Begin typing your search above and press return to search.

టైటిల్ కొట్టలేకున్నా.. మనసులు కొల్లగొట్టింది సన్ రైజర్స్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 17వ సీజన్ ప్రారంభానికి ముందు సన్ రైజర్స్ హైదరాబాద్ మీద ఎవరికీ పెద్ద అంచనాల్లేవు.

By:  Tupaki Desk   |   27 May 2024 10:08 AM GMT
టైటిల్ కొట్టలేకున్నా.. మనసులు కొల్లగొట్టింది సన్ రైజర్స్
X

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 17వ సీజన్ ప్రారంభానికి ముందు సన్ రైజర్స్ హైదరాబాద్ మీద ఎవరికీ పెద్ద అంచనాల్లేవు. గత కొన్ని సీజన్లుగా జట్టు ప్రదర్శన ఏమీ బాగోలేదు. రెండు టైటిల్స్ (దక్కన్ చార్జర్స్ గా ఉన్నప్పుడూ) కొట్టిన ఈ జట్టు క్రమంగా బలహీనపడింది. రెండేళ్ల కిందట ఆస్ట్రేలియా, టీమిండియా ఓపెనర్ల డేవిడ్ వార్నర్, శిఖర్ ధావన్ వెళ్లిపోవడంతో మరింత బలహీనపడింది. భువనేశ్వర్ కుమార్ గతంలోలా బౌలింగ్ లో మెరవడం లేదు. సందీప్ శర్మ వంటివారు వేరే జట్లకు వెళ్లిపోయారు. విలియమ్సన్ వంటి నిలకడైన ఆటగాడూ లేడు. మొత్తానికి చూస్తే అసలు సన్ రైజర్స్ హైదరాబాద్ కు ఆకర్షణే లేదు.

సొంత రికార్డులు బద్దలు

17వ సీజన్ లో సన్ రైజర్స్ ఇంతగా రాణిస్తుందని ఎవరూ అనుకోలేదు. దీనికితగ్గట్లే సీజన్ ను చాలా సాధారణంగా మొదలుపెట్టింది హైదరాబాద్. కానీ, ఉప్పల్ లో సరిగ్గా రెండు నెలల కిందట మంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో 277 పరుగుల రికార్డు స్కోరు కొట్టింది. మళ్లీ ఏప్రిల్ 15న బెంగళూరుపై బెంగళూరులో 288 పరుగులు బాది తన రికార్డును తానే బద్దలు కొట్టింది. ఏప్రిల్ 20న ఢిల్లీపై 266 పరుగులు సాధించింది. వాస్తవానికి సన్ రైజర్స్ దూకుడుతోనే ఐపీఎల్ 17 సీజన్ పై ఒక్కసారిగా ఆసక్తి పెరిగింది. పవర్ ప్లే 6 ఓవర్లలోనే 125 పరుగులు, 150పైగా టార్గెట్ ను అత్యంత వేగంగా ఛేదించడం చూస్తే ఓ దశలో టోర్నీలో 300 పరుగులు కొట్టే జట్టు ఏదంటే సన్ రైజర్స్ అనే అభిప్రాయం వ్యక్తమైంది.

కమ్మిన్స్ ను కొని..

తాజా సీజన్ లో సన్ రైజర్స్ ఫేట్ మార్చింది ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ అనే చెప్పాలి. రూ.20.50 కోట్లకు హైదరాబాద్ ఇతడిని కొనుక్కుంది. మేటి పేసర్ అయిన కమ్మిన్స్ రాకతో జట్టులో సమతూకం ఏర్పడింది. అంతేకాక.. తన నాయకత్వ సామర్థ్యంతో అతడు ఆద్యంతం ఆకట్టుకున్నాడు. ట్రావిస్ హెడ్ పై నమ్మకం ఉంచి ఓపెనర్ గా పంపడం, తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డిని ప్రోత్సహించడం ఇవన్నీ కమ్మిన్స్ కెప్టెన్సీకి మచ్చుతునకలు. బౌలర్ గానూ కీలక సమయంలో వికెట్లు పడగొడుతూ ప్రత్యర్థులను దెబ్బతీశాడు. టోర్నీలో 18 వికెట్లు తీశాడు. ఇక 147.37 స్ట్రెక్‌ రేట్‌ తో 136 పరుగులు చేశాడు. కాగా, గత సీజన్ లో మార్క రమ్ కెప్టెన్. అయితే, సారథ్య భారంతో బ్యాటింగ్ లో రాణించలేకపోయాడు. కెప్టెన్ గానూ విఫలమయ్యాడు. ఈ సీజన్ లో అదేమీ లేకపోవడంతో దక్షిణాఫ్రికా సహచరుడు క్లాసెన్ తో కలిసి చెలరేగాడు.

వామ్మో.. ఇదేం బాదుడు

ఈ సీజన్ లో హెడ్, అభిషేక్ బాదుడు చూసిన వారు వామ్మో ఇదేం ఆట అంటూ ఆశ్చర్యపోయారు. 15, 16 బంతుల్లో అర్ధశతకాలు.. 39 బంతుల్లోనే శతకంతో వీరు అలరించారు. వీరికితోడు క్లాసెన్ దూకుడుతో సన్ రైజర్స్ అహో అనిపించింది. అయితే, వీరు ముగ్గురూ విఫలమైన మ్యాచ్ ల్లో సన్ రైజర్స్ ఓటమిపాలైంది. ఏది ఏమైనా టైటిల్ కొట్టడంలో విఫలమైనప్పటికీ హైదరాబాద్ మాత్రం అభిమానుల మనసులను గెలుచుకుంది.