Begin typing your search above and press return to search.

జగన్ పై దాడిని ఖండించిన స్టాలిన్....కేటీఆర్ !

జగన్ కి పెద్ద ప్రమాదం తప్పిందని అన్నారు. ఎన్నికల సంఘం ఈ తరహా దాడుల మీద కఠినంగా వ్యవహరించాలని ఆయన డిమాండ్ చేశారు.

By:  Tupaki Desk   |   14 April 2024 4:20 AM GMT
జగన్ పై దాడిని ఖండించిన స్టాలిన్....కేటీఆర్ !
X

ఇది ప్రజాస్వామ్య దేశం. ఇక్కడ విధానాల మీద విభేదాలు ఉండాలి తప్ప నాయకుల మీద కాదు. కానీ రాను రానూ నాయకుల మధ్యనే యుద్ధానికి రంగం సిద్ధం అవుతోంది. ఏపీ చూస్తే మరీ దారుణం. విభజన తరువాత ఉన్న కష్టాలు చాలవన్నట్లుగా మరీ దారుణమైన రాజకీయాలు అక్కడ సాగుతున్నాయి. రెండు పార్టీలు రెండు కులాలు రెండు కుటుంబాలు అన్న వాతావరణమే నేటికీ ఉంది.

రాజకీయ పదవి తన కుటుంబానికే దక్కాలన్న కసి పట్టుదలతో రాజకీయాలు చేయడం అలవాటుగా మారింది. ప్రజలకు కొత్త ఆప్షన్ దొరకడం లేదు. అందుకే ఏపీలో దేశంలో ఎక్కడా లేని విధంగా రాజకీయాలు వ్యక్తిగతం అయిపోయాయి. కులాల మధ్య సంకుల సమరం అయిపోతున్నాయి.

దేనిని కరెక్ట్ గా చూసి విమర్శించే ధోరణి ఏనాడో పోయింది. అన్నీ వక్ర చూపులే వక్ర భాష్యాలే. ఆఖరుకు పరిస్థితి ఎంతదాకా వచ్చింది అంటే భౌతిక దాడులు చేసుకునే దాకా అని చెప్పాల్సి ఉంటుంది. అది ఎవరు అయినా కానీ ఖండించాలి. కానీ ఏపీలో ఆ వాతావరణం కూడా లేకుండా పోతోంది.

పొరుగున ఉన్న తమిళనాడు సీఎం స్టాలిన్ జగన్ మీద జరిగిన రాయి దాడిని ఖండించారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదు అని ఆయన పేర్కొన్నారు. విధానపరమైన పోరాటాలు చేయాలని కోరారు. జగన్ జాగ్రత్త అంటూ బీఅర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ట్వీట్ చేసారు.

జగన్ కి పెద్ద ప్రమాదం తప్పిందని అన్నారు. ఎన్నికల సంఘం ఈ తరహా దాడుల మీద కఠినంగా వ్యవహరించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో దాడులకు తావు లేదని అన్నారు. ఏపీ సీపీఎం కార్యదర్శి శ్రీనివాసరావు సైతం ఖండించారు బాధ్యుల మీద చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

ఇదిలా ఉంటే ఏపీలో జరుగుతున్న ఎన్నికల తీరు, ప్రచారాలు పరస్పర విమర్శలు కూడా తీవ్ర స్థాయికి చేరుకుంటున్నాయి. నాయకులు వేదికలు ఎక్కి తీవ్రంగా రెచ్చగొట్టే భాషనే వాడుతున్నారు. వారు బాగానే ఉంటారు. విని రెచ్చిపోయేది క్యాడరే.వారే ఆవేశానికి లోను అవుతారు. ఫలితంగా భౌతిక దాడులకు తెగ బడతారు.

ఈ పరిస్థితి మారాలంటే నాయకుల నుంచే మార్పు రావాలి. భాషను మార్చుకోవాలి. విమర్శలు హద్దు దాటకుండా చూసుకోవాలి. కానీ ఏపీలో అది సాధ్యమా అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న. అనుకుంటే సాధ్యమే. మరి పిల్లి మెడలో గంట కట్టేదెవరు అన్నది కూడా ప్రశ్న. మొత్తం మీద చూసుకుంటే దాడులు ఎపుడూ ప్రజాస్వామ్యానికి క్షేమకరం కాదు, హింస ఎపుడూ మేలు చేయదు. ఆ సంగతి అంతా గుర్తించాలి.