Begin typing your search above and press return to search.

ఇప్పుడు సునీత, సౌభాగ్యమ్మ ఏం చేస్తారు?

ఈ నేపథ్యంలో సునీత లేదా ఆమె తల్లి సౌభాగ్యమ్మ ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయమంటున్నారు.

By:  Tupaki Desk   |   16 March 2024 11:30 AM GMT
ఇప్పుడు సునీత, సౌభాగ్యమ్మ ఏం చేస్తారు?
X

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి తమ్ముడు, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య జరిగి ఐదేళ్లు పూర్తయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన స్మారక సభను కడపలో ఆయన సతీమణి సౌభాగ్యమ్మ, కుమార్తె సునీత తదితరులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలతోపాటు టీడీపీ నేత బీటెక్‌ రవి, బీజేపీ నేత, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా మాట్లాడిన వివేకా కుమార్తె సునీత పొలిటికల్‌ ఎంట్రీపై స్పందించలేదు. తమ భవిష్యత్తును కాలమే నిర్ణయిస్తుందన్నారు. ఈ నేపథ్యంలో సునీత లేదా ఆమె తల్లి సౌభాగ్యమ్మ ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయమంటున్నారు.

కాంగ్రెస్‌ పార్టీ తరఫున సౌభాగ్యమ్మను కడప ఎంపీ స్థానంలో వైఎస్‌ అవినాష్‌ రెడ్డిపైన పోటీ చేయించాలని వైఎస్‌ షర్మిల భావిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. ఒకవేళ ఇలా కాకుంటే సునీతను కడప ఎంపీ స్థానం నుంచి లేదా పులివెందుల అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయించవచ్చనే ప్రచారం జరిగింది.

అలాగే సునీత, సౌభాగ్యమ్మ టీడీపీలో చేరొచ్చని.. టీడీపీ తరఫున సునీత కడప ఎంపీ స్థానం నుంచి పోటీ చేయొచ్చనే చర్చ కూడా జరిగింది. అయితే టీడీపీ తరఫున పోటీ చేస్తే వైసీపీ దీన్ని రాజకీయ ప్రయోజనాల కోణంలో వాడుకునే ప్రమాదం ఉండటంతో వారిద్దరూ ఈ ప్రయత్నాన్ని విరమించుకున్నారని అంటున్నారు.

ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా సునీత లేదా ఆమె తల్లి సౌభాగ్యమ్మ పోటీ చేయొచ్చని చెబుతున్నారు. ఇండిపెండెంట్‌ గా పోటీ చేస్తే టీడీపీ అభ్యర్థిని పెట్టకుండా వారికే మద్దతు ఇస్తుందని, అలాగే కాంగ్రెస్‌ పార్టీ కూడా అభ్యర్థిని పెట్టకుండా మద్దతిచ్చే అవకాశం ఉందని టాక్‌ నడుస్తోంది.

ఏదో ఒక పార్టీ తరఫున పోటీ చేస్తే ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువని సునీత, ఆమె తల్లి సౌభాగ్యమ్మ అబిప్రాయపడుతున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబును కలవాలనుకుని కూడా వారిద్దరు ఆగిపోయారని అంటున్నారు.

ఏ పార్టీ తరఫున కాకుండా ఇండిపెండెంట్‌ గా కడప ఎంపీ స్థానంలో వైఎస్‌ అవినాష్‌ రెడ్డిపైన లేదా పులివెందుల అసెంబ్లీ స్థానంలో వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిపైన పోటీ చేసే అవకాశం ఉందని టాక్‌ నడుస్తోంది. ఇండిపెండెంట్‌ గా సునీత లేదా ఆమె తల్లి బరిలోకి దిగితే కాంగ్రెస్‌ పార్టీ, టీడీపీ అభ్యర్థులను పెట్టకుండా సహకరించే అవకాశం ఉందని అంటున్నారు. మరి సునీత, ఆమె తల్లి సౌభాగ్యమ్మ చివరకు ఏం నిర్ణయం తీసుకుంటారో వేచిచూడాల్సిందే.