భూమికి 30 కి.మీ ఎత్తు.. ప్రపంచంలోనే అతి ఖరీదైన భోజనం ఇదే!
స్పేస్ వీఐపీ అనే సంస్థ అంతరిక్షంలో ఆహారం కాన్సెప్టుని ప్రవేశపెట్టింది.
By: Tupaki Desk | 18 March 2024 6:46 AM GMTమీరు అంతరిక్ష ప్రియులా.. అలాగే ఆహార ప్రియులా?.. అయితే ఇది మీ కోసమే. భూమికి 30 కి.మీ. ఎత్తులో.. అంటే సముద్ర మట్టానికి భూమి నుంచి లక్ష అడుగుల ఎత్తులో భోజనం చేసే అవకాశాన్ని పొందొచ్చు. స్ట్రాటో ఆవరణంలో సూర్యోదయాన్ని వీక్షించొచ్చు. అంతేనా రుచికరమైన వంటకాలను ఆస్వాదించొచ్చు. అయితే ఇందుకు మీరు పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉండాలి. అప్పుడు మాత్రమే ఈ కోరిక నెరవేరుతుంది.
స్పేస్ వీఐపీ అనే సంస్థ అంతరిక్షంలో ఆహారం కాన్సెప్టుని ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా హైటెక్ స్పేస్ బెలూన్ లో ఆరుగురిని భూమి నుంచి లక్ష అడుగుల ఎత్తుకి (30 కిలోమీటర్లు ఎత్తు)కి చేరుస్తుంది. అక్కడ రుచికరమైన వంటకాలను పర్యాటకులకు అందిస్తుంది. ఈ మేరకు లగ్జరీ స్పేస్ టూరిజం కంపెనీ అయిన స్పేస్ వీఐపీ.. డెన్మార్క్ చెఫ్ రాస్మస్ మంక్ తో చేతులు కలిపింది. కాగా ఆరు గంటలపాటు ఈ స్పేస్ బెలూన్ ప్రయాణం ఉంటుంది.
వచ్చే ఏడాది ఈ యాత్ర ప్రారంభమవుతుంది. టికెట్ ధరను 495,000 డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు రూ.4.11 కోట్లు) గా నిర్ణయించారు.
ఈ ప్రయాణం ద్వారా వచ్చే ఆదాయమంతా సైన్స్ అండ్ టెక్నాలజీలో లింగ సమానత్వాన్ని ప్రోత్సహించే స్పేస్ ప్రైజ్ ఫౌండేషన్ కు విరాళంగా అందిస్తామని స్పేస్ వీఐపీ సంస్థ ప్రకటించింది. ఈ మేరకు ఇనస్టాగ్రామ్ లో ఒక పోస్టు చేసింది.
కాగా స్పేస్ వీఐపీ ఈ ట్రిప్ ప్రకటించిన వెంటనే చాలా మంది టూరుకు ఆసక్తి చూపారు. ఇందులో భాగమయ్యేందుకు తమ ఆసక్తిని కనబరిచారు. ఎలా దరఖాస్తు చేసుకోవాలి? ఎవరిని సంప్రదించాలి వంటి వివరాల కోసం ఆరా తీశారు.
ఈ నేపథ్యంలో అంతరిక్షంపై మానవులకు ఆసక్తిని పెంపొందించడానికి, సార్వత్రిక అంతరిక్ష అక్షరాస్యతను ప్రోత్సహించడానికి ఈ ప్రయాణం దోహదం చేస్తుందని స్పేస్ వీఐపీ వ్యవస్థాపకుడు రోమన్ చిపోరుఖా తెలిపారు. ఈ మేరకు ఆయన ప్రముఖ పత్రిక న్యూయార్క్ పోస్టుతో తన అభిప్రాయాలను పంచుకున్నారు.