స్పైవేర్ ఎటాక్... డేంజర్‌లో ఐఫోన్లు... !
ప్రస్తుతం భారత్, అమెరికాల్లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో రాజకీయ నాయకులను టార్గెట్ గా చేసుకుని ఈ స్పైవేర్‌ను వినియోగిస్తున్నారని యాపిల్ కంపెనీ వివరించింది.
By: Tupaki Desk | 11 April 2024 5:30 PM GMTలక్షల రూపాయలు పోసి కొనుగోలు చేసే ఐఫోన్ల విషయంలో వినియోగదారులు ఆశించేంది పటిష్టమైన భద్రత. ఈ విషయంలో ఐఫోన్ తయారు దారు యాపిల్ అనేక హామీలు ఇస్తుంది. అనేక భద్రతా ఫీచర్లు కూడా కల్పిస్తుంది. కానీ.. ఇప్పుడు అదే ఐఫోన్.. డేంజర్‌లో పడింది. 'స్పైవేర్' ఐఫోన్లలో చొరబడింది. ఈ విషయాన్ని సదరు యాపిల్ కంపెనీనే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వినియోగదారులకు చేరవేయడమే కాకుండా హెచ్చరికలు కూడా జారీ చేసింది.
భవిష్యత్తులో స్పైవేర్ ఎటాక్ చేస్తుందని యాపిల్ చెప్పడంతోపాటు.. ఇప్పటికే భారత్ సహా పలు దేశాల్లో వినియోగిస్తున్న ఐఫోన్లలో స్పైవేర్ జొరబడిందని తెలిపింది. ఇది పూర్తిగా పెగాసస్ మాదిరిగానే ఉంటుందని కంపెనీ వివరించింది. ఇక, స్పైవేర్ కనుక ఎటాక్ చేస్తే.. సదరు వినియోగదారుల వ్యక్తిగత వివరాలు ఆటోమేటిక్గా యూజర్ల చేజారి పోతుంది. బ్యాంకు అకౌంట్ల నుంచి సోషల్ మీడియా ఖాతాల వరకు కూడా ఈ స్పైవేర్ తన అదుపులోకి తీసుకుంది.
ప్రస్తుతం భారత్, అమెరికాల్లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో రాజకీయ నాయకులను టార్గెట్ గా చేసుకుని ఈ స్పైవేర్‌ను వినియోగిస్తున్నారని యాపిల్ కంపెనీ వివరించింది. ముఖ్యంగా ప్రతిపక్ష నాయకులు చేసుకునే సంభాషణలు సైతం.. ఈ స్పైవేర్ గుట్టుగా రికార్డు చేస్తుందని తెలిపింది. ఈ నేపథ్యంలో వినియోగదారులు తరచుగా ఫోన్‌ను స్విచ్ఛాప్ చేసుకుని ఆన్ చేసుకోవాలని.. డేటాను అదే పనిగా ఓపెన్ చేసి ఉంచరాదని సూచించింది. సాధ్యమైనంత వరకు గుర్తు తెలియని వారి సందేశాలు, ఫోన్లు రిసీవ్ చేసుకోకుండా ఉండాలని యాపిల్ కంపెనీ సూచనలు చేసింది.