అంతరిక్షంలోకి వెళ్లిన క్రూ-9 మిషన్... సునీత రాక ఎప్పుడంటే..?
ఎనిమిది రోజుల మిషన్ లో భాగంగా సునీతా విలియమ్స్, బుచ్ విల్ మోర్ లు జూన్ 6న బోయింగ్ స్టార్ లైనర్ క్యాప్సుల్ లో అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 29 Sep 2024 6:25 AM GMTఎనిమిది రోజుల మిషన్ లో భాగంగా సునీతా విలియమ్స్, బుచ్ విల్ మోర్ లు జూన్ 6న బోయింగ్ స్టార్ లైనర్ క్యాప్సుల్ లో అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే స్టార్ లైనర్ లో సమస్యలు తలెత్తడంతో ఈ ఇద్దరు వ్యోమగాములూ అంతరిక్షంలో చిక్కుకుపోయారు. ఈ క్రమంలో వారిని తిరిగి తీసుకొచ్చేందుకు నాసా మరో మిషన్ స్టార్ట్ చేసింది.
అవును... స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ లో సమస్య తలెత్తడంతో అంతరిక్షంలో చిక్కుకుపోయిన వ్యోమగాములు సునీతా, విల్ మోర్ లను తిరిగి తీసుకొచ్చేందుకు స్పేస్ ఎక్స్ క్రూ-9 మిషన్ ను ప్రయోగించినట్లు నాసా తాజాగా వెళ్లడించింది. సెప్టెంబర్ 28 రాత్రి 10:46 గంటలకు ఫ్లొరిడాలోని కేప్ కెనావెరల్ నుంచి ఈ రాకెట్ ను ప్రయోగించారు.
ఈ రాకెట్ అంతరిక్షంలోని వ్యోమగాములను తీసుకుని ఫిబ్రవరిలో తిరిగి రానున్నట్లు నాసా తెలిపింది. ఇందులో సాధారణంగా నలుగురు ప్రయాణించవచ్చు. అయితే.. నాసా వ్యోమగామి నిక్ హేగ్, రష్యన్ కాస్మోనాట్ అలెగ్జాండర్ గోర్బునోవ్ మాత్రమే ఉన్నారని.. మిగిలిన రెండు సీట్లు సునీత, విల్ మోర్ ల తిరుగు ప్రయాణానికి కేటాయించబడ్డాయని నాసా తెలిపింది.
ఈ సమయంలో... దీన్నీ సక్సెస్ ఫుల్ గా ప్రయోగించిన నాసా, స్పేస్ ఎక్స్ లకు నాసా చీఫ్ బిల్ నెల్సన్ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా స్పందించిన నాసా అంతరిక్ష కార్యకలాపాలకు సంబంధించిన అసోసియేట్ అడ్మినిస్ట్రేటర్ కెన్ బోవర్ సాక్స్... ఈ పొడిగించిన మిషన్ సమయంలో వ్యోమగాములు ఎదుర్కొన్న సవాళ్లను అంగీకరించారు.
కాగా... 8 రోజుల మిషన్ లో భాగంగా జూన్ 6న అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన వ్యోమగాములు ఇద్దరూ వాస్తవానికి జూన్ 14న తిరిగి ప్రయాణం కావాల్సి ఉంది. అయితే... వ్యోమనౌకలో హీలియం లీకేజీ కారణంగా తలెత్తిన సాంకేతిక సమస్యలతో వీరి ప్రయాణం వాయిదా పడుతూ వచ్చింది. ఈ సమయంలో తాజాగా వీరిని తిరిగి తీసుకొచ్చేందుకు క్రూ-9 మిషన్ ను నాసా ప్రయోగించింది.