ఎవరు అడిగినా అదే చెబుతున్న ఇజ్రాయేల్... ఒక్క పేలుడు 500 మంది మృతి!
అవును... గతంలో ఎన్నడూలేని విధంగా దక్షిణ గాజాలోని ఆసుపత్రిలో పేలుడు సంభవించి 500 మంది మరణించినట్లు సమాచారం.
By: Tupaki Desk | 18 Oct 2023 3:00 AM GMTహమాస్ మిలిటెంట్లే లక్ష్యంగా గాజాపై ఇజ్రాయెల్ భీకర వైమానిక దాడులు కొనసాగిస్తోన్న సంగతి తెలిసిందే. ఇజ్రాయెల్ - హమాస్ ల మధ్య జరుగుతోన్న ఘర్షణలో భారీ ప్రాణనష్టం జరుగుతోంది. దొంగదెబ్బతో మొదలుపెట్టడం అంటే మొదలుపెట్టింది కానీ... ఇజ్రాయేల్ ప్రతిదాడికి హమాస్ వణికిపోతున్నట్లు తెలుస్తుంది! ఇక భూతల దాడులు జరిగితే జరిగే ఘోరాలు ఎవరి ఊహకు వారికి వదిలేయడమే అన్నట్లుగా చెబుతున్నారు పరిశీలకులు. ఈ నేపథ్యంలో ఇజ్రాయేల్ ప్రధాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
గాజాపై దాడి చేయాలని ఫిక్సయిన అనంతరం ఆ ప్రాంతాన్ని అష్టదిగ్బంధనం చేసేసింది. ఆహారం, విద్యుత్, ఇందనం సరఫరాలు నిలిపేసింది. ఇదే సమయంలో ఉత్తర గాజాను ఖాళీ చేయమని హెచ్చరికలు జారీచేసింది. దీంతో సుమారు 10లక్షలమంది దక్షిణ గాజావైపు ప్రయాణమై వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో... సడన్ గా దక్షిణ గాజాలోని ఒక ఆసుపత్రిలో పేలుడు సంభంచించింది. అది అలాంటి ఇలాంటి పేలుడు కాదు.
అవును... గతంలో ఎన్నడూలేని విధంగా దక్షిణ గాజాలోని ఆసుపత్రిలో పేలుడు సంభవించి 500 మంది మరణించినట్లు సమాచారం. దీనికి ఇజ్రాయెల్ వైమానిక దాడులే కారణమని హమాస్ ఆరోపిస్తోంది. దీంతో... ఒకవేళ ఇదే నిజమైతే దశాబ్దాలుగా జరుగుతున్న ఇజ్రాయెల్, పాలస్తీనా ఘర్షణల్లో ఇదే అతి పెద్ద దారుణ ఘటన అవుతుందని అంటున్నారు.
ఇప్పటికే ఉత్తర గాజా నుంచి వస్తున్న జనంతో నిండిపోతున్న దక్షిణ గాజాపైనా ఇజ్రాయెల్ వైమానిక దాడులతో విరుచుకుపడటం ఇప్పుడు మరింత ఆందోళన కలిగిస్తుందని అంటున్నారు. రఫా, ఖాన్ యూనిస్ పట్టణాల శివార్లలో వైమానిక దాడులు జరిగగా... ఈ దాడులవల్ల రఫాలో 27 మంది, ఖాన్ యూనిస్ లో 30 మంది మరణించారని చెబుతున్నారు. ఖాన్ యూనిస్ లోని నాజర్ ఆసుపత్రికి 50 మృత దేహాలు వచ్చాయని అంతర్జాతీయ మీడియా ప్రతినిధి ఒకరు తెలిపారు.
ఈ సమయంలో రష్యా ఎంటరైంది. సుమారు 600 రోజులకు పైగా ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో గాజాకు మానవతా సాయం అందించేందుకు సహకరించాలని కోరుతూ రష్యా తీర్మానం ప్రవేశపెట్టింది. అయితే ఈ తీర్మానం వీగిపోయింది. ఇదే సమయంలో... యుద్ధం ఆపే ప్రసక్తే లేదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు.. రష్యా అధినేత పుతిన్ కు స్పష్టం చేశారు.
గాజాలో మానవతా సంక్షోభం నెలకొంది.. ప్రజలు ఆహారం, తాగునీరు లేక అల్లాడుతున్నారు.. అయినా... హమాస్ ను నాశనం చేసేంతవరకు యుద్ధం ఆపే ప్రసక్తి లేదు. ఇజ్రాయెల్ పై క్రూరమైన హంతకులు దాడి చేశారు.. ఈ నేపథ్యంలోనే దృఢ నిశ్చయంతో హమాస్ పై యుద్ధానికి వెళ్లాం. హమాస్ సైనిక, పాలనాపర సామర్థ్యాలను నాశనం చేసే వరకు ఇది ఆగదు అని పుతిన్ కు నెతన్యాహు స్పష్టం చేశారని తెలుస్తుంది.
ఇదిలా ఉండగా.. ఇజ్రాయెల్ సైన్యం, హమాస్ ల మధ్య దాడుల్లో ఇప్పటివరకు ఇరువైపులా దాదాపు 4వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదే సమయంలో... గాజా సివిల్ డిఫెన్స్ ప్రధాన కార్యాలయంపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో 10 మంది డాక్టర్లు, ఏడుగురు వైద్య సిబ్బంది మరణించారు. ఈ నేపథ్యంలో... అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇజ్రాయెల్ తోపాటు జోర్డాన్ లో పర్యటించేందుకు సిద్ధమయ్యారు.