పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు.. బీజేపీ-కాంగ్రెస్ పార్టీల హడావుడి పీక్!
కాంగ్రెస్‌ను ఓవర్ టేక్ చేసేందుకు బీజేపీ, బీజేపీ ఎత్తుగడల ను నిలువరించాలని కాంగ్రెస్
By: Tupaki Desk | 15 Sep 2023 2:30 AM GMTమరో నాలుగు రోజుల్లో పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. ఇవి మొత్తం 5 రోజుల పాటు జరగనున్నాయి. 18వ తేదీ నుంచి 22వ తేదీ వరకు జరిగే ఈ సమావేశాలు ప్రధాని నరేంద్ర మోడీ హయాంలో ప్రత్యేకంగా జరుగుతున్న సమావేశాలనే చెప్పాలి. ఇప్పటి వరకు అనేక సార్లు ప్రత్యేక సమావేశాలు జరిగినా.. మోడీ పాలిత 9 సంవత్సరాల కాలంలో మాత్రం ఇదే తొలిసారి.
అయితే.. ఈ ప్రత్యేక సమావేశాలపై ఇటు అధికార బీజేపీ, అటు ప్రతిపక్ష కాంగ్రెస్ కూడా.. ఎక్కడా లేని విధంగా హడావుడి చేస్తుండడం గమనార్హం. కాంగ్రెస్‌ను ఓవర్ టేక్ చేసేందుకు బీజేపీ, బీజేపీ ఎత్తుగడల ను నిలువరించాలని కాంగ్రెస్... ఇలా ఒక పార్టీపై మరోపార్టీ.. వ్యూహ ప్రతివ్యూహాలతో ముందుకు సాగుతున్నాయి.
ఈ క్రమంలో గతంలో కూడా లేని విధంగా ఈ ఐదు రోజుల ప్రత్యేక సమావేశాలకు సభ్యులు ఎవరూ డుమ్మా కొట్ట రాదంటూ.. రెండు పార్టీలు కూడా విప్‌లు జారీ చేయడం మరింత సంచలనంగా మారింది.
ప్రత్యేక సమావేశాల్లో కీలకమైన అంశాలు, బిల్లులు చర్చకు రాబోతున్నందున ప్రతి ఎంపీ హాజరుకావాలని వేర్వేరు విప్‌లపై ఆ రెండు పార్టీలు పేర్కొన్నాయి. ఈ సమావేశాల ఎజెండాను రాజ్యసభ, లోక్‌సభ ఇప్పటికే వెల్లడించిన నేపథ్యంలో ప్రతిపక్ష కాంగ్రెస్ మరింత అలెర్ట్ అయింది. తమకు ఇబ్బంది కలిగించేలా.. లేదా తమను ఓవర్ టేక్ చేసేలా బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు సాగితే.. దానిని ఎదుర్కొనేందుకు కూడా సిద్ధంగా ఉండాలనే రీతిలో కాంగ్రెస్ అడుగులు వేస్తోంది.
మరోవైపు.. కీలకమైన ఐదు బిల్లులు 1) ది అడ్వకేట్స్ సవరణ బిల్లు-2003, 2) ద ప్రెస్ అడ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పీరియాడికల్స్ బిల్లు-2023, 3) ఎన్నికల కమిషనర్ బిల్లు సహా మరో రెండు బిల్లులు(వెల్లడించలేదు) కూడా ఈ సమావేశాల్లో చర్చకు వచ్చి ఆమోదించుకునేందుకు బీజేపీ ప్రభుత్వం రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో అటు కాంగ్రెస్, ఇటు బీజేపీలు కూడా తమ హడావుడిని పీక్ స్టేజ్‌కు తీసుకువెళ్లడం ఆసక్తిగా మారింది.