'రైతు బంధు' పై మాటల తూటాలు
గతంలో తమిళనాడులోనూ.. అక్కడి అన్నా డీఎంకే ప్రభుత్వం ఎన్నికల సమయంలో కీలక పథకాలను అమలు చేసింది.
By: Tupaki Desk | 27 Nov 2023 11:30 AM GMTరైతు బంధు పథకం విషయం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హాట్ టాపిక్ అయింది. ఈ పథకాన్ని ముందు కొనసాగించవచ్చని.. తర్వాత.. వద్దని.. కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. వాస్తవానికి ఇది ఎప్పటి నుంచో ఉన్న పథకం కాబట్టి.. అమలు చేయొచ్చు. గతంలో తమిళనాడులోనూ.. అక్కడి అన్నా డీఎంకే ప్రభుత్వం ఎన్నికల సమయంలో కీలక పథకాలను అమలు చేసింది. అదేవిధంగా ఏపీలో 2019 ఎన్నికల సమయంలో పసుపు-కుంకుమ పేరుతో చంద్రబాబు ప్రభుత్వం కూడా.. నిధులు పంచింది.
వీటిపైనా అప్పట్లో ప్రతిపక్షాలు కోర్టులకు వెళ్లాయి. ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేశాయి. అయితే.. ఆ యా పథకాలు ఎన్నికలకు ముందు నుంచి అమల్లోనే ఉన్నందున వాటిని కొనసాగించ వచ్చని ఎన్నికల సంఘం పేర్కొంది. కట్ చేస్తే.. ఇప్పుడు మాత్రం తెలంగాణలో ఎన్నికల సంఘం ముందు ఓకే చెప్పింది. కానీ, ఇప్పుడు అనూహ్యంగా బ్రేకులు వేసింది. అయితే.. ఈ పరిణామంపై అధికార బీఆర్ ఎస్, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల తూటాలు పేలాయి.
రైతులు గుర్తు పెట్టుకోవాలి: కవిత
కాంగ్రెస్ పార్టీ నాయకులకు రైతుల క్షేమం పట్టదని ఎమ్మెల్సీ కవిత ఫైరయ్యారు. ఎన్నికల సంఘం విధించిన నిబంధన.. కేవలం కాంగ్రెస్ ఫిర్యాదు చేయడం వల్లే వచ్చిందని ఆమె అన్నారు. ఇదంతా కాంగ్రెస్ నిర్వాకమేనని.. కాంగ్రెస్ నేతలకు రైతులంటే గిట్టదని ఆమె వ్యాఖ్యానించారు. ఈసీ నిర్ణయం వెలువడిన క్షణాల్లోనే కవిత ఎక్స్ వేదికగా కాంగ్రెస్ నేతలను టార్గెట్ చేశారు. కీలకమైన ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేతల నిజస్వరూపాన్ని రైతన్నలు, రైతు బిడ్డలు యాదిలో పెట్టుకోవాలని.. కవిత సూచించారు.
వారు పెట్టుకున్న కుంపటే: రేవంత్
ఎన్నికల సంఘం రైతుబంధుకు బ్రేక్ వేయడానికి.. తమకు ఎలాంటి సంబంధం లేదని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ చీఫ్ రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. మంత్రి హరీష్‌రావు చేసిన వ్యాఖ్యల కారణంగానే రైతు బంధును నిలిపివేసినట్టు.. కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసిందని.. రేవంత్‌రెడ్డి అన్నారు. రైతు బంధును కొందరికే వేసి వారి ఓట్లు దండుకునేందుకు బీఆర్ ఎస్ ప్రభుత్వం కుతంత్రాలు చేసిందని.. ఆయన ఆరోపించారు. మరో 15 రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడుతుందని.. అప్పుడు ఒక్కొక్కరి ఖాతాలో రూ.15 వేల చొప్పున రైతు భరోసా వేస్తామని ఆయన చెప్పారు.