స్టాలిన్ పెద్దన్న పాత్ర.. మమత, బాబు అంగీకరిస్తారా?
దక్షిణాది రాష్ట్రాలతోపాటు పశ్చిమబెంగాల్, ఒడిశా, పంజాబ్ రాష్ట్రాల్లోని ముఖ్య నేతలు కూడా తమతో చేతులు కలపాలని స్టాలిన్ కోరుతుండటం హాట్ టాపిక్ గా మారింది.
By: Tupaki Desk | 8 March 2025 11:27 AM ISTదేశ రాజకీయాల్లో చర్చనీయాంశమైన పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజనపై బీజేపీయేతర పక్షాలు ఏకమవ్వాలని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ పిలుపునివ్వడం ఆసక్తిరేపుతోంది. దక్షిణాది రాష్ట్రాలతోపాటు పశ్చిమబెంగాల్, ఒడిశా, పంజాబ్ రాష్ట్రాల్లోని ముఖ్య నేతలు కూడా తమతో చేతులు కలపాలని స్టాలిన్ కోరుతుండటం హాట్ టాపిక్ గా మారింది. వయసు రీత్యా స్టాలిన్ కూడా మోస్ట్ సీనియర్ అయినా ఆయన కంటే సీనియర్ నేతలుగా దేశ రాజకీయాల్లో చక్రం తిప్పిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఒడిసా మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ వంటివారికి స్టాలిన్ లేఖ రాయడమే ఇంట్రస్టింగ్ గా చెబుతున్నారు. వీరిలో చంద్రబాబు తప్ప మిగిలిన వారంతా ప్రస్తుతం బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్నవారే..
దక్షిణాదితో పాటు జనాభా నియంత్రణ పాటించిన ఒడిసా, పశ్చిమబెంగాల్, పంజాబ్ రాష్ట్రాల్లో పార్లమెంటు సీట్లు తగ్గే అవకాశం ఉందని భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. కట్టుదిట్టమైన జనాభా నియంత్రణ పాటించి క్రమశిక్షణగా ఉండటమే తమ తప్పా అంటూ ఆయా రాష్ట్రాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. జనాభా ప్రాతిపదికన పార్లమెంటు సీట్ల పునర్విభజన జరిగితే దక్షిణాదిలోని తమిళనాడు, కర్ణాటక, ఏపీ, తెలంగాణ, కేరళ రాష్ట్రాలకు పార్లమెంటులో ప్రాతినిధ్యం తగ్గిపోతుందని చెబుతున్నారు. అదేవిధంగా పంజాబ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు ఇదే పరిస్థితి ఎదురవుతుందని అంటున్నారు. పార్లమెంటు సీట్లు తగ్గిపోతే తమ రాష్ట్రాల గళం వినిపించే అవకాశం తగ్గిపోతుందని ఆయా రాష్ట్రాల వాసులు ఆందోళన చెందుతున్నారు. అయితే పునర్విభజనపై అనవసర ఆందోళనలు వద్దని కేంద్రం చెబుతున్నా, దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాత్రం బీజేపీ పెద్దల మాటలను నమ్మడం లేదు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తోపాటు ఆయా రాష్ట్రాల్లోని బీజేపీయేతర పార్టీలు కేంద్రంపై పోరాటానికి పిలుపునిస్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే చెన్నైలో ఈ నెల 27న 29 పార్టీలతో సమావేశం నిర్వహించాలని తమిళనాడు సీఎం స్టాలిన్ భావిస్తున్నారు. ఈ సమావేశానికి ఏడు రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆయన ఆహ్వానించారు. ఈ ఏడు రాష్ట్రాల్లోని 29 పార్టీల అధ్యక్షులతోపాటు మాజీ సీఎంలు జగన్, కేసీఆర్, నవీన్ పట్నాయక్ వంటివారిని సమావేశానికి రావాల్సిందిగా స్టాలిన్ ఆహ్వానించడం విశేషంగా చెబుతున్నారు. నియోజకవర్గాల పునర్విభజన కోసం ఉమ్మడి కార్యాచరణ ప్రకటిద్దామని స్టాలిన్ పిలుపునిస్తున్నా, భిన్న ధ్రువాలైన పార్టీల నేతలను ఈ సమావేశానికి ఆహ్వానించడమే ఆసక్తి రేపుతోంది. ముఖ్యంగా జాతీయ రాజకీయాలను ప్రభావితం చేయగలిగే స్థితిలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హాజరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీదీ హాజరుకాకపోయినా, ఆమె తరఫున ప్రతినిధులను పంపే అవకాశం ఉందంటున్నారు. కానీ, ఏపీ సీఎం చంద్రబాబు వెళ్లే అవకాశాలు లేవనే చెబుతున్నారు. తమిళనాడు సీఎం స్టాలిన్ తో వ్యక్తిగతంగా చంద్రబాబుకు మంచి సంబంధాలు ఉన్నప్పటికీ బీజేపీకి వ్యతిరేకంగా జరిగే సమావేశానికి బాబుతోపాటు ఆయన ప్రతినిధులు వెళ్లే పరిస్థితి లేదనే వాదనే వినిపిస్తోంది.
మరోవైపు స్టాలిన్ పిలుపునిచ్చే సమావేశానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు. రేవంత్ తోపాటు తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కూడా బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతోంది. అయినప్పటికీ జాతీయ స్థాయిలో ప్రస్తుతం తటస్థ వైఖరి ప్రదర్శిస్తున్న బీఆర్ఎస్.. తమిళనాడులోని ఇండి కూటమితో వేదిక పంచుకుంటుందా? అనేది ఉత్కంఠ రేపుతోంది. ఇక వైసీపీ అధినేత జగన్ ప్రస్తుత పరిస్థితుల్లో ఇతర పార్టీలతో స్నేహ సహకారం కోరుకుంటున్న బీజేపీతో తెగతెంపులు చేసుకునే సాహసం చేస్తారా? అనేది కూడా సందేహాలు రేపుతోంది. మొత్తానికి బీజేపీకి వ్యతిరేకంగా స్టాలిన్ పిలుపునిచ్చిన సమావేశం ఎన్నో అనుమానాలకు.. మరెన్నో సందేహాలకు తెరలేపుతోంది. బీజేపీపై సంఘటితంగా పోరాడే విషయంలో విపక్షాల అనైక్యత బయటపడితే బీజేపీ అనుకున్న పనిని మరింత వేగంగా పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు. దక్షిణాది రాష్ట్రాల ఉనికి కాపాడుకునే విషయంలో పార్టీలు అన్నీ ఏకమైతేనే బీజేపీ వైఖరి మార్చుకునే పరిస్థితి ఉందంటున్నారు. దీంతో స్టాలిన్ నిర్వహిస్తున్న సమావేశం తీవ్ర ఉత్కంఠకు గురిచేస్తోందంటున్నారు.