Begin typing your search above and press return to search.

నా ఎత్తు తెలుసు.. 40 సీట్లున్నా ఆ బాధ్యత ఎత్తుకోలేను

ఎన్నికల ఫలితాలు ఎలా వచ్చినా 20 ఏళ్లుగా యూపీఏలోనే కొనసాగుతోంది డీఎంకే. 2004-14 మధ్య పదేళ్లు కేంద్రంలో అధికారం కూడా పొందింది.

By:  Tupaki Desk   |   5 Jun 2024 3:30 PM GMT
నా ఎత్తు తెలుసు.. 40 సీట్లున్నా ఆ బాధ్యత ఎత్తుకోలేను
X

సరిగ్గా ఆరేడు నెలల కిందట కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా ఉన్న జ్యోతిదిరాదిత్య సింధియా మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల గెలుపు అనంతరం చేసిన వ్యాఖ్యలు గుర్తున్నాయా? ఆయన ఎత్తును ఉద్దేశిస్తూ.. కొంతమంది 5.5 అడుగులే ఉంటారు.. కానీ వారి అహంకారం మాత్రం హిమాలయాలంత.. అని కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ అని అన్నారు. దీనికి స్పందనగా మధ్యప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఓడించిన అనంతరం జ్యోతిరాదిత్య.. స్పందించారు. నా ఎత్తు ఏమిటో చూశారా? అని ఎద్దేవా చేశారు. ఇప్పుడు మరోసారి ‘ఎత్తు’ ప్రస్తావన వచ్చింది. అది కూడా 40 సీట్లు గెలిపించిన పార్టీ నాయకుడి నుంచి..

యూపీఏలో పవర్ ఫుల్

ఎన్నికల ఫలితాలు ఎలా వచ్చినా 20 ఏళ్లుగా యూపీఏలోనే కొనసాగుతోంది డీఎంకే. 2004-14 మధ్య పదేళ్లు కేంద్రంలో అధికారం కూడా పొందింది. ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల ఫలితాల నేపథ్యంలో కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటులో అనూహ్య పరిస్థితులు ఎదురైతే ఇండియా కూటమి ముందుకొచ్చే అవకాశాలూ లేకపోదనే చర్చ నడుస్తోంది. దీనిపై తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌ ను బుధవారం

మీడియా ప్రశ్నించింది. ‘ఇండియా కూటమికి అధికారం దక్కే అవకాశం లభిస్తే.. ప్రధాని అభ్యర్థిగా మీరు ఉంటారా?’ అని అడిగింది.

నాన్న డైలాగ్ ను గుర్తుచేస్తూ..

మీడియా ప్రశ్నకు స్టాలిన్ తనదైన శైలిలో జవాబిచ్చారు. తండ్రి కరుణానిధి తరచూ చెప్పే డైలాగ్ ను ఈ సందర్భంగా ప్రస్తావించారు. ‘నా ఎత్తు ఎంతో నాకు తెలుసు. ఈ సంగతి చాలాసార్లు చెప్పా’ అని సమాధానమిచ్చారు. ఎన్నికల ఫలితాలపై మాట్లాడుతూ.. ‘గత ఎన్నికల్లో తమిళనాడు, పుదుచ్చేరిలో డీఎంకే కూటమికి 39 స్థానాలు వచ్చాయి. ఈసారి మొత్తం 40 సీట్లూ సాధించాం. ఈ గెలుపు నా తండ్రికి అంకితం. చాలా రాష్ట్రాల్లో మోదీ వ్యతిరేక గాలి వీచింది’ అని వ్యాఖ్యానించారు. ఢిల్లీలో ఇండియా కూటమి పార్టీల సమావేశంలో పాల్గొంటానని చెప్పారు.

ఇంతకూ ఏమిటీ ఎత్తు?

కరుణానిధి గతంలో చేశారంటూ స్టాలిన్ ప్రస్తావించిన ‘ఎత్తు’ వ్యాఖ్యలు ఏమిటనేది ఆసక్తికరంగా మారాయి. 70 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కరుణానిధి.. 13 సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచారు. అయినప్పటికీ కేంద్రంలోకి వెళ్లాలన్న ఆలోచన చేయలేదు. 1997లో మాత్రం యునైటెడ్ ఫ్రంట్ దేవెగౌడ ప్రభుత్వం పడిపోయాక.. ప్రధానిగా ఉండమని కరుణానిధిని కోరినట్లు సమాచారం. దీనిపై ఫ్రంట్‌లోని కొంతమంది నేతలు ఆయనను సంప్రదించగా.. ‘నా ఎత్తు ఎంతో నాకు తెలుసు’ అంటూ కరుణానిధి తిరస్కరించినట్లు చెబుతారు. ఇప్పుడు స్టాలిన్ ఆ వ్యాఖ్యలనే గుర్తుచేస్తూ.. పరోక్షంగా తనకు కేంద్రంలోకి వెళ్లే ఆలోచన లేదని స్పష్టం చేశారు.