సంధ్య థియేటర్ వద్ద దారుణం... ‘పుష్ప-2’ తొక్కిసలాటలో మహిళ మృతి!
ఈ సమయంలో.. సంధ్య థియేటర్ వద్ద ఓ విషాదం చోటు చేసుకుంది.
By: Tupaki Desk | 5 Dec 2024 4:25 AM GMTప్రస్తుతం దేశ వ్యాప్తంగా "పుష్ప-2" సందడి నెలకొందని చెప్పినా అతిశయోక్తి కాదు. ఆ సినిమాలో సుకుమార్ మార్క్ టేకింగు, బన్నీ యాక్టింగు, ఫైట్లు, డ్యాన్స్ లు ప్రేక్షకుల్లో జోష్ నింపుతున్నాయి. ఐకాన్ స్టార్ విశ్వరూపం గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయని అంటున్నారు. ఈ సమయంలో.. సంధ్య థియేటర్ వద్ద ఓ విషాదం చోటు చేసుకుంది.
అవును... ప్రస్తుతం ఎక్కడ చూసినా పుష్ప-2 గురించిన చర్చే జరుగుతుంది. ఈ సమయంలో హైదరాబాద్ ఆర్టీసి క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్ లో జరిగిన వేడుకలు ప్రత్యేకంఆ నిలిచాయి. ఈ థియేటర్ లో తన అభిమానులతో కలిసి ప్రీమియర్ చూసేందుకు అల్లు అర్జున్ వచ్చారు. దీంతో భారీ ఎత్తున ఫ్యాన్స్ థియేటర్ వద్ద గుమిగూడారు.
ఈ సమయంలో అల్లూ అర్జున్ ని చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున ఎగబడటంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. దీంతో... వారిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీ ఛార్జ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి (35) అనే మహిళతో పాటు ఆమె కుమారుడు శ్రీతేజ (9) కిందపడిపోయారు.
ఆ భారీ తొక్కిసలాటలో జనం కాళ్ల మధ్య నలిగిపోయినట్లు చెబుతున్నారు. ఈ సమయంలో ఇద్దరూ తీవ్ర గాయాలతో సృహ తప్పారు. వెంటనే పోలీసులు వారిని పక్కకు తీసుకెళ్లి సీపీఆర్ చేశారు. అనంతరం హుటాహుటిన ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయితే.. అక్కడ చికిత్స పొందుతూ తల్లి మృతి చెందారు.
మరోపక్క కుమారుడి పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు. దీంతో... అతడిని నిమ్స్ కు తరలించారు. ఆ బాలుడి పరిస్థితిపై అప్ డేట్ రావాల్సి ఉంది. ఈ సినిమా చూసేందుకు మొత్తం నలుగురు కుటుంబ సభ్యులు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్ కు రాగా.. తల్లి కుమారుడు తొక్కిసలాటలో చిక్కుకున్నారు.
వారిలో తల్లి మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఇదే క్రమంలో మరి కొంతమంది స్వల్పంగా గాయపడ్డట్లు చెబుతున్నారు. ఈ ఘటనపై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై చిత్ర యూనిట్ కానీ, థియేటర్ యాజమాన్యం కానీ ఇంకా స్పందించలేదు!