Begin typing your search above and press return to search.

ఈస్ట్ లో ఎమ్మెల్యే రేసులో ఆర్జీవీ హీరోయిన్!

గోపాలపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని అంటున్నారు హీరోయిన్ శ్రీరాపాక. ఈ సందర్భంగా ఆమె ఒక వీడియోను విడుదల చేశారు.

By:  Tupaki Desk   |   12 Jan 2024 6:12 AM GMT
ఈస్ట్  లో ఎమ్మెల్యే రేసులో ఆర్జీవీ హీరోయిన్!
X

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో సీట్ల సర్ధుబాటు వ్యవహారాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ప్రధానంగా అధికార పార్టీలో ఇన్ ఛార్జ్ ల మార్పు వ్యవహారం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అవుతుంది. ఒక్కో నియోజకవర్గానికీ ఇన్ ఛార్జ్ లను ఏర్పాటూ చేయడానికి సవాలక్ష సమీకరణలను జగన్ ప్రాతిపదికగా తీసుకుంటున్నారని అంటున్నారు! ఈ సమయంలో జగన్ అవకాశమిస్తే పోటీ చేస్తానంటూ ఆర్జీవీ హీరోయిన్ తెరపైకి వచ్చారు!

అవును... తూర్పు గోదావరి జిల్లాలోని దేవరపల్లి మండలం, రామన్నపాలెంలో జన్మించిన తనకు సీఎం వైఎస్ జగన్ అనుమతి ఇస్తే.. గోపాలపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని అంటున్నారు హీరోయిన్ శ్రీరాపాక. ఈ సందర్భంగా ఆమె ఒక వీడియోను విడుదల చేశారు. అందులో రాజకీయాల్లో తన ఆసక్తిని వెల్లడించారు. ఇదే సమయంలో ఆర్జీవీ రికమండేషన్ పైనా స్పందించారు.

తాజాగా ఈ విషయాలపై స్పందించిన శ్రీరాపాక... పదోతరగతి వరకూ తాను సొంత ఊరిలోనే ఉన్నట్లు తెలిపారు. అనంతరం ఫ్యాషన్ రంగం వైపు వెళ్లి... సినిమాలకు ఫ్యాషన్ డిజైనర్ గా పనిచేసినట్లు తెలిపారు. ఇందులో భాగంగా సుమారు తెలుగు, తమిళ్, కన్నడ లో సుమారు 50 - 60 సినిమాలకు డిజైనర్ గా వర్క్ చేసినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా జగన్ మోహన్ రెడ్డి కొత్తవారికి కూడా అవకాశాలిస్తూ, కొత్త జనరేషన్ ని ఎంకరేజ్ చేస్తూన్నారని అన్నారు. ఇదే సమయంలో 2014నుంచి తాను కూడా తనస్థాయిలో చిన్న చిన్న సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ కూడా చేస్తున్నట్లు తెలిపారు. అలా చిన్న చిన్నవి కాకుండా... రాజకీయాల్లోకి వస్తే జనాలకు ఇంకా ఎన్నో సేవలు చేయొచ్చని ఆశిస్తున్నట్లు తెలిపారు.

ఈ సందర్భంగా తన ఆకాంక్షను మన్నించి జగన్ మోహన్ రెడ్డి తనకు టిక్కెట్ ఇస్తే... గోపాలపురం నియోజకవర్గానికి మనసా వచా కర్మనా అన్ని విధాలా హార్ట్ ఫుల్ గా, సిన్సియర్ గా సేవ చేస్తానని తెలిపారు. ఇదే సమయంలో దర్శకుడు రాం గోపాల్ వర్మ రికమండేషన్స్ తో పోటీచేస్తున్నట్లు వస్తున్న వార్తలను ఆమె ఖండించారు.

కాగా 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగిరిన సంగతి తెలిసిందే. ఇక్కడ నుంచి తలారి వెంకట్రావ్ 37,461 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు!