సిక్కోలు సిత్రం.. మామూలుగా లేదు!
కానీ, చంద్రబాబు ఈ ఎన్నికల్లో గుండ కుటుంబాన్ని పక్కన పెట్టారు. ఈ పరిణామం కీలకమైన శ్రీకాకుళం నియోజకవర్గంలో సెగలు పుట్టిస్తోంది.
By: Tupaki Desk | 13 April 2024 6:30 AM GMTఒకప్పుడు శ్రీకాకుళం జిల్లా(సిక్కోలు) అంటే.. టీడీపీకి నల్లేరుపై నడకే. అయితే.. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు . గత ఎన్నికల సమయంలోనే ఇక్కడ వైసీపీ మెజారిటీ నియోజకవర్గాల్లో పాగా వేసేసింది. ఒక్క టెక్కలి (అచ్చెన్నాయుడు), ఇచ్ఛాపురం(బెందాళం అశోక్) మాత్రమే సైకిల్ దక్కించుకుంది. మిగిలిన నియోజక వర్గాల్లో వైసీపీ దూకుడు పెరిగింది. ఇక, ఇప్పుడు వైసీపీ నూతన ప్రయోగం చేసింది. జిల్లాలోని కీలక స్థానాల్లో ముగ్గురు మహిళలకు అవకాశం ఇచ్చింది. ఇక, టీడీపీ కేవలం ఒక్కరికే మాత్రమే(పలాస గౌతు శిరీష) అవకాశం ఇచ్చింది.
ఇది రాజకీయంగా టీడీపీకి ఇబ్బందిగా మారింది. కూటమి కట్టినప్పటికీ.. పార్టీల తరఫున మరో ఇద్దరికి టికెట్ ఇచ్చే అవకాశం ఉంది. అయినప్పటికీ.. ఆదిశగా చర్యలు తీసుకోలేదు. ఇది వైసీపీకి అడ్వాంటేజ్ గా మారిపోయింది. ఫలితంగా మహిళా పక్షపాతులం తామే నంటూ.. వైసీపీ నాయకులు ప్రచారం చేస్తున్నారు. ఇక, ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఆనవాయితాగా శ్రీకాకుళం అసెంబ్లీ టికెట్‌ను గుండ అప్పల సూర్యనారాయణ కుటుంబానికే చంద్రబాబు ఇస్తున్నారు. ఆయన సతీమణి గుండ లక్ష్మీదేవి ఈ దపా కూడా టికెట్ ఆశించారు.
కానీ, చంద్రబాబు ఈ ఎన్నికల్లో గుండ కుటుంబాన్ని పక్కన పెట్టారు. ఈ పరిణామం కీలకమైన శ్రీకాకుళం నియోజకవర్గంలో సెగలు పుట్టిస్తోంది. తాను ఈ దఫా సొంతంగానే బరిలో దిగుతానని గుండ లక్ష్మీదేవి చెబుతున్నారు. బలమైన ఓటు బ్యాంకు సొంతం చేసుకున్న గుండ కుటుంబం.. అన్నంత పనీ చేస్తే.. టీడీపీకి ఇబ్బందులు తప్పవు. నిజానికి మంత్రి ధర్మాన ప్రసాదరావుపై ఇక్కడ వ్యతిరేకత పెరిగింది. దీంతో ఈ సానుభూతి టీడీపీకి కలిసి వచ్చే అవకాశం ఉంది.
కానీ, చంద్రబాబు చేసిన ఈక్వేషన్ల కారణంగా.. పవనాలు మారుతున్నాయి. ఇక, టెక్కలిలోనూ అచ్చెన్నా యుడు ఒకప్పుడు నల్లేరుపై నడక అన్నట్టుగా విజయం దక్కించుకున్నారు. కానీ, ఇప్పుడు వైసీపీ చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. దువ్వాడ శ్రీనివాస్‌కు టికెట్ ఇవ్వడమే కాకుండా.. బలమైన నేతలతో ప్రచారం చేయిస్తోంది. దీంతో వైసీపీపుంజుకునే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు.. కిల్లి కృపారాణి ఇక్కడ కాంగ్రెస్ నుంచి బరిలో ఉండడంతో ఆమె కూడా ఓట్లు చీల్చడం ఖాయం. సో.. ఎలా చూసుకున్నా.. శ్రీకాకుళం ఈసారి టీడీపీకి అంత ఈజీకాదనే వాదన బలంగా వినిపిస్తోంది.