Begin typing your search above and press return to search.

బాలయ్య చిన్నల్లుడికి ఈసారి కూడా టఫ్ గానే....!?

ఆనాడు ఆయనకు అన్నీ కలసి వచ్చినా జనసేన ఓట్లు భారీగా చీల్చడంతో అవకాశం తప్పిపోయింది

By:  Tupaki Desk   |   20 April 2024 3:56 AM GMT
బాలయ్య చిన్నల్లుడికి ఈసారి కూడా టఫ్ గానే....!?
X

ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలక్రిష్ణ చిన్న కూతురుని వివాహం చేసుకున్న శ్రీ భరత్ కి అటు రాజకీయంగా ఇటు సినీ రంగం పరంగా కూడా పలుకుబడి ఉంది. ఆయన తాతలు అంటే అమ్మ తరఫున నాన్న తరఫున కూడా రాజకీయంగా ఉద్ధండులే. ఎంపీలుగా చేసిన వారే. విశాఖ నుంచి రెండు సార్లు ఎంపీ అయిన ఎంవీవీఎస్ మూర్తి మనవడిగా వారసుడిగా శ్రీభరత్ 2019లో తొలిసారి ఎంపీ బరిలోకి దిగారు.

ఆనాడు ఆయనకు అన్నీ కలసి వచ్చినా జనసేన ఓట్లు భారీగా చీల్చడంతో అవకాశం తప్పిపోయింది. జనసేన నుంచి జేడీ లక్ష్మీనారాయణ ఒక బలమైన సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో ఓట్ల చీలిక జరిగింది. ఇపుడు వైసీపీ అన్నీ చూసుకుని ఏకంగా అదే సామాజిక వర్గానికి చెందిన బొత్స ఝాన్సీకి ఎంపీ టికెట్ ఇచ్చింది. ఈ విషయంలో వైసీపీ వ్యూహాత్మకంగా వ్యవహరించింది అని చెప్పాలని అంటున్నారు.

ఆమె విశాఖ వాసి, విద్యాధికురాలు. రెండు సార్లు ఎంపీగా పనిచేసిన అనుభవం ఉన్న వారు. కాపు సామాజిక వర్గానికి చెందిన వారు. పైగా మహిళ. ఇలా అనేక సమీకరణలు ఆమెకు కలసి వస్తున్నాయి. దాదాపుగా నలభై ఏళ్ళ నుంచి విశాఖ ఎంపీ సీఎటు స్థానికేతరులకు పోతోంది. ఎక్కడ నుంచో వచ్చిన వారికే ఈ సీటు ఇస్తున్నారు. వారే గెలుస్తున్నారు.

ఆ అసంతృప్తి జనాలలో ఉంది. అది వైసీపీ పట్టుకుని తన నిర్ణయం ఇలా చేసింది. అదే విధంగా బలమైన కాపు సామాజిక వర్గం నుంచి కూడా ప్రధాన పార్టీల నుంచి గతంలో పోటీ చేసిన దాఖలాలు లేవు. అలాగే గెలిచినదీ లేదు. దాదాపుగా నాలుగున్నర దశాబ్దాల క్రితం కొమ్మూరు అప్పలస్వామి విశాఖ ఎంపీ అయ్యారు. ఆయన 1980లో ఎంపీగా కాంగ్రెస్ తరఫున గెలిచారు. ఆయన కాపు సామాజిక వర్గానికి చెందిన నేత.

ఆ తరువాత మళ్లీ గెలిచినది లేదు. ఇది కూడా వైసీపీకి అడ్వాంటేజ్ అని అంటున్నారు. దాంతో పాటుగా బీసీలు ఎస్సీస్ ఎస్టీలతో పాటు మైనారిటీలు కూడా విశాఖ ఎంపీ సీటు పరిధిలో ఉన్నారు.దాంతో వైసీపీకి ఇవి సోషల్ ఇంజనీరింగ్ రూపంలో కలసివస్తున్నాయని అంటున్నారు.

ఇక్కడే టీడీపీ ఎంపికను తప్పుపడుతున్న సామాజిక వర్గాల వారూ ఉన్నారు. మూర్తి బతికి ఉండగా ఆయనకే విశాఖ ఎంపీ టికెట్ ఇస్తూ వచ్చిన టీడీపీ ఇపుడు ఆయన మనవడికి ఇచ్చిందని, విశాఖలో అతి తక్కువగా ఉన్న కమ్మ సామాజిక వర్గానికే టికెట్ ఇవ్వడం ద్వారా బలమైన సామాజిక వర్గాల ఆకాంక్షను అర్ధం చేసుకోవడం లేదని అంటున్నారు. అంతే కాకుండా లోకల్ గా ఉన్న వారికి భూమిపుత్రులకు ఉత్తరాంధ్రా వాసులకు ఎందుకు టికెట్లు ఇవ్వరని కూడా ప్రశ్నిస్తున్నారు.

ఇక ఉత్తరాంధ్రా పరిరక్షణ వేదిక అధ్యయన వేదిక వంటి ప్రజా సంఘాలు సంస్థలు కూడా భూమిపుత్రులకే ఈసారి ఓటు వేసి గెలిపించాలని చేసిన విన్నపం కూడా చర్చకు వస్తోంది. విశాఖలో దాదాపుగా పద్దెనిమిది లక్షల మంది ఓటర్లు ఉన్నారు అందులో కాపులు మూడు లక్షలకు పై చిలుకు ఉన్నారు. అలాగే బీసీలు చూస్తే అయిదారు లక్షల మంది ఉన్నారు. మరి వీరందరికీ టికెట్లు ఇవ్వలేరా అని ప్రశ్న వస్తోంది.

ఇంకో వైపు చూస్తే విశాఖ సిటీలో నాలుగు అసెంబ్లీ సీట్లల్లో కనీసంగా రెండు సీట్లు వైసీపీ ఖాతాలోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2019లా నాలుగు సీట్లూ టీడీపీకి దక్కవని అంటున్నారు. గాజువాక భీమిలీ, విశాఖ తూర్పులలో హోరా హోరీ పోరు ఉందని ఎస్ కోటలో వైసీపీ మెజారిటీ సాధిస్తుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ లెక్కన చూస్తే వైసీపీ విశాఖ ఎంపీ సీటు గెలుచుకోవడం ఖాయమని అంటున్నారు.

మరో వైపు చూస్తే రాజకీయంగానూ అనుభవం పరంగానూ బొత్స ఝాన్సీతో శ్రీ భరత్ ధీటైన అభ్యర్ధిగా తలపడగలరా అన్న చర్చ సాగుతోంది. ఈయన ఇంకా యువకుడిగా ఉన్నారు. మొదటి సారి చట్ట సభలకు వెళ్లాల్సి ఉంటుంది. అదే అనుభవం కలిగిన వారిని నెగ్గిస్తే విశాఖ అభివృద్ధి సాధ్యపడుతుందని వైసీపీ ఇస్తున్న స్లోగన్ కూడా పనిచేసేలా ఉంది అని అంటున్నారు. డబుల్ పీహెచ్ డీ చేసిన బొత్స ఝాన్సీ అభ్యర్ధిత్వం తో టీడీపీ ఇబ్బందిలో పడిందని అంటున్నారు. చూడాలి మరి శ్రీ భరత్ రాజకీయ సిరి ఎలా ఉందో అన్న చర్చ అయితే సాగుతోంది.