మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు షాక్.. కేసు నమోదు చేయాలన్న కోర్టు
ఆయనపై దాఖలైన అనర్హత పిటిషన్ పై తాజాగా జరిగిన విరాచణలో కోర్టు సీరియస్ కామెంట్లు చేసింది.
By: Tupaki Desk | 31 July 2023 5:26 PM GMTతెలంగాణ మంత్రి, ఉద్యోగ సంఘాల మాజీ నాయకుడు శ్రీనివాస్ గౌడ్‌కు ప్రజాప్రతినిధుల కోర్టులో గట్టి షాక్ తగిలింది. 2018, అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయన సమర్పించిన ఎన్నికల అఫిడవిట్‌ను టాంపరింగ్ చేశారన్న కేసు విచారణలో భాగంగా వాస్తవాలు ఉన్నాయని కోర్టు అభిప్రాయపడింది. వెంటనే ఆయనపై కేసునమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. అదేసమయంలో ఈ అఫిడవిట్‌ను టాంపరింగ్ చేయడంలో సహకరించారని అనుమానిస్తున్న ఐఏఎస్ అధికారుల పైనా..కేసు నమోదుకు కోర్టు ఆదేశించడం సంచలనంగా మారింది.
హైకోర్టులోనూ.. చుక్కెదురు మరోవైపు తెలంగాణ హైకోర్టులోనూ.. మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు చెక్కెదురైంది. ఆయనపై దాఖలైన అనర్హత పిటిషన్ పై తాజాగా జరిగిన విరాచణలో కోర్టు సీరియస్ కామెంట్లు చేసింది. అఫిడవిట్‌ను టాంపర్ చేయడం.. దీనికి కొందరు అధికారులు సహకరించడం వంటి ఆరోపణలపై ఆధారాలను కోర్టుకు సమర్పించాలని.. ఆదేశించింది. అయితే.. ఈవిచారణ పై మీడియాకు ఎలాంటి సమాచారం ఇవ్వవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. విచారణను వచ్చే సోమవారానికి హైకోర్టు వాయిదా వేసింది.
ఏం జరిగింది?
విరసనోళ్ల శ్రీనివాస్ గౌడ్ మహబూబ్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి బీఆర్ ఎస్ టికెట్‌పై 2014, 2018లో ఎమ్మెల్యే గా గెలుపొందారు. ప్రస్తుతం ఆయన ఎక్సైజ్, క్రీడలు, యువజన సర్వీసులు, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖలకు మంత్రిగా ఉన్నారు.
అయితే, 2018 ఎన్నికల్లో శ్రీనివాస్ గౌడ్ ఎన్నికల అఫిడవిట్‌లో తప్పుడు ధ్రువ పత్రాలు సమర్పించారంటూ మహబూబ్‌నగర్ కు చెందిన ఓటరు రాఘవేంద్ర రాజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం .. శ్రీనివాస్ గౌడ్ ఎమ్మెల్యేగా, మంత్రిగా కొనసాగే అర్హత లేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. అదేసమయంలో ప్రజాప్రతినిధుల కోర్టులోనూ అఫిడవిట్‌పై కేసు వేశారు. అయితే.. తనను రాజకీయంగా బద్నాం చేసేందుకు ఇలా ప్రతిపక్షాలు కుట్ర చేశాయని.. సదరు పిటిషన్‌ను కొట్టేయాలని శ్రీనివాస్ గౌడ్ హైకోర్టును కారోరు. కానీ, ఆయన వేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టి వేసింది. దీంతో రాఘవేంద్రరాజు వేసిన పిటిషన్‌పై విచారణ కొనసాగుతుండడం గమనార్హం.