ఫస్ట్ మిస్టేక్... బాలయ్యకు స్పీకర్ స్మూత్ వార్నింగ్!
ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిందిగా ఆయనను ఈ సభ హెచ్చరిస్తుంది" అని స్పీకర్ ఫస్ట్ వార్నింగ్ ఇచ్చి, క్షమించారు!
By: Tupaki Desk | 21 Sep 2023 9:00 AM GMTతొలిరోజు ఏపీ అసెంబ్లీ అట్టుడికిపోయింది. ప్లకార్డులతో సభలోకి వచ్చిన టీడీపీ ఎమ్మెల్యేలు వచ్చీరాగానే ఆందోళన మొదలుపెట్టారు! చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో చంద్రబాబు అరెస్టుపై చర్చించాలంటూ టీడీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించడంతో అసలు రచ్చ మొదలైంది.
ఇందులో భాగంగా చంద్రబాబు అరెస్ట్ పై చర్చ చేపట్టాల్సిందేనంటూ పట్టుబట్టిన టీడీపీ ఎమ్మెల్యేలు నినాదాలతో హోరెత్తించారు. ఈ క్రమంలో స్పీకర్ పోడియం దగ్గరకెళ్లి ఆందోళనకు దిగారు. దీంతో గందరగోళం ఏర్పడింది. ఇదే సమయంలో బాలకృష్ణ తొడకొడుతూ, మీసం తిప్పుతూ రెచ్చగొడుతున్నారని వైసీపీ నేతలు ఫైరయ్యారు.
ఇలాంటి పనులు సినిమాలో చేసుకోవలని సూచించారు. టీడీపీ సభ్యుల తీరుతో సభలో అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే సమయంలో టీడీపీ సభ్యులపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ ను కోరారు. ఇదే సమయంలో స్పీకర్ పై దౌర్జన్యానికి దిగడం సరైంది కాదని సూచించారు. అనంతరం ఈ పరిణామలపై స్పీకర్ స్పందించారు.
"ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలియజేయకుండా ఈ సభ ఔనత్యాన్ని తొలగించేలా తొడలు చరచడం, మీసాలు మెలివేయడం వంటి వికృత చేష్టలు సభలో చేయడమే తప్పు. కానీ.. సభాస్థానంలోకి వచ్చి మీసాలు మెలివేయడం వంటి చర్యలు చేపట్టిన నందమూరి బాలకృష్ణ సభాసాంప్రదాయాలకు తిలోధకాలిచ్చారు" అని స్పీకర్ తెలిపారు.
అనంతరం... "ఇది తన మొదటి తప్పిదంగా భావించి సభ ఆయనకు మొదటి హెచ్చరికను చేస్తుంది. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిందిగా ఆయనను ఈ సభ హెచ్చరిస్తుంది" అని స్పీకర్ ఫస్ట్ వార్నింగ్ ఇచ్చి, క్షమించారు!
ఇదే సమయంలో ఈ సమావేశాలు పూర్తయ్యే వరకూ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, అనగాని సత్యప్రసాద్, పయ్యావుల కేశవ్ లను సస్పెన్షన్ చేస్తున్నట్లు ప్రకాటించిన స్పీకర్... ఉండవల్లి శ్రీదేవితో పాటు మిగిలిన టీడీపీ నేతలను ఒకరోజు సస్పెండ్ చేశారు.