అయ్యో.. గడల, గంప!
ఆ రాష్ట్ర పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు కాగా, మరొకరు కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్దన్.
By: Tupaki Desk | 25 Aug 2023 12:30 AM GMTతెలంగాణలో ఇప్పుడు ఇద్దరి గురించే చర్చ జరుగుతోంది. వీరిలో ఒకరు... ఆ రాష్ట్ర పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు కాగా, మరొకరు కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్దన్.
ముందుగా గడల శ్రీనివాసరావు విషయానికొస్తే కరోనా సమయంలో కరోనా కేసులు, చికిత్స పొందుతున్నవారు, మరణించినవారు.. ఇలా నిత్యం లెక్కలు చెప్పడానికి గడల శ్రీనివాసరావు మీడియా ముందుకొచ్చేవారు. అయితే ఈ కరోనా లెక్కలు తప్పులతడకని పలుమార్లు హైకోర్టు చేత తెలంగాణ ప్రభుత్వంతోపాటు ఆయన చీవాట్లు తిన్నారు.
కరోనా లెక్కలతో మీడియాలో పాపులరైన గడల శ్రీనివాసరావు ఉమ్మడి ఖమ్మం జిల్లా కొత్తగూడెంకు చెందినవారు. మీడియాలో పాపులర్ కావడంతో అప్పటి నుంచి ఆయన కూడా తనను రాజకీయ నాయకుడిలా భావించడం మొదలుపెట్టారు. దీంతో తరచూ తన నియోజకవర్గం కొత్తగూడెంలో పర్యటించడం, ప్రభుత్వ కార్యక్రమాలను పరిశీలించడం, పర్యవేక్షించడం, పాల్గొనడం వంటివి చేశారు.
అంతేకాకుండా కొత్తగూడెం నుంచి బీఆర్‌ఎస్ తరఫున ఎన్నికల్లో పోటీ చేసేది కూడా తానేనంటూ పలుమార్లు గడల శ్రీనివాసరావు ప్రకటనలు కూడా జారీ చేశారు. కొద్ది రోజుల క్రితం ఇంటింటా ప్రచారం కూడా చేపట్టారు.
అందులోనూ ప్రస్తుతం కొత్తగూడెం బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తన కుమారుడి వ్యవహారంలో వివాదాస్పదం కావడం, ఎన్నికల సమయంలో వేసిన అఫడివిట్ లో తప్పుల కారణంగా తెలంగాణ హైకోర్టు ఆయన ఎన్నిక చెల్లదని ప్రకటించడం వంటి కారణాలతో కొత్తగూడెం అభ్యర్థిని తానేనని గడల శ్రీనివాసరావు ప్రకటించకున్నారు. అంతేకాకుండా వనమా వెంకటేశ్వరరావుపై తీవ్ర విమర్శలు కూడా సంధించారు. ఇదే సమయంలో కేసీఆర్ పై ప్రశంసల జల్లు కురిపించారు.
అయితే ఇటీవల కేసీఆర్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే తమ అభ్యర్థుల జాబితాను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ జాబితాలో గడల శ్రీనివాసరావుకు సీటు లభించలేదు. ఆయనను కేసీఆర్ లైట్ తీసుకున్నారు. మళ్లీ బీఆర్‌ఎస్ టికెట్ నున వనమా వెంకటేశ్వరరావుకే కట్టబెట్టారు. దీంతో తానే అభ్యర్థినని చెప్పుకుంటూ వచ్చిన గడల శ్రీనివాసరావు ఢీలా పడ్డారు.
కొత్తగూడెంలో ఒక ఏఎంపీ ఇంట్లో మిరపకాయ పూజలు చేయడంతోపాటు తెలంగాణ భవన్ లో కేసీఆర్ కు రెండు మూడుసార్లు కాళ్లకు మొక్కినా గడలకు సీటు అయితే దక్కలేదు. మరి ఇప్పుడు తెలంగాణ హెల్త్ డైరెక్టర్ గా కొనసాగుతారా లేదంటే రాజీనామా వేరే పార్టీలో చేరి టికెట్ తెచ్చుకుంటారా అనేది వేచిచూడాలి.
ఇక కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ నిజంగా భక్తితో చేశారో, లేక ఓవరాక్షన్ తో చేశారో కానీ కేసీఆర్ ను తన నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని కోరుతూ వచ్చారు. కేసీఆర్ పోటీ చేస్తే తన భుజాల మీదకు ఎత్తుకుని ఆయనను గెలిపిస్తానని గంప గోవర్ధన్ ప్రకటనలు చేశారు. ఎట్టకేలకు గంప కోరుకున్నట్టే కేసీఆర్ కామారెడ్డి నుంచి బరిలోకి దిగుతున్నారు. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండి సీటు తెచ్చుకోలేని వారి జాబితాలో గంప నిలిచిపోయారు. దీంతో ఇక ఆయనకు ఎమ్మెల్సీ పదవి మాత్రమే దక్కేది. అది కూడా కేసీఆర్ ఆశీస్సులు ఉంటేనే.
ఒకవేళ వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ గజ్వేల్, కామారెడ్డి రెండు చోట్ల గెలిస్తే కామారెడ్డికి రాజీనామా చేసే అవకాశం ఉంది. అయితే గంపకు టికెట్ కష్టమేనంటున్నారు. కేసీఆర్ కామారెడ్డికి రాజీనామా చేస్తే ఆ సీటును తన కుమార్తె కవితకు కట్టబెడతారని టాక్ నడుస్తోంది. దీంతో ఇప్పుడు తెలంగాణలో ఎక్కడ చూసినా గడల, గంపలపైనే చర్చ జరుగుతోందని టాక్.