Begin typing your search above and press return to search.

మహారాష్ట్రలో 'సింహా' తరహా సన్నివేశం... ఇక్కడ స్పీడ్ బ్రేకరే బాలయ్య!

అవును... ఒక్కోసారి పొరపాట్లు కూడా కలిసి వస్తుంటాయని.. వాటితోనూ మంచి జరుగుతుంటుందని చెబుతుంటారు.

By:  Tupaki Desk   |   3 Jan 2025 6:13 AM GMT
మహారాష్ట్రలో సింహా తరహా సన్నివేశం...  ఇక్కడ స్పీడ్  బ్రేకరే బాలయ్య!
X

చాలా మంది బైక్స్ పై రయ్ రయ్ మంటూ దూసుకుపోతున్న సమయంలో ఎదురుగా స్పీడ్ బ్రేకర్ కనిపిస్తే.. తెగ చికాకు పడిపోతుంటారు.. మంచి సౌండ్ తో వెళ్తున్న బైక్ కి ఈ బ్రేకర్స్ ఎందుకు అడ్డు అని సణుగుకుంటుంటారు. అయితే.. వాటి ప్రాముఖ్యత తెలిసినవారికి తెలుస్తుంది! ఆ సంగతి అలా ఉంటే.. స్పీడ్ బ్రేకర్ పోసిన ప్రాణం వ్యవహారం తాజాగా తెరపైకి వచ్చింది.

అవును... ఒక్కోసారి పొరపాట్లు కూడా కలిసి వస్తుంటాయని.. వాటితోనూ మంచి జరుగుతుంటుందని చెబుతుంటారు. ఈ నేపథ్యంలో... స్పీడ్ బ్రేకర్ ఉందనే విషయం గమనించకుండా రయ్యి మంటు దూసుకుపోయిన ఓ అంబులెన్స్ లో.. మరణించాడు అని భావించిన వ్యక్తి తిరిగి కదలడం ప్రారంభించాడు. ఆ కథేమిటో ఇప్పుడు చూద్దాం!

మహారాష్ట్రలోని కొల్హాపూర్ లో అందరూ మరణించాడు అని అనుకొన్న వ్యక్తి ఊహించని విధంగా బతికి బట్టకట్టిన అరుదైన ఘటన జరిగింది. కొల్హాపూర్ కు చెందిన పాండురంగ్ అనే వ్యక్తి డిసెంబర్ 16న గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దీంతో... కుటుంబ సభ్యులు హుటాహుటిన దగ్గర్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.

ఈ సమయంలో పాండురంగ్ ని పరిశీలించిన వైద్యులు.. అతడు మృతి చెందినట్లు చెప్పారు. దీంతో... కుటుంబ సభ్యులు, బంధువులు ఒక్కసారిగా శోక సంద్రంలో మునిగిపోయారు. మరోపక్క అంత్యక్రియలకు ఏర్పాటు చేశారు. గ్రామస్థులు, స్నేహితులు, మొదలైనవారు పాండురంగ్ ఇంటికి చేరుకున్నారు.

ఆస్పత్రి నుంచి మృతదేహం వచ్చిన అనంతరం అంత్యక్రియల కార్యక్రమం మొదలుపెట్టాలని నిర్ణయించుకుని.. పాండురంగ్ ని కడసారి చూడటం కోసం ఎదురు చూడసాగారు. ఈ సమయంలో... ఆస్పత్రి నుంచి స్వగ్రామానికి మృతదేహాన్ని అంబులెన్స్ లో తరలిస్తున్నారు. ఈ సమయంలో మార్గ మధ్యలో ఓ స్పీడ్ బ్రేకర్ వచ్చింది. అయితే.. ఆ విషయం అంబులెన్స్ డ్రైవర్ గమనించలేదు.

ఆ స్పీడ్ బ్రేకర్ పై నుంచి రయ్ మంటూ అంబులెన్స్ ను పోనిచ్చాడు. దీంతో... ఒక్కసారిగా భారీ కుదుపుకు లోనయ్యింది అంబులెన్స్. దీంతో.. అందులో ఉన్న పాండురంగ్ శరీరంలో చలనం మొదలైందట. ఈ సమయంలో మరణించాడనుకున్న పాండురంగ్.. చేతులు కదపడం గమనించారంట కుటుంబ సభ్యులు. దీంతో... అదే అంబులెన్స్ లో హుటాహుటిన మరో ఆస్పత్రికి తరలించారంట.

దీంతో... అక్కడ పాండురంగ్ ను పరిశీలించిన వైద్యులు.. అతడిని ఆస్పత్రిలో చేర్చుకుని, యాంజియోప్లాస్టీ సర్జరీ నిర్వహించారు. ఈ ఆపరేషన్ జరిగిన రెండు వారాల అనంతరం కోలుకున్న పాండురంగ్.. ఇటీవల ఇంటికి చేరుకున్నారు. దీంతో.. ఈ విషయం వైరల్ గా మారింది. "ఇది స్పీడ్ బ్రేకర్ పోసిన ప్రాణం" అని కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు!

ఇదే సమయంలో 'సింహ' సినిమాలో చాలా కాలంగా కోమాలో ఉన్న విలన్ పాత్రధారి... బాలకృష్ణ కొట్టిన ఒకే ఒక్క దెబ్బకు లేచి కూర్చున్న సన్నివేశాన్ని గుర్తు చేస్తూ... పాండురంగ్ వ్యవహారంలో మాత్రం "స్పీడ్ బ్రేకరే బాలయ్య" అని మరికొంతమంది స్పందిస్తున్నారు.