హిందువుల మనోభాల్ని దెబ్బ తీసేలా కేరళ సర్కార్.. మెట్రో మ్యాన్ కీలక వ్యాఖ్యలు
కేరళలో ఒక బ్రిడ్జి నిర్మాణం విషయంలో కేరళలోని పినరయి సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని ఆయన తీవ్రంగా తప్పు పడుతున్నారు.
By: Tupaki Desk | 7 Sep 2024 4:28 AM GMTశ్రీధరన్ అన్నంతనే గుర్తుకు పట్టకపోవచ్చు కానీ.. ఢిల్లీ మెట్రో మ్యాన్ అన్నంతనే చాలామంది గుర్తిస్తారు. రైల్వేలలో ఆయనకున్న అనుభవం.. దేశంలో మెట్రో మోడల్ ను పరిచయం చేయటమే కాదు.. విజయవంతంగా నడిపేలా చేయటంలోనూ ఆయన కీలక భూమిక పోషించారు. ఇప్పటివరకు మెట్రో రైళ్లు.. మౌలిక వసతులకు సంబంధించిన అంశాల మీదే తప్పించి.. మరే అంశం మీదా పెద్దగా మాట్లాడని ఆయన తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. అది కూడా కేరళ సర్కారు తీరును తప్పుపడుతూ.
కేరళలో ఒక బ్రిడ్జి నిర్మాణం విషయంలో కేరళలోని పినరయి సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని ఆయన తీవ్రంగా తప్పు పడుతున్నారు. నదీ తీరంలో ఉన్న దేవాలయాల పవిత్రత దెబ్బ తినకుండా వంతెన నిర్మాణం చేపట్టే విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును తప్పు పట్టిన ఆయన.. తన మాటల్ని పట్టించుకోకపోవటంతో ఆయన కేరళ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
కేరళ సర్కారు భరత్ పూజా నది మీద తిరువనయ - తవనూర్ బ్రిడ్జిను నిర్మిస్తోంది. అయితే.. నదీ తీరంలో ఉన్న దేవాలయాల పవిత్రత దెబ్బ తినకుండా బ్రిడ్జిని నిర్మించొచ్చన్నది శ్రీధరన్ వాదన. దీనికి సంబంధించి ఆయన ఒక ప్రతిపాదన కూడా సిద్ధం చేసుకున్నారు. వంతెన అలైన్ మెంట్ మార్చేందుకు తాను ఉచితంగా సేవలు అందిస్తానని.. తనకు ఒక అవకాశం ఇస్తే.. దాన్ని ఎలా నిర్మించాలో చెప్పేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.
దీనికి సంబంధించి పినరయి సర్కారుకు ఒక లేఖ రాశారు. కానీ.. ఆయనకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న వంతెనను నిర్మిస్తే.. ఇరువైపులా ఉన్న ఆలయాల్ని వంతెన వేరు చేస్తుందని.. హిందువుల మనోభావాల్ని దెబ్బ తీస్తుందన్నది ఆయన వాదన. ప్రభుత్వం తన సూచనపై సానుకూలంగా స్పందించకపోవటంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. మెట్రో మ్యాన్ కారణంగా పినరయి సర్కారుకు కొత్త సవాలు ఎదురుకానుందా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.