Begin typing your search above and press return to search.

హైదరాబాద్ ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్న చంద్రబాబు : శ్రీధర్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు

తెలంగాణ సచివాలయంలో మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రశంసల్లో ముంచెత్తారు.

By:  Tupaki Desk   |   29 Jan 2025 8:47 AM GMT
హైదరాబాద్ ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్న చంద్రబాబు : శ్రీధర్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు
X

తెలంగాణ ఐటీశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును పొగడ్తలతో ముంచెత్తారు. ఇటీవల ప్రపంచ ఆర్థిక సదస్సు కోసం దావోస్ వెళ్లిన చంద్రబాబును శ్రీధర్ బాబు కలిశారు. ఆ సమయంలో మైనస్ డిగ్రీల చలి ఉండగా, 74 ఏళ్ల వయసు ఉన్న చంద్రబాబు ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోకపోవడంపై శ్రీధర్ బాబు ఆశ్యర్యం వ్యక్తం చేశారు. అంతేకాకుండా పక్కరాష్ట్రానికి సీఎంగా ఉన్నప్పటికీ ఆయన ఇప్పటికీ హైదరాబాద్ అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నారట. దీంతో శ్రీధర్ బాబు వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

తెలంగాణ సచివాలయంలో మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రశంసల్లో ముంచెత్తారు. చంద్రబాబుది విశాల దృక్పథమని, పెట్టుబడుల విషయంలో ఒక వ్యూహం ప్రకారం నడుచుకున్నారని చెప్పారు. హైదరాబాద్ ఇంకా అభివృద్ధి చెందాలనుకుంటున్న చంద్రబాబు.. ఏపీ రాజధాని అమరావతి కోసం ప్రత్యేక ప్రణాళికతో అడుగులు వేస్తున్నట్లు చెప్పారు. ఆయన పెద్ద ప్లాన్ తో దావోస్ వచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అపార వనరులు ఉన్నాయి. సుదీర్ఘ సముద్ర తీరం ప్రాంతం ఉండటం వల్ల దానికి అనువైన పరిశ్రమలు ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎంవోయూలు సిద్ధం చేశారు. అయితే వీటిపై ప్రకటనలు ఎందుకు చేయలేదని ఐటీ మంత్రి లోకేశును ప్రశ్నిస్తే అన్నీ తమ రాష్ట్రంలోనే వెల్లడిస్తామని చెప్పారు. దీనిబట్టి వారు పెద్ద ప్రణాళిక, వ్యూహంతోనే దావోస్ వచ్చినట్లు అర్థమైందని శ్రీధర్ బాబు వివరించారు.

ఇక హైదరాబాద్ ను డిస్టర్బ్ చేయాలన్న ఆలోచన చంద్రబాబుకు ఏ మాత్రం లేదు. ఇంకా మన రాజధాని అభివృద్ధి చెందాలనే ఆయన కోరుకుంటున్నారు. దావోసులో మైనస్ 8 నుంచి 11 డిగ్రీల చలి ఉంటుంది. మేమంతా స్వెట్టర్లు, జాకెట్లు వేసుకుంటే చంద్రబాబు మాత్రం సాధారణ దుస్తులతోనే ఉన్నారు. ఈ వయసులో కూడా ఆయన చాలా ఫిట్. ఇక ఎవరు అధికారంలో ఉన్నా ప్రభుత్వ విధానాలు కొనసాగించాలి. మేము కూడా అలా నడుచుకుంటున్నాం. ప్రధాని మోదీ కూడా మాజీ ప్రధాని మన్మోహన్ విధానాలను అనుసరిస్తున్నారు. అలా గత ప్రభుత్వ విధానాలను నిర్లక్ష్యం చేసిన ప్రభుత్వంగా ఏపీలోని వైఎస్ జగన్ ప్రభుత్వం పేరు తెచ్చుకుందని శ్రీధర్ బాబు విమర్శించారు.

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ కాంగ్రెస్ మంత్రి శ్రీధర్ బాబు ఎప్పుడూ వైరి పక్షాల్లోనే ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబును తీవ్రంగా విమర్శించేవారు శ్రీధర్ బాబు. కాంగ్రెస్ వాదిగా చంద్రబాబు పార్టీ టీడీపీని వ్యతిరేకించేవారు. అలాంటి నేత ఇప్పుడు ఆకస్మాత్తుగా చంద్రబాబును ప్రశంసించడం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. ప్రస్తుతం చంద్రబాబు ఎన్డీఏ కీలక భాగస్వామిగా ఉంటూ కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తున్నారు. అయినా కాంగ్రెస్ నేత ఆయనను అభినందించడం నెట్టింట చర్చకు దారితీస్తోంది.