ఏపీ: అధికారులపై స్పీకర్ సీరియస్.. ప్రశ్నోత్తరాల్లో గందరగోళం
ఒక శాఖకు సంబంధించిన ప్రశ్నలు మరో శాఖలకు వెళ్లడంపై అధికారులపై స్పీకర్ సీరియస్ అయ్యారు. అలాగే.. ఉభయ సభల్లోనూ మంత్రికి ఒకే ప్రశ్న రావడంపైనా ఆయన మండిపడ్డారు.
By: Tupaki Desk | 20 Nov 2024 6:37 AMఏపీలో అసెంబ్లీ సమావేశాలు హాట్‌హాట్‌గా సాగుతున్నాయి. కూటమి ప్రభుత్వం, వైసీపీ మధ్య మాటలయుద్ధం నడుస్తూనే ఉంది. సమావేశాల్లో భాగంగా ఈ రోజు ప్రశ్నోత్తరాల సమయంలో అయోమయం నెలకొంది. దాంతో అధికారులపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు సీరియస్ అయ్యారు.
ఏపీ అసెంబ్లీ సమావేశాలు నేటితో ఎనిమిదో రోజుకు చేరాయి. ఇప్పటికే బడ్జెట్ ప్రవేశపెట్టి దానిపైన చర్చ కొనసాగింది. ఈ రోజు సభ ప్రారంభం కాగానే.. స్పీకర్ ప్రశ్నోత్తరాలు చేపట్టారు. ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్న క్రమంలో సభలో గందరగోళం నెలకొంది. ఒక శాఖకు సంబంధించిన ప్రశ్నలు మరో శాఖలకు వెళ్లడంపై అధికారులపై స్పీకర్ సీరియస్ అయ్యారు. అలాగే.. ఉభయ సభల్లోనూ మంత్రికి ఒకే ప్రశ్న రావడంపైనా ఆయన మండిపడ్డారు. అధికారులు తమ శాఖకు సంబంధించి వచ్చిన ప్రశ్నలను ఇతర శాఖలకు ఎలా బదలాయిస్తారని ప్రశ్నించారు.
అధికారులు అప్రమత్తంగా లేకుండా ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించారు. ఇళ్ల స్థలాలు, ఇళ్ల పంపిణీకి సంబంధించిన ప్రశ్న రెవెన్యూకు ఎలా వేస్తారని నిలదీశారు. అలాగే.. గోదావరి పుష్కరాల పనుల విషయంలోనూ జలవనరు శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుకు ప్రశ్న వెళ్లింది. అదే సమయంలో మండలిలో గాలేరు నగరి, హంద్రీనీవా అనుసంధాన ప్రాజెక్టుపై ప్రశ్న ఇచ్చారు. ఇలా ఇవ్వడంపైనా స్పీకర్ అభ్యంతరం తెలిపారు. ఉభయసభల్లోనూ ఒకే మంత్రికి ఎలా ప్రశ్న వేస్తారని ప్రశ్నించారు. ఒకే మంత్రికి ఒకే సమయంలో ఒకే ప్రశ్న రావడంపై విస్మయం వ్యక్తం చేశారు. దీంతో అధికారుల పనితీరుతో సభలో కాస్త గందరగోళం పరిస్థితి కనిపించింది.
శాసనసభ సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలుకు మంత్రులు సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది. రూల్ 344 కింద కూటమి ప్రభుత్వం 150 రోజుల పాలనలో అభివృద్ధి, సంక్షేమ పథకాలపై శాసన సభలో చర్చించనున్నారు. నేటి సభలోనూ పలు బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుననట్లు సమాచారం. అలాగే.. రుషికొండపై నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భవనాలపై చర్చ కూడా జరగనుంది. అలాగే కొత్త మద్యం పాలసీపై మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడనున్నట్లు తెలిసింది.