స్టాలిన్ ఉచ్చులో కమలం విలవిల !
ఇదిలా ఉంటే తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ బీజేపీ మీద మోడీ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారు అని ఇదంతా రాజకీయంగా మామూలే అని అనుకుంటున్నారు కానీ ఆయన ఏకంగా సౌత్ స్టేట్స్ లీడర్స్ ని ఒక చోట చేర్చి మోడీతో ఢీ కొడతారని అసలు ఊహించలేదు.
By: Tupaki Desk | 23 March 2025 6:04 PM ISTరాజకీయాలు అంటే అట్లాగే ఉంటాయి. ఉన్నది లేనట్లుగా లేనిది ఉన్నట్లుగా చేయడమే రాజకీయం. ఈ విద్యలో ఆరి తేరిన వారే అందలాలు అందుకుంటారు. ఇదిలా ఉంటే తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ బీజేపీ మీద మోడీ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారు అని ఇదంతా రాజకీయంగా మామూలే అని అనుకుంటున్నారు కానీ ఆయన ఏకంగా సౌత్ స్టేట్స్ లీడర్స్ ని ఒక చోట చేర్చి మోడీతో ఢీ కొడతారని అసలు ఊహించలేదు.
ఏకంగా నలుగురు సీఎంలు స్టాలిన్ మీటింగ్ కి వచ్చారు. అదే విధంగా ఒక ఉప ముఖ్యమంత్రి. ఒక ప్రధాన రాష్ట్రంలో ప్రతిపక్ష నేతతో పాటు కీలక నేతలు అంతా హాజరయ్యారు. అలా వారిని అందరినీ చేర్చి దక్షిణాదికి బీజేపీ అన్యాయం చేస్తోంది అని ఎలుగెత్తిచాటారు స్టాలిన్.
అంతటితో ఆయన ఊరుకోలేదు. హైదరాబాద్ లో రెండో విడత మీటింగ్ అన్నారు. ప్రజలలోకి ఈ ఇష్యూని తీసుకుని పోవడానికి బహిరంగ సభను కూడా నిర్వహిస్తామని స్పష్టం చేశారు. దాంతో దక్షిణాదిన బలపడడానికి కమలం పార్టీ గత కొన్నాళ్ళుగా చేస్తున్న ప్రయత్నాలకు విఘాతం కలుగుతుంది అన్న ఆందోళన అయితే బీజేపీలో మొదలైంది. ఏపీలో ఎన్డీయేను స్థాపించిన బీజేపీ క్రమంగా తెలంగాణా మీదుగా తమిళనాడులోనూ పట్టు సాధించాలని చూస్తోంది.
అయితే స్టాలిన్ అండ్ కో ఇపుడు చాటి చెబుతున్నట్లుగా సీట్లూ నిధులు అధికారాలు అన్ని విషయాలలో దక్షిణాదికి తీరని అన్యాయం కేంద్రంలోని బీజేపీ చేస్తోంది అంటే అది జనంలోకి వెళ్తే ఇబ్బందే అని భావిస్తోంది. మరీ ముఖ్యంగా ఇవన్నీ సున్నితమైన అంశాలు. దాంతో బీజేపీ ఆలస్యంగా అయినా మేలుకుంది. స్టాలిన్ మీద గట్టిగా తగులుకుంటోంది.
ఆయనది అవినీతి కుటుంబ పాలన అంటోంది. లిక్కర్ స్కాం అని అంటోంది. ఎన్నికల స్టంట్ అంటోంది లేని దానిని తెచ్చి ఇష్యూ చేశారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఘాటుగా విమర్శించారు. దక్షిణాదికి కేంద్రం అన్యాయం చేయదని కూడా ఆయన స్పష్టం చేశారు. స్టాలిన్ లిక్కర్ స్కాం తమ రాష్ట్రంలో జరిగింది అన్న దానికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
అదే విధంగా ఇతర కీలక నేతలు అంతా కూడా స్టాలిన్ మీద మండిపడుతున్నారు. స్టాలిన్ తన రాజకీయం కోసం బీజేపీని బదనాం చేస్తున్నారు అని కూడా ఫైర్ అవుతున్నారు. అయితే ఇండియా కూటమిలో ఇపుడు స్టాలిన్ ధీటైన నేతగా కనిపిస్తున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా ఆయన దక్షిణాదిన కూటమిని కడుతున్నారు.
దాంతో ఉత్తరాదిన తన ప్రాబల్యాన్ని నూరు శాతం విస్తరించుకున్న బీజేపీకి ఇక మిగిలింది దక్షిణాది మాత్రమే. అక్కడే ఆ పార్టీ ఆశలు మెండుగా ఉన్నాయి. పవన్ చరిష్మాతో చంద్రబాబు వంటి ఉద్ధండ నేత సహకారంతో బీజేపీని ఇంకా బలోపేతం చేసుకోవాలని ఆ పార్టీ చూస్తోంది.
ఇపుడు బీజేపీ ఆశలకు విఘాతం కలిగేలా స్టాలిన్ మార్క్ పాలిటిక్స్ ఉండడంతో కమలనాధులకు మింగుడు పడడం లేదని అంటున్నారు. దక్షిణాదికి అన్యాయం చేయమని పదే పదే బీజేపీ పెద్దలు చెప్పుకోవాల్సిన అవసరం ఏర్పడుతోంది. అయితే డీలిమిటేషన్ ఏ విధంగా చేస్తారు అన్నది బీజేపీ ఇప్పటికే స్పష్టంగా చెప్పడం లేదని దక్షిణాది పార్టీల నేతలు అంటున్నారు.
అదే సమయంలో జీఎస్టీ పన్నుల విషయలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగిందా లేదా అని అంటున్నారు. ఈ రకమైన చర్చ కనుక మరింతగా ముదిరితే అసలుకే ఎసరు వస్తుంది అన్నది కమలానికి తెలుసు అంటున్నారు. అయితే బీజేపీ స్టాలిన్ మీద కానీ ఆ మీటింగుకు వెళ్ళి వచ్చిన వారి మీద కానీ విమర్శలు చేస్తే ఉపయోగం లేదని అంటున్నారు. బీజేపీ చేయాల్సింది ఏమైనా ఉంది అంటే సౌత్ కి అన్యాయం జరగకుండా తన చర్యల ద్వారానే ప్రజల విశ్వాసం పొందాలని అంటున్నారు.