వైసీపీ బొబ్బిలి రాజా ఆయనే...?
బొబ్బిలిలో సైతం ఇటీవల తన పర్యటనలు పెంచేసిన మజ్జి శ్రీను క్యాడర్ కి స్పష్టమైన సంకేతాలు ఇచ్చారని అంటున్నారు.
By: Tupaki Desk | 1 Aug 2023 3:30 AM GMTవిజయనగరం జిల్లాలో బొబ్బిలి అసెంబ్లీ నియోజకవర్గం ఒక ప్రత్యేకమైన సీటు. ప్రతీ ఎన్నికా ఇక్కడ ఒక రాజకీయ సమరాంగణ వేదికగానే సాగుతుంది. బొబ్బిలి మొదటి నుంచి కాంగ్రెస్ వైపుగా ఉంటూ వస్తున్న సీటు. అయితే తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక కొన్ని సార్లు టీడీపీ సైతం గెలిచింది. అయినా కాంగ్రెస్ ఓటు బ్యాంక్ ఎక్కువ.
చిత్రమేంటి అంటే 1983లో టీడీపీ నుంచి మొదటి సారి గెలిచిన శంబంగి చిన అప్పలనాయుడు ఇపుడు వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన వల్లనే మూడు సార్లు టీడీపీ బొబ్బిలిలో గెలవగలింది. శంబంగి తప్ప బొబ్బిలిలో టీడీపీ నుంచి మరో అభ్యర్ధి ఎమ్మెల్యేగా గెలిచింది గత నాలుగు దశాబ్దాల కాలంలో లేనే లేదు.
బొబ్బిలి రాజులు గెలుపుకు సూచికలు. 2004లో బొబ్బిలి వంశీకుల తరవాత తరం నుంచి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన సుజయ క్రిష్ణ రంగారావు వరసగా 2009లలో కాంగ్రెస్ నుంచి 2014లో వైసీపీ నుంచి గెలిచి హ్యాట్రిక్ ఎమ్మెల్యే అయ్యారు. ఆయన 2019లో టీడీపీ సైకిలెక్కి ఓటమి పాలు అయ్యారు. 2024లో ఆయన సోదరుడు బేబీ నాయన పోటీకి సిద్ధపడుతున్నారు.
బొబ్బిలి రాజులకు వ్యక్తిగతంగా ఉన్న ఇమేజ్ కి తోడు, టీడీపీ బలంతో గెలుపు సాధ్యమని లెక్కలేసుకుంటున్నారు. అయితే వైసీపీకి సరైన అభ్యర్ధిని ఆ పార్టీ వెతుకుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే శంబంగి చిన అప్పలనాయుడుని మార్చి కొత్త వారిని దింపాలని భావిస్తోంది.
దానికి తగినట్లుగా సమర్ధుడు అయిన అభ్యర్ధిగా సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ మేనల్లుడు, విజయనగరం జిల్లా వైసీపీ ప్రెసిడెంట్, జెడ్పీ చైర్మన్ అయిన మజ్జి శ్రీనివాసరావుని పోటీకి దించాలని ఆ పార్టీ చూస్తోంది అని అంటున్నారు.
బొబ్బిలిలో తూర్పు కాపుల సామాజికవర్గం అధికంగా ఉంది. అలా ఆ సామాజికవర్గానికి చెందిన మజ్జి శ్రీనుని దించినే వర్కౌట్ అవుతుందని లెక్కలేస్తోంది. అదే నేపధ్యంలో వెలమలలో కూడా వైసీపీకి ఒక బలమైన మద్దతు ఉంది. ఈ రెండు సామాజికవర్గాలను కలుపుకుని ముందుకు సాగితే బొబ్బిలి కోట ముచ్చటగా మూడవసారి వైసీపీ పరం అవుతుంది అని ఆ పార్టీ ధీమా వ్యక్తం చేస్తోంది.
విజయనగరం జిల్లా వైసీపీ రాజకీయాలను ప్రెసిడెంట్ గా ఒంటి చేత్తో తిప్పుతున్న మజ్జి శ్రీను పట్ల వైసీపీ హై కమాండ్ పూర్తి సానుకూలంగా ఉంది అని అంటున్నారు. ఆయన సేవలను ఈసారి అసెంబ్లీలో వినియోగించుకోవాలని చూస్తోంది.
బొబ్బిలిలో సైతం ఇటీవల తన పర్యటనలు పెంచేసిన మజ్జి శ్రీను క్యాడర్ కి స్పష్టమైన సంకేతాలు ఇచ్చారని అంటున్నారు. మరి బొబ్బిలి రాజులకు ఈసారి గెలుపు సాధ్యపడుతుందా, తెలుగుదేశానికి మూడు దశాబ్దాలుగా కనుమరుగు అయిన విజయాన్ని అందిస్తారా అన్నది కూడా చూడాల్సి ఉంటుంది అని అంటున్నారు.