితమని స్పష్టం చేసింది. ఈ మేరకు చైనా ప్రతినిధి మావో నింగ్ ఒక ప్రకటన జారీ చేశారు.
మరోవైపు చైనాకు చెందిన భారీ పడవలు ముందస్తుగానే తమపై నిఘా వేశాయని ఫిలిప్పీన్స్ మత్స్యకారులు ఆరోపిస్తుండటం గమనార్హం. తాము ఆ ప్రాంతానికి వెళ్లిన సమయంలో చైనా పడవలు తేలియాడే కంచెను అక్కడ వేస్తున్నట్లు తెలిపారు.