స్కూల్ పిల్లాడి మాదిరి మాట్లాడుతున్న శ్రీకాంత్!?
ఇప్పుడు అలాంటి ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారు సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీకాంత్ నాగులపల్లి.
By: Tupaki Desk | 23 Nov 2024 5:45 AM GMTఅధికారంలో ఎవరున్నా.. పాలకులు చెప్పింది చేసుకుంటూ పోవటానికి అఖిల భారత సర్వీసు అధికారులు ఉండరు. ప్రభుత్వాలు తప్పులు చేస్తుంటే.. వారిని హెచ్చరించటం.. ఆ నిర్ణయాల కారణంగా తర్వాతి కాలంలో చోటు చేసుకునే పరిణామాల గురించి వివరించాల్సిన అవసరం ఉంది. అయినప్పటికీ ప్రభుత్వాధినేత ఒక నిర్ణయాన్ని తీసుకొని.. అందుకు అనుగుణంగా పని చేయాలని తేల్చి చెబితే.. ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నది సదరు అధికారి మీద ఉంటుంది. ప్రభుత్వాధినేతలు చెప్పిందే వేదమన్నట్లుగా వ్యవహరించే ధోరణి గడిచిన ఇరవై ఏళ్లలో ఎక్కువైంది. అదే అనుకోని సమస్యలని తెచ్చి పెడుతోంది. ఇప్పుడు అలాంటి ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారు సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీకాంత్ నాగులపల్లి.
పాలనా సంస్కరణల్లో తనదైన మార్కు వేసినట్లుగా పేరున్న ఆయన 1998 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారి. ఏపీ ప్రభుత్వంలో ప్రిన్సిపల్ సెక్రటరీగా పని చేసిన ఆయన.. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో విద్యుత్ శాఖ కార్యదర్శిగా వ్యవహరించారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఆయన కేంద్ర సర్వీసులకు వెళ్లిపోయారు. తాజాగా అదానీ ముడుపులు.. విద్యుత్ ఒప్పందాలపై అమెరికా కోర్టులో దాఖలైన కేసుల నేపథ్యంలో.. అదానీ సంస్థతో ఏపీ సర్కారు కుదుర్చుకున్న ఒప్పందంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
ఇలాంటి వేళ.. ప్రస్తుతం కేంద్ర సర్వీసులో ఉన్న శ్రీకాంత్ స్పందించారు. సెకితో విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై వెల్లువెత్తుతున్న విమర్శల నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. అప్పట్లో చేసుకున్న ఒప్పందాన్ని సమర్థిస్తూ మాట్లాడటం గమనార్హం. అదే సమయంలో.. సెకి నుంచి విద్యుత్ తీసుకోవాలన్న నిర్ణయం ప్రభుత్వానిదేనని.. వారి ఆదేశాల్ని తాను అమలు చేసినట్లుగా చెప్పటం గమనార్హం.
ఎన్టీపీసీ నుంచి యూనిట్ విద్యుత్ రూ.1.99చొప్పున కొనేందుకు గుజరాత్ ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న విషయం తనకు తెలీదని చెప్పి ఆశ్చర్యానికి గురి చేశారు. ప్రభుత్వం భారీ ఎత్తున ఒక ఒప్పందం చేసుకుంటున్నప్పుడు.. ఆ మొత్తం డీల్ విషయంలో విద్యుత్ యూనిట్ సరఫరాకు చెల్లించాల్సిన మొత్తంపై దేశంలోని వివిధ రాష్ట్రాలు చేసుకునే ఒప్పందాలపై ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంతే తప్పించి.. ఇప్పుడు విషయం తేడా వచ్చింది కాబట్టి.. ప్రభుత్వ నిర్ణయాన్ని తాను అమలు చేశానే తప్పించి..మరింకేమీ లేదని తప్పించుకోవటం కుదరదన్న విషయాన్ని శ్రీకాంత్ గుర్తిస్తే మంచిది.
ఒక భారీ ఒప్పందంపై ప్రభుత్వం సంతకం చేయాలని అనుకునే వేళలో.. సంబంధిత శాఖ కార్యదర్శిగా వ్యవహరిస్తున్న తాను.. కాంపిటీటివ్ ప్రైస్ ఎంత? అన్నది కనీసం కూడా చెక్ చేయకుండా ఉంటారా? ఒకవేళ.. అలా ఉండి ఉండటాన్ని సమర్థించుకునే ధోరణిని ప్రదర్శించటం సరికాదని చెప్పాలి. ఏమైనా.. స్కూల్ పిల్లాడి మాదిరి సీనియర్ ఐఏఎస్ అధికారి ఈ తీరులో మాట్లాడటం ఆయన స్థాయికి బాగోదన్న మాట బలంగా వినిపిస్తోంది.