రేవంత్ 14 అంటే.. శ్రీధర్ బాబు 12 అంటున్నారు!
తాజాగా కాంగ్రెస్ మంత్రి శ్రీధర్ బాబు.. ఈ సారి తెలంగాణలో 12 లోక్‌సభ స్థానాలను కాంగ్రెస్ హస్తగతం చేసుకుంటుందని పేర్కొన్నారు.
By: Tupaki Desk | 13 April 2024 1:30 PM GMTపార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణపై కాంగ్రెస్ ప్రత్యేక దృష్టి సారించింది. ఇక్కడ పార్టీ అధికారంలో ఉండటంతో వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో గెలిచేందుకు కసరత్తులు చేస్తోంది. ఆ మేరకు పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్ రెడ్డి ప్రణాళికల్లో మునిగిపోయారు. ఆయా పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తూ పార్టీ అభ్యర్థుల విజయం కోసం మార్గనిర్దేశనం చేస్తున్నారు. ఈ సారి తెలంగాణలో 17కి గాను కచ్చితంగా 14 లోక్‌సభ స్థానాల్లో గెలుస్తామని రేవంత్ ఫుల్ కాన్ఫిడెన్స్‌తో ఉన్నారు. కానీ ఆ ధీమా పార్టీ నాయకులకు లేనట్లు కనిపిస్తోంది. గెలిచే సీట్లపై ఒక్కొక్కరు ఒక్కో మాట మాట్లాడుతున్నారు.
తాజాగా కాంగ్రెస్ మంత్రి శ్రీధర్ బాబు.. ఈ సారి తెలంగాణలో 12 లోక్‌సభ స్థానాలను కాంగ్రెస్ హస్తగతం చేసుకుంటుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్, బీజేపీని ప్రజలు పట్టించుకోరని వ్యాఖ్యానించారు. అయితే శ్రీధర్ బాబు 12 స్థానాలు అని పేర్కొనడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఓ వైపు సీఎం రేవంత్ ఏమో 14 స్థానాల్లో గెలుస్తామనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆ మేరకు కాంగ్రెస్ శ్రేణులను సమాయత్తం చేస్తున్నారు. కానీ శ్రీధర్ బాబు మాత్రం రెండు స్థానాలు తక్కువగా చెప్పడం ఏమిటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఒక పార్టీ నేతలందరూ ఒకే మాట మీద ఉంటే ప్రజల్లోనూ నమ్మకం కలుగుతోంది. కానీ ఇలా ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడితే మొదటికే మోసం వస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
తెలంగాణ లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్ ఎన్ని చోట్ల విజయం సాధిస్తుందన్నది ఎన్నికల ఫలితాల తర్వాత తెలుస్తుంది. కానీ ఎన్నికల్లో ఓట్లు పడేలా ప్రజలకు నమ్మకం కలిగించేలా, క్యాడర్‌ను ఉత్సాహపరిచేలా నాయకులు ఇన్ని సీట్లు గెలుస్తామని అంచనాతో చెబుతుంటారు. వీలైనన్ని ఎక్కవ సీట్లే గెలుస్తామని చెప్పి కార్యకర్తలు మరింత జోష్‌తో పనిచేసేలా చూస్తుంటారు. ఇప్పుడు రేవంత్ అదే చేస్తున్నారు. మిగతా కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా అదే మాటతో జనాల్లోకి వెళ్లే బాగుంటుంది. అలా కాకుండా మంత్రి శ్రీధర్ బాబులా మరో మాట మాట్లాడితే పార్టీకే నష్టం కలుగుతుందనే టాక్ ఉంది. దీంతో కాంగ్రెస్ గెలిచే స్థానాలపై ఆ పార్టీ నాయకులకే క్లారిటీ లేదని ప్రత్యర్థి పార్టీలు విమర్శించే అవకాశం ఉంది.