Begin typing your search above and press return to search.

హరీశ్‌రావు హంగామా.. స్పీకర్ ఏం చేయబోతున్నాంటే..?

తెలంగాణ అసెంబ్లీలో శుక్రవారం ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయి. ఫార్ములా ఈ-కారు రేసులో కేటీఆర్‌పై కేసు నమోదు చేయడంపై చర్చ పెట్టాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు.

By:  Tupaki Desk   |   21 Dec 2024 10:32 AM GMT
హరీశ్‌రావు హంగామా.. స్పీకర్ ఏం చేయబోతున్నాంటే..?
X

మాజీమంత్రి హరీశ్‌రావు స్పీకర్ చర్యలు తీసుకోబోతున్నారా..? హరీశ్ సృష్టించిన రణరంగాన్ని సీరియస్‌గా తీసుకున్నారా..? గత కాంగ్రెస్ సభ్యులపై తీసుకున్న చర్యలే ఇప్పుడు హరీశ్‌రావుపై తీసుకోనున్నారా..? అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి.

తెలంగాణ అసెంబ్లీలో శుక్రవారం ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయి. ఫార్ములా ఈ-కారు రేసులో కేటీఆర్‌పై కేసు నమోదు చేయడంపై చర్చ పెట్టాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. అయితే.. ఇందుకు స్పీకర్ అంగీకరించలేదు. దీంతో సభ్యులంతా కలిసి పోడియం వద్దకు చేరుకున్నారు. వారిని అడ్డుకునేందుకు మార్షల్స్ ప్రయత్నించినప్పటికీ .. తోచుకుంటూ వెళ్లారు. అందులోనూ మాజీమంత్రి హరీశ్ పోడియం ఎక్కేందుకు ప్రయత్నించారు.

ఆ సమయంలో అసెంబ్లీలో ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఇటు కాంగ్రెస్, అటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మధ్య ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయి. దీంతో హరీశ్ రావు స్పీకర్ పోడియం వద్దకు ప్లకార్డులతో దూసుకొచ్చారు. మార్షల్స్‌ను తోసేసి పోడియం వద్దకు వెళ్లే ప్రయత్నం చేశారు. ఈ విజువల్స్ కాస్త బయటకు వచ్చాయి. అంతకుముందు స్పీకర్ పోడియంపై కాగితాలు చింపి విసిరారు.

ఈ క్రమంలో హరీశ్ రావు పరుష పదజాలంతో దూషించినట్లు అధికార పక్షం సభ్యులు ఆరోపిస్తున్నారు. దళిత స్పీకర్‌ను దూషిస్తారా అంటూ కాంగ్రెస్ సభ్యులు మండిపోతున్నారు. హరీశ్‌పై చర్యలకు డిమాండ్ చేశారు. గతంలో పేపర్లు చింపి విసిరేసి, స్పీకర్‌ను దూషించిన సంపత్ కుమార్‌ను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. ఇప్పుడు హరీశ్ రావును సస్పెండ్ చేయాలని, సభ్యత్వం రద్దు చేయాలన్న డిమాండ్ వినిపిస్తోంది. దీంతో హరీశ్‌పై స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారా అన్న ఆసక్తి కనిపిస్తోంది. శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో చర్చించి స్పీకర్ నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.