Begin typing your search above and press return to search.

తమిళ రాజకీయాల్లో రేర్ సీన్.. అమ్మను అభినందించిన స్టాలిన్

కానీ.. తమిళనాడులోని లలిత కళల వర్సిటీకి ముఖ్యమంత్రినే ఛాన్సలర్ గా వ్యవహరించాలంటూ ఈ వర్సిటీని ఏర్పాటు చేసిన జయలలిత ఈ నిర్ణయాన్ని అప్పట్లో తీసుకున్నారు.

By:  Tupaki Desk   |   22 Nov 2023 4:28 AM GMT
తమిళ రాజకీయాల్లో రేర్ సీన్.. అమ్మను అభినందించిన స్టాలిన్
X

రాజకీయాల్లో శాశ్విత శత్రువులు..శాశ్విత మిత్రులు ఉండరన్న మాట తరచూ వినిపిస్తూ ఉంటుంది. ఉప్పు.. నిప్పు లాంటి వారు సైతం చెట్టాపట్టాలేసుకునే రంగంగా రాజకీయాన్ని చెప్పాలి. అలాంటి మేజిక్ ఆ రంగంలోనే కనిపిస్తుంది. తాజాగా అలాంటి రేర్ సీన్ ఒకటి తమిళ రాజకీయాల్లో చోటు చేసుకుంది. కలలో కూడా ప్రత్యర్థుల్ని ఉద్దేశించి ఒక్క మాట అనని తత్త్వం తమిళనాడు రాజకీయాల్లో ఉంటుంది. అందునా.. డీఎంకే.. అన్నాడీఎంకే మధ్య శత్రుత్వం ఎంతలా ఉంటుందో అందరికి తెలిసిందే.

అలాంటిది తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ నోటి నుంచి దివంగత తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి కమ్ అమ్మగా పేరున్న జయలలితను ఉద్దేశిస్తూ మంచిగా మాట్లాడటమే కాదు.. 2013లో ఆమె సీఎంగా ఉన్న వేళలో తీసుకున్న నిర్ణయాన్ని అభినందించిన వైనం ఆసక్తికరంగా మారింది. దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా తమిళనాడులో సంగీత.. లలిత కళల విశ్వవిద్యాలయం ఉండటం.. దానికి ముఖ్యమంత్రి ఛాన్సలర్ గా ఉండటం తెలిసిందే. సాధారణంగా ఏ విశ్వవిద్యాలయమైనా ఛాన్సలర్ గా గవర్నర్ వ్యవహరిస్తారు.

కానీ.. తమిళనాడులోని లలిత కళల వర్సిటీకి ముఖ్యమంత్రినే ఛాన్సలర్ గా వ్యవహరించాలంటూ ఈ వర్సిటీని ఏర్పాటు చేసిన జయలలిత ఈ నిర్ణయాన్ని అప్పట్లో తీసుకున్నారు. దీనిపై తాజాగా తమిళనాడు సీఎం స్టాలిన్ మాట్లాడుతూ.. అప్పట్లో జయలలిత తీసుకున్న నిర్ణయాన్ని ఆయన అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నడిచే వర్సిటీకి సీఎం ఛాన్సలర్ గా ఉండాలన్న నిర్ణయం మంచిదన్నారు.

తాను రాజకీయాలు మాట్లాడటం లేదని.. వాస్తవాలు మాట్లాడుతున్నట్లుగా చెప్పిన ఆయన.. కేవలం ముఖ్యమంత్రి మాత్రమే ఛాన్సలర్ గా ఉంటేనే సదరు విద్యా సంస్థ డెవలప్ అవుతుందన్నారు. ఇతరులు ఈ పదవిలో ఉంటే.. దాన్ని ముందుకు తీసుకెళ్లాలన్న సంకల్పమే ఉండదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకునే వర్సిటీ ఛాన్సరల్ గా సీఎం ఉండాలని అప్పట్లో జయలలిత భావించి ఉండొచ్చన్నారు.

ఇందుకు ఆమెను మనస్ఫూర్తిగా తాను అభినందిస్తున్నట్లు చెప్పారు. ఓవైపు వర్సిటీలకు ఛాన్సలర్లుగా గవర్నర్లు కాకుండా ముఖ్యమంత్రులే ఉండాలన్న మాట పలువురి నోట వస్తున్న సందర్భంలోనే.. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్.. తమ రాజకీయ శత్రువైన దివంగత జయలలితను పొగిడేయటం ఆసక్తికరంగా మారింది. దేశంలో ముఖ్యమంత్రి చాన్సలర్ గా ఉండే ఏకైక విశ్వవిద్యాలయం ఇదేనని ఆయన పేర్కొనటం గమనార్హం.