Begin typing your search above and press return to search.

కోడికత్తి ఇష్యూ... విశాఖ జైల్లో శ్రీనివాస్ సంచలన నిర్ణయం!

ఈ నేపథ్యంలోనే విశాఖ జైల్లో మగ్గుతున్న శ్రీనివాస్ కీలక నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తుంది. ఇందులో భాగంగా ఆమరణ నిరాహారదీక్షకు దిగాలని నిర్ణయించుకున్నాడని అంటున్నారు.

By:  Tupaki Desk   |   17 Jan 2024 7:17 AM GMT
కోడికత్తి ఇష్యూ... విశాఖ జైల్లో శ్రీనివాస్  సంచలన నిర్ణయం!
X

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇందులో భాగంగా ప్రస్తుతం విశాఖ జైల్లో ఉన్న జనిపల్లి శ్రీనివాస్ అలియాస్ కోడికత్తి శ్రీను కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఇదే సమయంలో విజయవాడలోని అతడి తల్లి, సోదరుడు కూడా అదే నిర్ణయాన్ని ఫాలో అవుతున్నారని తెలుస్తుంది. దీంతో ఈ ఇష్యూ చర్చనీయాంశంగా మారింది.

అవును... 2018 అక్టోబర్ లో విశాఖపట్నం విమనాశ్రయంలో వైసీపీ అధినేత, అప్పటి విపక్ష నేత వైఎస్ జగన్ పై కోడి కత్తితో దాడి చేసిన వ్యవహారంలో నిందితుడు శ్రీనివాస్ అప్పటి నుంచీ జైల్లోనే ఉన్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో... శ్రీను బెయిల్ కోసం ఆయన కుటుంబ సభ్యులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. దీంతో జైల్లో ఉన్న శ్రీను కీలక నిర్ణయం తీసుకున్నాడు.

అందులో భాగంగా... జైల్లో శ్రీనివాస్, బయట ఆయన కుటుంబం ఆమరణదీక్షకు దిగుతున్నారు. వాస్తవానికి.. వైఎస్ జగన్ ఈ కేసులో కోర్టుకు హాజరు కాలేదు. ఈ కేసు దర్యాప్తు చేస్తున్నది ఎన్.ఐ.ఏ. కావడంతో.. బాధితుడి వాంగ్మూలం లేకుండా బెయిలు ఇచ్చే అవకాశం లేదని తెలుస్తుంది. దీంతో ఈ కేసు ఎటూ తేలకపోవడంతోపాటు బెయిల్ కూడా రాకపోవడంతో నిందితుడు జైలుకు పరిమితమయ్యాడు.

ఈ నేపథ్యంలోనే విశాఖ జైల్లో మగ్గుతున్న శ్రీనివాస్ కీలక నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తుంది. ఇందులో భాగంగా ఆమరణ నిరాహారదీక్షకు దిగాలని నిర్ణయించుకున్నాడని అంటున్నారు. ఈ సందర్భంగా... సీఎం జగన్ కోర్టుకు వచ్చి వాంగ్మూలం ఇవ్వాలని, దాని ఆధారంగా తనకు కోర్టు బెయిల్ ఇస్తుందని చెప్తున్నాడని సమాచారం. అప్పటివరకూ తాను ఆమరణ దీక్ష చేస్తానని చెబుతున్నాడని తెలుస్తుంది.

మరోవైపు జైల్లో శ్రీనివాస్ దీక్ష నిర్ణయం తీసుకున్నారని తెలుస్తున్న వేళ... ఆయన కుటుంబ సభ్యులు కూడా ఇవాళ్టి నుంచి విజయవాడలోని వారి ఇంట్లోనే ఆమరణ దీక్షకు దిగబోతున్నారు. ఇందులో భాగంగా... శ్రీనివాస్ తల్లి, సోదరుడు కూడా అతనికి బెయిల్ ఇవ్వాలని కోరుతూ నిరాహారదీక్ష చేపట్టబోతున్నారు! దీంతో కోడికత్తి శ్రీను ఫ్యామిలీ నిరాహారదీక్షల వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

కాగా... 2018 అక్టోబర్ 25న 294వ రోజు పాదయాత్ర ముగించుకొన్న వైఎస్ జగన్‌ హైదరాబాద్‌ కు తిరిగి వచ్చేందుకు విశాఖపట్నం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు.. ఈ సమయంలో ఆ విమానాశ్రయం క్యాంటీన్ లో పనిచేస్తున్న వెయిటర్‌ సెల్ఫీ తీసుకుంటానని వైఎస్‌ జగన్‌ వద్దకు వచ్చారు. అతను వస్తూనే జగన్‌ పై కోడి కత్తితో దాడి చేశాడు. దీంతో అప్రమత్తమైన సహాయకులు దాడిని అడ్డుకోవడానికి ప్రయత్నించగా.. జగన్‌ భుజానికి గాయం అయ్యింది.