గాజా విలవిల... ఉత్తరాదిని ఖాళీ చేయమని దక్షిణాదిలో దాడులు?
అయితే... ఈ దాడిని ఇజ్రాయెల్ ధృవీకరించలేదు. ఇదే సమయంలో ఆస్పత్రిపై దాడి చేసింది తమ బలగాలేనా కాదా అనే విషయంపై దర్యాప్తు చేస్తున్నట్లు ప్రకటించింది.
By: Tupaki Desk | 18 Oct 2023 4:03 AM GMTహమాస్ ఉగ్రవాదుల ఏరివేతకు సహకరించే విషయంలో... ప్రజలందరూ ఉత్తర గాజా ప్రాంతాన్ని ఖాళీ చేయాలని... వారంతా మధ్య, దక్షిణ గాజా వైపు వెళ్లాలని ఇజ్రాయేల్ సైన్యం హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే గాజాను అష్టదిగ్బంధనం చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం గాజాలో భూతల దాడుల కోసం సుమారు 3.6 లక్షల మంది సైన్యం బోర్డర్ లో రెడిగా ఉన్నారని అంటున్నారు. దీంతో... సుమారు 10 లక్షల మంది ప్రజలు ఉత్తర గాజాను ఖాళీ చేసి దక్షిణ గాజాకు చేరారని తెలుస్తుంది.
ఈ సమయంలో ఊహించని రీతిలో సెంట్రల్ గాజాలోని అల్ అహ్లీ సిటీ ఆస్పత్రిలో భారీ పేలుడు సంభవించింది. దీంతో ఈ పేలుడు దాటికి 500 మంది ప్రాణాలు కోల్పోయారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దీనికి ఇజ్రాయెల్ వైమానిక దాడులే కారణమని హమాస్ ఆరోపిస్తోంది. అయితే... ఈ దాడిని ఇజ్రాయెల్ ధృవీకరించలేదు. ఇదే సమయంలో ఆస్పత్రిపై దాడి చేసింది తమ బలగాలేనా కాదా అనే విషయంపై దర్యాప్తు చేస్తున్నట్లు ప్రకటించింది.
ఊహించని రీతిలో జరిగిన ఈ ఘటనతో ఆస్పత్రి పరిసరాలు భీతావహంగా మారిపోయాయి. ఎటు చూసినా హాహాకరాలతో నిండిపోయాయి. ఆస్పత్రిలోని హాళ్లు అగ్నికి ఆహుతవగ... ఎటు చూసినా రోగుల శరీరభాగాలు ఛిద్రమై చెల్లాచెదురుగా పడిన దృశ్యాలు దర్శనమిస్తున్నాయి. దీంతో... ఈ దాడి ఘటనపై పాలస్తీనా అధ్యక్షుడు మొహమ్మద్ అబ్బాస్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మూడు రోజుల సంతాప దినాలు ప్రకటించారు.
ఇలా ఇప్పటికే ఉత్తర గాజా నుంచి వస్తున్న జనంతో నిండిపోతున్న దక్షిణ గాజాపైనా ఇజ్రాయెల్ వైమానిక దాడులతో విరుచుకుపడింది. ఇందులో భాగంగా.. రఫా, ఖాన్ యూనిస్ పట్టణాల శివార్లలో వైమానిక దాడులు జరిగాయి. దీంతో... ఈ దాడుల కారణంగా రఫాలో 27 మంది, ఖాన్ యూనిస్ లో 30 మంది మరణించారని తెలుస్తుంది. ఈ సందర్భంగా... ఖాన్ యూనిస్ లోని ఆసుపత్రికి 50 మృత దేహాలు వచ్చాయని, అవన్నీ రక్తమోడుతున్నాయని చెబుతున్నారు.
ఉత్తర గాజా ఖాళీ!:
ఇజ్రాయేల్ హెచ్చరికలతో ఉత్తర గాజా నుంచి జనం దక్షిణ గాజాకు పయనమవుతున్నారు. దీంతో... ఉత్తర గాజా సగానికి పైగా ఖాళీ అయ్యిందని చెబుతున్నారు. ఆసుపత్రుల్లోని వేలాది మంది రోగులు, క్షతగాత్రులు మాత్రం ఇంకా అక్కడే ఉన్నారు. రఫా సరిహద్దును ఈజిప్టు మూసివేయడంతో... నిత్యావసరాలతో కూడిన వాహనాలు గాజాలో ప్రవేశించడానికి ప్రస్తుతం ఈ సరిహద్దు వద్ద వేచి ఉన్నాయి.
దీంతో... ఇతర దేశాలు పంపించిన ఆహారం, నిత్యావసరాలు వారికి అందడం లేదని తెలుస్తుంది. ఫలితంగా... ఈజిప్టు అనుమతిస్తేనే తప్ప గాజా ప్రజలకు ఆహారం అందడం ఆల్ మొస్ట్ అసాధ్యం అని అంటున్నారు. మరోపక్క ఇజ్రాయెల్ మంగళవారం మూడు గంటలపాటు గాజాకు నీరు సరఫరా చేసిందని స్థానిక మీడియా వెల్లడించింది. అయితే.. ఈ మూడు గంటలు విడుదల చేసిన నీరు గాజాలో కేవలం 14 శాతం మందికి మాత్రమే సరిపోతుంది.
నేడు ఇజ్రాయెల్ లో జో బైడెన్ పర్యటన:
హమాస్ - ఇజ్రాయేల్ యుద్ధం భీకరంగా జరుగుతున్న నేపథ్యంలో... అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ బుధవారం ఇజ్రాయెల్ లో పర్యటించనున్నారు. ఇప్పటికే ఇజ్రాయెల్ కు సంపూర్ణ మద్దతు ప్రకటించిన ఆయన... మొదటి నుంచీ హమాస్ దాడులను ఖండిస్తున్నారు. ఈ సమయంలో... యూదులకు సంఘీభావం తెలియజేస్తూ ఇజ్రాయెల్ లో పర్యటించబోతున్నానని బైడెన్ ట్విట్టర్ లో పోస్టు చేశారు.