Begin typing your search above and press return to search.

ఆశలు ఆవిరి.. విగతజీవులుగా ఆ ఎనిమిది మంది!

మొదట్లో వారు జీవించే ఉండొచ్చని భావించినా..రోజురోజుకూ సొరంగం లోపలి పరిస్థితి చూసినవారికి కార్మికులు బతికుండే అవకాశాలు లేవని అర్థమైపోయింది. అయినా ప్రయత్నాలు మానలేదు.

By:  Tupaki Desk   |   2 March 2025 11:49 AM IST
ఆశలు ఆవిరి.. విగతజీవులుగా ఆ ఎనిమిది మంది!
X

ఎక్కడో ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాల నుంచి పొట్టకూటి కోసం వందల కిలోమీటర్ల దూరం వచ్చారు. బతుకుదెరువు కోసం వస్తే బతుకే లేకుండా పోయింది పాపం. చేస్తున్న పనే ప్రాణం తీయడం, అక్కడే సజీవ సమాధి కావడం అందరినీ కలిచివేస్తోంది. శ్రీశైలం ఎడమ గట్టు కాల్వ (ఎస్ఎల్ బీసీ) టన్నెల్ పైకప్పు కూలిన ఘటనలో చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికులు సజీవ సమాధి అయినట్టు అధికారులు అంచనాకు వచ్చారు. మొదట్లో వారు జీవించే ఉండొచ్చని భావించినా..రోజురోజుకూ సొరంగం లోపలి పరిస్థితి చూసినవారికి కార్మికులు బతికుండే అవకాశాలు లేవని అర్థమైపోయింది. అయినా ప్రయత్నాలు మానలేదు.

ఇందులో భాగంగా శుక్రవారం ఎన్జీఆర్ఐ, జీఎస్ఐ నిపుణులు గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్(జీపీఆర్) టెక్నాలజీ, డాప్లర్ స్కానింగ్ ల ద్వారా మట్టి కింద చిక్కుకున్న వారి కోసం ప్రత్యేకంగా అన్వేషణ చేపట్టగా శనివారం క్లారిటీ వచ్చింది. సొరంగంలో పైకప్పు కూలిన రోజు టన్నెల్ బోరింగ్ మిషన్(టీబీఎం), కట్టర్ల మధ్య పనిచేస్తున్న వారు బయటపడలేకపోయినట్టు భావిస్తున్నారు. ఒక్కసారిగా పెద్దఎత్తున నీరు, మట్టి సొరంగంలోకి చేరడం, టీబీఎం వెలుపలి భాగానికి చేరుకునే సమయం కూడా లేకపోవడంతో అక్కడే చిక్కుకుపోయారన్న అభిప్రాయం వినిపిస్తోంది. వారంతా సొరంగంలో మూడు మీటర్ల లోతులో ఉన్నట్టు గుర్తించారు అధికారులు.

టన్నెల్ లో పేరుకుపోయిన మట్టిని తొలగిస్తున్న బృందాల నిపుణులు దాని దిగువన ఊబిలాంటి పరిస్థితులు ఉన్నట్లు గుర్తించారు. ఈ ప్రాంతంలో ప్రణాళిక లేకుండా ముందుకెళ్తే సహాయ బృందాలు కూడా అందులో చిక్కుకుపోవచ్చని అధికారులు చెబుతున్నారు. ఈ పరిస్థితులు ఎంతో జాగ్రత్తగా పనిచేసే నావికాదళానికి చెందిన కమాండో సేవలు తీసుకోవాలని నిర్ణయించారు. టన్నెల్ లో కట్టర్ ప్రాంతం నుంచి ఊట నీరు భారీగానే వస్తోంది. బురద, మట్టి, రాళ్లను లోకో రైలు వ్యాగన్లలో నింపడానికి అక్కడి నుంచి ట్రాక్ వరకు 300 మీటర్ల దూరం వరకు బృందాలు నీటిలో నడుస్తూ వెళ్లాల్సి వస్తోంది. కార్మికులు కూరుకుపోయిన ప్రాంతాల్లో యాక్షన్ ప్లాన్ రెడీ చేశారు అధికారులు. ఆదివారం ఉదయం నుంచి ఆయా చోట్ల నేరుగా తవ్వకాలు చేపట్టనున్నారు.

ఆదివారం సాయంత్రానికి లేదా రాత్రికి నలుగురి మృతదేహాలను వెలికితీయాలనే లక్ష్యంతో బృందాలు పనిచేస్తున్నాయి. ఇక టీబీఎం కింద చిక్కుకున్న వారిని వెలికితీసేందుకు మరో మూడు, నాలుగు రోజులు పట్టవచ్చని చెబుతున్నారు. ఎక్కడో పుట్టి కూలి కోసం వస్తే అడవుల్లోని సొరంగంలో మట్టిలో కూరుకుపోవడం బాధిత కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.